కీలక మంత్రులతో మోదీ మరోసారి భేటీ

ABN , First Publish Date - 2021-12-01T20:23:54+05:30 IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం తన మంత్రివర్గంలోని

కీలక మంత్రులతో మోదీ మరోసారి భేటీ

న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం తన మంత్రివర్గంలోని అత్యున్నత స్థాయి మంత్రులతో సమావేశమయ్యారు. 12 మంది రాజ్యసభ సభ్యులను సస్పెండ్ చేయడంపై పార్లమెంటులో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతున్న నేపథ్యంలో అనుసరించవలసిన వ్యూహాలపై చర్చించారు. ఈ సమావేశంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, రోడ్డు రవాణా, హైవేల మంత్రి నితిన్ గడ్కరీ, న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ పాల్గొన్నారు. 


మోదీ మంగళవారం కూడా సీనియర్ కేబినెట్ సహచరులతో సమావేశం నిర్వహించారు. 12 మంది రాజ్యసభ సభ్యులను పార్లమెంటు శీతాకాల సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ ప్రతిపక్షాలు బుధవారం ఉదయం పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించాయి. ప్రతిపక్ష నేతలంతా యునైటెడ్ ఫ్రంట్‌గా ఏర్పడి, ఉమ్మడిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సహా, కాంగ్రెస్, టీఎంసీ, సమాజ్‌వాదీ పార్టీ, డీఎంకే, శివసేన, టీఆర్ఎస్, ఎన్‌సీపీ, సీపీఎం, సీపీఐ, ఆర్జేడీ, ఐయూఎంఎల్, ఎన్‌సీ, ఎల్‌జేడీ, ఆర్ఎస్‌పీ, కేరళ కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. ఇప్పటి వరకు ప్రతిపక్షాల సమావేశాలకు దూరంగా ఉన్న టీఎంసీ కూడా పాల్గొనడం విశేషం. రాజ్యసభ ఎంపీలపై సస్పెన్షన్‌ను ఉపసంహరించాలని వీరంతా సమైక్యంగా డిమాండ్ చేశారు. 


Updated Date - 2021-12-01T20:23:54+05:30 IST