ఇండో-పసిఫిక్‌పై భారత్ వైఖరి ఇదే : మోదీ

ABN , First Publish Date - 2021-10-28T02:35:26+05:30 IST

ఇండో-పసిఫిక్‌ రీజియన్‌ స్వేచ్ఛాయుతంగా ఉండాలని

ఇండో-పసిఫిక్‌పై భారత్ వైఖరి ఇదే : మోదీ

న్యూఢిల్లీ : ఇండో-పసిఫిక్‌ రీజియన్‌ స్వేచ్ఛాయుతంగా ఉండాలని భారత దేశం పునరుద్ఘాటించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం 16వ తూర్పు ఆసియా సదస్సులో మాట్లాడుతూ, ఇండో-పసిఫిక్ ప్రాంతం స్వేచ్ఛాయుతంగా, అందరికీ సమానావకాశాలు ఉండేవిధంగా ఉండాలని, ఈ ప్రాంతంలో ASEAN సెంట్రలిటీ ఉండాలని పునరుద్ఘాటించారు. 


వర్చువల్ విధానంలో జరిగిన ఈ సమావేశంలో మోదీ మాట్లాడుతూ, బహుళ దేశాల వ్యవస్థ విలువలకు గౌరవాన్ని పెంచడానికి భారత దేశం కట్టుబడి ఉందన్నారు. నిబంధనల ఆధారిత అంతర్జాతీయ వ్యవస్థ ఉండాలని, అన్ని దేశాల సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతలను గౌరవించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. 


గురువారం జరిగే ASEAN-ఇండియా సదస్సులో పాల్గొనడం కోసం ఎదురు చూస్తున్నట్లు మోదీ చెప్పారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో దేశాధినేతల నేతృత్వంలోని వేదిక తూర్పు ఆసియా సదస్సు. 2005లో దీనిని ప్రారంభించారు. అప్పటి నుంచి ఇది తూర్పు ఆసియా వ్యూహాత్మక, భౌగోళిక రాజకీయ పరిణామ క్రమంలో ముఖ్య పాత్రను పోషిస్తోంది. 


16వ తూర్పు ఆసియా సదస్సుకు బ్రూనై ఆతిథ్యమిచ్చింది. ASEAN (ఆగ్నేయాసియా దేశాల సంఘం)లో 10 సభ్య దేశాలు ఉన్నాయి. అవి : బ్రూనై, కాంబోడియా, ఇండోనేషియా, లావోస్, మలేసియా, మయన్మార్, ది ఫిలిప్పైన్స్, సింగపూర్, థాయ్‌లాండ్, వియత్నాం. వీటితోపాటు భారత దేశం, చైనా, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అమెరికా, రష్యా ఈ సదస్సులో పాల్గొంటాయి. 


Updated Date - 2021-10-28T02:35:26+05:30 IST