టాటా గ్రూప్‌పై మోదీ ప్రశంసల జల్లు

ABN , First Publish Date - 2021-04-21T19:43:06+05:30 IST

కోవిడ్-19 మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో టాటా గ్రూప్ కారుణ్యం

టాటా గ్రూప్‌పై మోదీ ప్రశంసల జల్లు

న్యూఢిల్లీ : కోవిడ్-19 మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో టాటా గ్రూప్ కారుణ్యం ప్రదర్శిస్తోందని ప్రధాన మత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. లిక్విడ్ ఆక్సిజన్ రవాణా కోసం 24 క్రయోజనిక్ కంటెయినర్లను దిగుమతి చేసుకుంటామని టాటా గ్రూప్ ప్రకటించిన నేపథ్యంలో మోదీ ఈ విధంగా స్పందించారు. 


టాటా గ్రూప్ ఇచ్చిన ట్వీట్‌లో, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ప్రజలకు చేసిన విజ్ఞప్తి ప్రశంసనీయమని తెలిపింది. కోవిడ్-19 మహమ్మారిపై పోరాటాన్ని బలోపేతం చేయడానికి చేయగలిగినదంతా చేయడానికి తాము కట్టుబడి ఉన్నామని తెలిపింది. ఆక్సిజన్ సంక్షోభాన్ని తగ్గించేందుకు, ఆరోగ్య సంరక్షణ రంగంలో మౌలిక సదుపాయాలను పటిష్టపరిచేందుకు తాము 24 క్రయోజనిక్ కంటెయినర్లను దిగుమతి చేసుకుంటున్నట్లు తెలిపింది. లిక్విడ్ ఆక్సిజన్‌ను రవాణా చేసేందుకు ఈ కంటెయినర్లు ఉపయోగపడతాయని పేర్కొంది. దీనివల్ల దేశంలో ఆక్సిజన్ కొరత సమస్యను పరిష్కరించవచ్చునని వివరించింది. 


టాటా గ్రూప్ ట్వీట్ వచ్చిన కొద్ది నిమిషాలకే మోదీ స్పందిస్తూ, టాటా గ్రూప్ కారుణ్యంతో వ్యవహరిస్తోందని ప్రశంసించారు. భారతీయులంతా కలిసికట్టుగా కోవిడ్-19 మహమ్మారిపై పోరాడుదామని పేర్కొన్నారు. 


టాటా గ్రూప్ సంస్థల దాతృత్వం అందరికీ తెలిసిందే. అనేక సందర్భాల్లో ఈ సంస్థలు ప్రజలకు వివిధ రూపాల్లో సేవలందిస్తున్నాయి. టాటా ట్రస్ట్ గత ఏడాది  కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో రూ.1,500 కోట్లు కేటాయించింది. కేరళలో ఆరు వారాల్లోనే ఓ ఆసుపత్రిని నిర్మించింది. వెంటిలేటర్లు, పీపీఈ కిట్లు, టెస్టింగ్ కిట్లు వంటివాటిని అందజేసింది. ఈ మహమ్మారి విజృంభిస్తుండటంతో ఢిల్లీ, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు పెరగడంతోపాటు ఆక్సిజన్ కొరత ఏర్పడింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. తమ రాష్ట్రానికి రావలసిన ఆక్సిజన్‌ను ఇతర రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం తరలిస్తోందని ఆరోపించారు. 


Updated Date - 2021-04-21T19:43:06+05:30 IST