Abn logo
Sep 26 2021 @ 14:30PM

సియాచిన్‌లో జెండా ఎగురవేసిన దివ్యాంగులకు మోదీ ప్రశంసలు

న్యూఢిల్లీ : సియాచిన్ మంచు కొండల్లో జాతీయ జెండాను ఎగురవేసిన దివ్యాంగుల బృందాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. దాదాపు 15 వేల అడుగుల ఎత్తులోని కుమార్ పోస్ట్ వద్ద జెండాను ఎగురవేసి, ప్రపంచ రికార్డు సృష్టించారని, ఈ సాహసకృత్యం యావత్తు దేశానికి ప్రేరణనిస్తుందని తెలిపారు. మన్ కీ బాత్ రేడియో కార్యక్రమంలో మోదీ ఈ బృందాన్ని ప్రశంసించారు. 


సియాచిన్ మంచు కొండల గురించి మనందరికీ తెలుసునన్నారు. అక్కడ నివసించే సామర్థ్యం సామాన్యులకు ఉండదని చెప్పారు. కొద్ది రోజుల క్రితం ఎనిమిది మంది దివ్యాంగుల బృందం సాధించిన ఘనత యావత్తు దేశానికి ప్రేరణనిస్తుందని చెప్పారు. ప్రవేశించడం సాధ్యంకాని ఈ ప్రాంతంలో దివ్యాంగులు చేసిన సాహసం ప్రతి భారతీయునికీ గర్వకారణమని తెలిపారు. ఈ బృందం జాతీయ జెండాను దాదాపు 15 వేల అడుగుల ఎత్తులోని కుమార్ పోస్ట్ వద్ద ఎగురవేసి ప్రపంచ రికార్డు సృష్టించిందన్నారు. 


ఈ బృందంలోని దివ్యాంగుల గురించి తెలుసుకునేవారిలో తనలాగే ఉత్తేజం, ధైర్యం కలుగుతాయని తెలిపారు. ఈ బృందంలో ఉత్తరాఖండ్‌కు చెందిన మహేశ్ నెహ్రా, అక్షత్ రావత్; మహారాష్ట్రవాసి పుష్పక్ గవాండే, హర్యానాకు చెందిన అజయ్ కుమార్, లడఖ్‌వాసి లోబ్సంగ్ ఛోస్పెల్, తమిళనాడువాసి మేజర్ ద్వారకేశ్, జమ్మూ-కశ్మీరుకు చెందిన ఇర్ఫాన్ అహ్మద్ మిర్, హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన చోంగ్‌జిన్ ఇంగ్మో ఉన్నారన్నారు. 


‘‘మేం సాధించగలం’’ అనే సంస్కృతి, ‘‘మేం చేయగలం’’ అనే దృఢ నిశ్చయం, ‘‘మేం చేయగలం’’ అనే వైఖరితో ప్రతి సవాలును ఎదుర్కొనే భారతీయుల సత్తాను ఈ విజయం చాటుతోందన్నారు. చారిత్రక, మునుపెన్నడూ లేని విజయాన్ని సాధించిన బృందాన్ని ప్రశంసిస్తున్నానని తెలిపారు. ఇండియన్ ఆర్మీలోని వెటరన్స్ సియాచిన్ గ్లేసియర్‌పై విజయం సాధించడానికి దోహదపడ్డారని తెలిపారు. 


దివ్యాంగుల సంక్షేమం కోసం తన ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందని చెప్పారు. ఉత్తర ప్రదేశ్‌లోని డభౌరా గంగాపూర్ స్కూల్ ప్రిన్సిపాల్ దీప్‌మాల పాండే నేతృత్వంలో దివ్యాంగుల కోసం జరుగుతున్న కార్యక్రమాన్ని ప్రశంసించారు. ‘వన్ టీచర్, వన్ కాల్’ పేరుతో బరేలీలో జరుగుతున్న ఈ కార్యక్రమం దివ్యాంగులకు నూతన మార్గాన్ని చూపుతోందన్నారు.