ఇండియా భద్రతా సన్నద్ధత, ఉక్రెయిన్ పరిణామాలపై సమీక్షించిన మోదీ

ABN , First Publish Date - 2022-03-13T20:07:31+05:30 IST

ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న యుద్ధం, భారత్‌పై ఎలాంటి ప్రభావం ఉండనుందనే అంశాలను..

ఇండియా భద్రతా సన్నద్ధత, ఉక్రెయిన్ పరిణామాలపై సమీక్షించిన మోదీ

న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న యుద్ధం, భారత్‌పై ఎలాంటి ప్రభావం ఉండనుందనే అంశాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారనాడిక్కడ జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో సమీక్షించారు. ఖార్కివ్‌లో అశువులు బాసిన కర్ణాటకకు చెందిన వైద్య విద్యార్థి  నవీన్ శేఖరప్ప మృతదేహాన్ని వెనక్కి తెచ్చేందుకు అన్నివిధాలుగా ప్రయత్నాలు చేయాలని ప్రధాని ఈ సందర్భంగా ఆదేశించారు. కీలక మంత్రులు, ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా, ప్రధాని ప్రిన్సిపల్ సెక్రటరీ పీకే మిశ్రా, రక్షణ కార్యదర్శి అజయ్ కుమార్, విదేశాంగ శాఖ కార్యదర్శి హర్ష వర్ధన్ ష్రింగ్లా హాజరయ్యారు.


ఉక్రెయిన్‌పై ఫిబ్రవరి 24న రష్యా దాడి ప్రారంభించినప్పటి నుంచి అక్కడి వివిధ నగరాల్లో చిక్కుకుపోయిన 20,000 మంది భారతీయులను వెనక్కి తీసుకువచ్చేందుకు భారత ప్రభుత్వం తొలి ప్రాధాన్యం ఇచ్చింది. ఆయా నగరాల్లో చిక్కుకు పోయిన వారిలో ఎక్కువ మంది వైద్య విద్యార్థులు ఉన్నారు. ఇండియాకు ఉన్న మరో ఆందోళన ఆయుధాల సరఫరా అంశం. ఎక్కువ ఆయుధాలను రష్యా నుంచి ఇండియా దిగుమతి చేసుకుంటోంది. దీనిపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సిగ్ గత వారం త్రివిధ దళాధిపతులను కలిసి పరిస్థితిని సమీక్షించారు. రష్యా నుంచి సరఫరా కావాల్సి ఉన్న ఆయుధాలు, డెలివరీ, విడిభాగాల నిల్వలు, మెయింటెనెన్స్ వంటి అంశాలను మంత్రి సమీక్షించారు. విడి భాగాల నిల్వలు ఆరు నెలలకు పైగా సరిపోతాయని రక్షణ విభాగాలు భరోసా ఇచ్చినట్టు అధికారవర్గాలు చెబుతున్నాయి. రష్యాపై పలు ప్రపంచ దేశాలు ఆంక్షలు విధించిన నేపథ్యంలో రష్యా నుంచి ఇండియాకు విడిభాగాలు నిరంతరాయ సరఫరా కష్టం కావచ్చు. ఫైటర్ జెట్స్, ట్యాంకులు, సబ్‌మెరైన్లు నుంచి ఎయిర్ డిఫెన్స్ సిస్టం, ప్రిగేట్స్, రైఫిల్స్ వరకూ భారత సాయుధ బలగాల వద్ద ఉన్న 60 శాతం ఆయుధాలు రష్యా ఆరిజన్ నుంచి సేకరించినవే. ఈ ఆయుధాల్లో కొన్ని ఉక్రెయిన్ కాంపొనెట్స్‌ ఉన్నాయి. రాబోయే సంవత్సరాల్లో అందుబాటులోకి వచ్చే కొన్ని కీలక ఆయుధాల కోసం ఇండియా ఇప్పటికే 12 బిలియన్ డాలర్ల మేరకు రష్యాతో ఒప్పందాలు చేసుకుంది. రష్యా నుంచి రెండు న్యూక్లియర్ బాలిస్టిక్ సబ్‌మెరైన్లను (చక్ర3, చక్ర4) రష్యా లీజ్‌కు తీసుకుంటోంది. అందులో మొదటిది 2025లో భారత్‌కు రానుంది. ఉక్రయెన్‌పై యుద్ధానికి దిగిన రష్యాపై అమెరికా సహా పలు దేశాలు ఆంక్షలు విధించడంతో ఆ ప్రభావం భారత్‌కు రష్యా సరఫరాలపై ఎంతోకొంత ప్రభావ ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Updated Date - 2022-03-13T20:07:31+05:30 IST