IT Revolution : 5జీ సేవలపై ముకేశ్ అంబానీ వాగ్దానం

ABN , First Publish Date - 2022-10-01T18:07:51+05:30 IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) శనివారం 5జీ స్పెక్ట్రమ్

IT Revolution : 5జీ సేవలపై ముకేశ్ అంబానీ వాగ్దానం

న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) శనివారం 5జీ స్పెక్ట్రమ్ సేవలను ప్రారంభించారు. అంతకుముందు ఆయన 6వ ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ (IMC)ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ (Mukesh Ambani) మాట్లాడుతూ, 2023 డిసెంబరునాటికి దేశంలోని అన్ని ప్రాంతాలకు 5జీ సేవలను అందుబాటులోకి తెస్తామని వాగ్దానం చేశారు. 




న్యూఢిల్లీలోని ప్రగతి మైదానంలో జరిగిన 6వ ఇండియా మొబైల్ కాంగ్రెస్‌లో ముకేశ్ అంబానీ మాట్లాడుతూ, దేశంలోని ప్రతి పట్టణానికి, ప్రతి తాలూకాకు జియో (Jio) 5జీ టెలిఫోనీ సర్వీసులను అందజేస్తామని చెప్పారు. 5జీ ప్రారంభమవడంతో ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ ఇక ఆసియన్ మొబైల్ కాంగ్రెస్, గ్లోబల్ మొబైల్ కాంగ్రెస్ అవాలని చెప్పారు. దీనికి నాయకత్వం వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కృత్రిమ మేధాశక్తి, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, రోబోటిక్స్, బ్లాక్‌చైన్, మెటావెర్స్ వంటి 21వ శతాబ్దపు ఇతర టెక్నాలజీల సంపూర్ణ సామర్థ్యాన్ని అందుబాటులోకి తేవడానికి 5జీ సేవలు పునాదివంటివని తెలిపారు. 




నవ శకానికి నాంది : సునీల్ భారతి మిట్టల్

భారతి ఎంటర్‌ప్రైజెస్ వ్యవస్థాపకుడు, చైర్మన్ సునీల్ భారతి మిట్టల్ మాట్లాడుతూ, భారత దేశంలో 5జీ సేవలు ప్రారంభంకావడంతో నవ శకం ప్రారంభం కాబోతోందని చెప్పారు. ఈ రోజు చాలా ముఖ్యమైనదని, ఓ నవ శకం ప్రారంభం కాబోతోందని చెప్పారు. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్ళు పూర్తవుతున్న ఏడాదిలో ఇది జరుగుతోందన్నారు. దీంతో దేశంలో నూతన చైతన్యం, నూతన శక్తి, సామర్థ్యాలు మొగ్గ తొడుగుతాయని తెలిపారు. ప్రజలకు అనేక కొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. 




సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు

కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ 5జీ సేవలు ప్రారంభమైన సందర్భంగా భారత దేశాన్ని అభినందించారు. ఈరోజు సువర్ణాక్షరాలతో రికార్డులకు ఎక్కుతుందన్నారు. డిజిటల్ ఇండియాకు టెలికాం రంగం ముఖద్వారమని, పునాది అని చెప్పారు. డిజిటల్ సర్వీసెస్‌ను ప్రతి వ్యక్తి చెంతకు  చేర్చే మాధ్యమమని తెలిపారు. టెలికాం రంగంలో అనుమతులను చాలా సులువుగా ఇచ్చినట్లు తెలిపారు. 


ఎన్నో ప్రయోజనాలు

ప్రధాని మోదీ ఇండియా మొబైల్ కాంగ్రెస్‌ను, 5జీ సేవలను ప్రారంభించిన అనంతరం ఎగ్జిబిషన్‌ను తిలకించారు. 5జీ టెలికాం సర్వీసులు అందుబాటులోకి వస్తే వినియోగదారులకు నిరంతరాయ సేవలు లభిస్తాయి. డేటా రేటు అత్యధికంగా ఉంటుంది. అత్యధిక డేటాను గతంలో కన్నా వేగంగా ప్రాసెస్ చేయగలిగే సామర్థ్యం లభిస్తుంది. కమ్యూనికేషన్ సిస్టమ్స్ మరింత ఎక్కువ విశ్వసనీయతతో, ఆధారపడదగినవిగా పని చేయగలుగుతాయి. 


Updated Date - 2022-10-01T18:07:51+05:30 IST