Abn logo
Sep 25 2021 @ 15:58PM

H-1B visa అంశంపై బైడెన్‌తో PM Modi చర్చ..

వాషింగ్టన్: అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్రమోదీ శుక్రవారం ఉదయం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా అమెరికాలో భారతీయ సమాజం ఎదుర్కొంటున్న పలు సమస్యలపై మోదీ చర్చించారు. దీనిలో భాగంగా భారతీయ నిపుణులకు ఎంతో కీలకమైన హెచ్-1బీ వీసా అంశాన్ని కూడా ప్రధాని ప్రస్తావించినట్లు విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ శృంగ్లా వెల్లడించారు. అమెరికాలో భారత నిపుణుల సమస్యలను ప్రస్తావించినప్పుడు హెచ్-1బీ వీసా గురించి గుర్తు చేసినట్లు శృంగ్లా పేర్కొన్నారు. అమెరికాలో భారతీయ నిపుణులకు లభించే ప్రాధాన్యతను బట్టి ఈ దేశానికి వచ్చేవారి సంఖ్య పెరుగుతుందని చెప్పినట్లు ఆయన తెలిపారు. అలాగే అమెరికాలో ఉన్న భారతీయ సమాజం సామాజిక భద్రత విషయమై కూడా ప్రధాని మాట్లాడారని ఆయన చెప్పారు. అనంతరం వైట్ హౌస్ ఇచ్చిన ఓ నివేదికను ఈ సందర్భంగా శృంగ్లా మీడియాకు వెల్లడించారు. 

ఈ ఏడాదిలో ఇప్పటివరకు భారతీయ విద్యార్థులకు 62వేల వీసాలు మంజూరు చేసినట్లు రిపోర్టులో ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న సుమారు 2లక్షల మంది భారతీయ విద్యార్థుల ద్వారా ఆ దేశ ఖజానాకు ఏటా 7.7 బిలియన్ డాలర్ల(రూ.5.68లక్షల కోట్లు) మేర ఆదాయం వస్తోందని శృంగ్లా పేర్కొన్నారు. ఇక ప్రతియేటా అమెరికా స్వదేశీ సంస్థల్లో విదేశీ నిపుణుల నియామకాల కోసం 65వేల హెచ్-1బీ వీసాలు జారీ చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే అదనపు విద్యార్హతలుగల నిపుణులకు మరో 20వేల వీసాలు జారీ చేస్తోంది. వీటిలో అధిక భాగం వీసాలు పొందేది భారత్, చైనా పౌరులే. ఇదిలాఉంటే.. మోదీతో భేటీ సందర్భంగా అగ్రరాజ్యంలో ఇండో-అమెరికన్ల సేవలను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కొనియాడారు. నలభై లక్షల మంది భారతీయ అమెరికన్లు అమెరికాను నిత్యం బలోపేతం చేస్తున్నారని బైడెన్‌ పేర్కొన్నారు. 

ఇవి కూడా చదవండిImage Caption

తాజా వార్తలుమరిన్ని...