కువైత్ ప్రధానికి మోదీ ఫోన్

ABN , First Publish Date - 2020-04-03T12:30:04+05:30 IST

విశ్వవ్యాప్తంగా పెరిగిపోతున్న కరోనా మహమ్మారి నేపథ్యంలో దాన్ని అరికట్టే దిశగా పరస్పర చర్యలు చేపట్టే విషయమై భారత ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం కువైత్ ప్రధాని శేఖ్ ఖాలీద్ అల్ సభాకు ఫోన్ చేసి చర్చించారని కువైత్ అధికారిక వార్త సంస్ధ వెల్లడించింది.

కువైత్ ప్రధానికి మోదీ ఫోన్

కరోనా భాదితులు మరియు ప్రత్యేక‌ విమానాలపై ఆరా

లబ్దిదారులలో ఆంధ్రప్రదేశ్ ప్రవాసీయులు అగ్రస్ధానం

ఆంధ్ర‌జ్యోతి గల్ఫ్ ప్రతినిధి: విశ్వవ్యాప్తంగా పెరిగిపోతున్న కరోనా మహమ్మారి నేపథ్యంలో దాన్ని అరికట్టే దిశగా పరస్పర చర్యలు చేపట్టే విషయమై భారత ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం కువైత్ ప్రధాని శేఖ్ ఖాలీద్ అల్ సభాకు ఫోన్ చేసి చర్చించారని కువైత్ అధికారిక వార్త సంస్ధ వెల్లడించింది. ​కరోనా వ్యాప్తి నిర్మూలనకు ఇరు దేశాలు తీసుకోవాల్సిన చర్యలు మరియు పరస్పర సహాకారం కొరకు ఇరు దేశాధినేతలు చర్చించారని కువైత్ ప్రభుత్వం వెల్లడించింది. కరోనా నిర్మూలనతో పాటు ఇతర ప్రాంతీయ, అంతర్జాతీయ ఆంశాలపై కూడ రెండు దేశాల ప్రధానులు చర్చించారు.


​పెరిగిపోతున్న కరోనా మహమ్మారి నేపథ్యంలో కువైత్‌లో సరైన వీసా లేకుండా ఉంటున్న విదేశీయులందరితో పాటు భారతీయులు కూడ స్వచ్ఛంధంగా తిరిగి వెళ్ళిపోవడానికి కువైత్ ప్రభుత్వం ప్రకటించిన అమ్నెస్టి మొద‌టి రోజే ప్రధాని నరేంద్ర మోదీ కువైత్ ప్రధానికి ఫోన్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకొంది. కువైత్‌లో ఇప్పటి వరకు కరోనా వ్యాధి సోకినట్లుగా నిర్ధారితమైన విదేశీయుల‌లో భారతీయులు అధిక‌ సంఖ్యలో ఉన్నారు. తాము విమానాలను ఏర్పాటు చేస్తామని, మాతృభూమికి తిరిగి వెళ్లాల‌నుకునే భారతీయులందర్ని స్వదేశానికి అనుమతించాలని కువైత్ ఒత్తిడి చేస్తుంది.


​స్వదేశానికి తిరిగి వెళ్లాల‌నుకునే ప్రవాసీయులకు అవసరమైన పాస్ పోర్టులు మరియు ఇతరత్రా సహాయార్ధం భారతీయ ఎంబసీ,  ప్రవాసీ సంఘాలు ఏర్పాట్లు చేశాయి. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్ర‌వాసీయుల‌ను కలిపి ఒక్క గ్రూప్‌గా ఏర్పాటు చేయడం జ‌రిగింది. దాని సంబంధింత సంఘాల ప్రతినిధులు దరఖాస్తులను స్వీకరించి, వాటిని నేరుగా అందిస్తారని ఎంబసీ ప్రకటించింది. ఇక కువైత్‌లో అక్రమంగా ఉంటున్న భారతీయులలో ఆంధ్రప్రదేశ్ వారి సంఖ్య ఎక్కువగా ఉన్న‌ట్లు స‌మాచారం.

Updated Date - 2020-04-03T12:30:04+05:30 IST