న్యూయార్క్ : భారత దేశ ప్రజాస్వామ్యం గొప్పదనాన్ని వివరించడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తనను తాను ఉదాహరణగా చెప్పుకున్నారు. టీ స్టాల్లో తండ్రికి సాయపడిన బాలుడు ఐక్యరాజ్య సమితి సాధారణ సభ (యూఎన్జీఏ)లో మాట్లాడటం నాలుగోసారి అని చెప్పారు. న్యూయార్క్‌లోని ఐక్య రాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో 76వ యూఎన్జీఏ సెషన్‌ను ఉద్దేశించి మోదీ శనివారం మాట్లాడారు.
భారత దేశానికి ప్రజాస్వామ్యమనే గొప్ప సంప్రదాయం ఉందని, దీనికి వేలాది సంవత్సరాల చరిత్ర ఉందని చెప్పారు. ప్రజాస్వామ్యానికి తల్లిగా పేరు పొందిన దేశం నుంచి తాను వచ్చానన్నారు. భారత దేశ ప్రజాస్వామ్యానికి గుర్తింపు చిహ్నం ఆ దేశంలోని వైవిద్ధ్యమేనని చెప్పారు. దేశంలో డజన్లకొద్దీ భాషలు, వందలాది యాసలు ఉన్నాయన్నారు. అదేవిధంగా వేర్వేరు జీవన శైలులు, వంటలు, ఆహారపుటలవాట్లు ఉన్నట్లు తెలిపారు. శక్తిమంతమైన ప్రజాస్వామ్యానికి ఇది గొప్ప ఉదాహరణ అని చెప్పారు.
భారత దేశ ప్రజాస్వామ్యం ఎంత బలమైనదో చెప్పడానికి ఓ ఉదాహరణ చెప్పారు. ఒకప్పుడు తన తండ్రి నిర్వహించే టీ స్టాల్లో సాయపడిన ఓ చిన్న బాలుడు నేడు యూఎన్‌జీఏలో నాలుగోసారి మాట్లాడుతున్నాడని చెప్పారు.
ఈ సంవత్సరం యూఎన్జీఏ సాధారణ చర్చకు ఇతివృత్తం ఏమిటంటే, కోవిడ్-19 నుంచి కోలుకోవడానికి ఆశావాదం ద్వారా సామర్థ్య నిర్మాణం, సుస్థిర పునర్నిర్మాణం, భూ మండలం అవసరాలకు స్పందించడం, ప్రజల హక్కులను గౌరవించడం, ఐక్యరాజ్య సమితిని మరింత బలోపేతం చేయడం.