పవిత్ర కాశీ నగరంలో అర్దరాత్రి PM Modi తనిఖీలు

ABN , First Publish Date - 2021-12-14T13:49:09+05:30 IST

తన సొంత నియోజకవర్గమైన వారాణసీలో కాశీ విశ్వనాథ్ థామ్ ప్రారంభోత్సవానికి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోమవారం అర్దరాత్రి తర్వాత కాశీ నగరంలో కలియ తిరుగుతూ...

పవిత్ర కాశీ నగరంలో అర్దరాత్రి PM Modi తనిఖీలు

వారాణసీ: తన సొంత నియోజకవర్గమైన వారాణసీలో కాశీ విశ్వనాథ్ థామ్ ప్రారంభోత్సవానికి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోమవారం అర్దరాత్రి తర్వాత కాశీ నగరంలో కలియ తిరుగుతూ అభివృద్ధి పనులను తనిఖీలు చేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వెంటరాగా ప్రధాని మోదీ వారాణసీలో అర్దరాత్రి తనిఖీలు చేశారు. ‘‘పవిత్ర కాశీ నగరంలో కీలకమైన అభివృద్ధి పనులను పరిశీలించాం. ఈ పవిత్ర నగరానికి సాధ్యమైనంత ఉత్తమమైన మౌలిక సదుపాయాలను సృష్టించడానికి మేం ప్రయత్నం చేస్తున్నాం’’ అని ప్రధాని మోదీ మంగళవారం ట్వీట్ చేశారు.ప్రధాని మోదీ స్థానికులతోనూ సంభాషిస్తూ తనను అభినందించడానికి వచ్చిన ప్రజల వైపు చేతులు ఊపారు.వారణాసిలో సోమవారం బీజేపీ ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. 


సీఎంలతో సమావేశం అనంతరం ‘‘కాశీలో బీజేపీ ముఖ్యమంత్రులు,  ఉప ముఖ్యమంత్రులతో విస్తృత సమావేశం ముగిసింది’’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. మోదీ అర్దరాత్రి వరకు సమావేశం అయ్యారు. 6గంటల పాటు ప్రధాని మోదీతో సమావేశం అయిన తర్వాత అసోం రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిస్వాశర్మ ట్వీట్ చేశారు. ‘‘6 గంటల సుధీర్ఘ చర్చల అనంతరం మెరుగైన భారతదేశాన్ని తయారు చేయాలనే దృక్పథంతో మాకు జ్ఞానోదయం చేసినందుకు నరేంద్ర మోడీ జీకి ధన్యవాదాలు’’ అని సీఎం శర్మ ట్వీట్ చేశారు.



డిసెంబర్ 14 మధ్యాహ్నం 3:30 గంటలకు, స్వర్వేద్ మహామందిర్‌లో సద్గురు సదాఫల్దీయో విహంగం యోగ్ సంస్థాన్ 98వ వార్షికోత్సవ వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొంటారు.బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు మంగళవారం ఉదయం ప్రధాని మోదీ ముందు సుపరిపాలనపై ప్రజెంటేషన్ ఇచ్చారు. కాశీ విశ్వనాథ ఆలయాన్ని మంగళవారం ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు సందర్శించి పూజలు జరిపారు.

Updated Date - 2021-12-14T13:49:09+05:30 IST