సరిహద్దుల్లో సైనికులతో కలిసి ప్రధాని మోదీ Diwali సంబరాలు

ABN , First Publish Date - 2021-11-04T17:01:01+05:30 IST

జమ్మూకశ్మీరులోని రాజౌరీ జిల్లా నౌషెరా ఆర్మీ క్యాంపులో గురువారం ప్రధాని నరేంద్రమోదీ సైనికులతో కలిసి దీపావళి ఉత్సవాలు జరుపుకున్నారు....

సరిహద్దుల్లో సైనికులతో కలిసి ప్రధాని మోదీ Diwali సంబరాలు

 జమ్మూ: జమ్మూకశ్మీరులోని రాజౌరీ జిల్లా నౌషెరా ఆర్మీ క్యాంపులో గురువారం ప్రధాని నరేంద్రమోదీ సైనికులతో కలిసి  దీపావళి ఉత్సవాలు జరుపుకున్నారు. ప్రధాని మోదీ ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో జమ్మూ వచ్చారు. అక్కడి నుంచి రాజౌరీ జిల్లా నౌషెరా సరిహద్దు నియంత్రణ రేఖ వద్దకు ప్రధాని మోదీ వచ్చారు. 2014లో ప్రధానమంత్రి అయిన నరేంద్రమోదీ నాటి నుంచి ప్రతి దీపావళి పండుగను సరిహద్దుల్లోని సైనికులతో కలిసి జరుపుకునేవారు.రోమ్, యూకేలలో 5రోజులపాటు పర్యటించి కాప్ 26 వాతావరణ సదస్సులో పాల్గొని వచ్చిన మోదీ గురువారం సరిహద్దులకు వచ్చారు.ఆర్మీ సిబ్బందితో కలిసి దీపావళి జరుపుకునే అలవాటును కొనసాగిస్తూ గురువారం ఉదయాన్నే మోదీ నౌషెరా పట్టణానికి చేరుకున్నారు.మోదీ ఆర్మీ దుస్తులు ధరించి, తలపై టోపి పెట్టుకొని ఆర్మీ శిబిరాలను సందర్శించారు.


జమ్మూకు రాగానే మోదీ ఆర్మీ ఉన్నతాధికారులు, ఇతర జవాన్లను కలిశారు.మోదీ సైనికులతో కలిసి దీపావళి జరుపుకునేందుకు సరిహద్దు ఔట్‌పోస్టులను సందర్శించారు.ఆర్మీ జవాన్లతో కలిసి ప్రధాని మోదీ దీపావళి జరుపుకోవడం ఇదే తొలిసారి కాదు. 2014లో ప్రధాని అయినప్పటి నుంచి ప్రధాని మోదీ దీపావళి రోజున సరిహద్దు ఔట్‌పోస్టులకు నిత్యం వస్తుంటారు. అంతకుముందు ఆయన ఉత్తరాఖండ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, జమ్మూకశ్మీర్ వంటి రాష్ట్రాల్లో పర్యటించారు. ప్రధాని మోదీ 2019లో కూడా రాజౌరీలో సైనికులతో కలిసి దీపావళి సంబరాలు జరుపుకున్నారు.


ప్రధాని మోదీ పర్యటనకు ముందు ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవాణే ఈ ప్రాంతాలపై వైమానిక నిఘా పెట్టారు. జమ్మూ ప్రాంతంలోని నియంత్రణ రేఖ వెంబడి ప్రస్తుతమున్న భద్రతా పరిస్థితుల గురించి ప్రధానికి ఆర్మీ చీఫ్ జనరల్ వివరించారు.ప్ర‌ధాన మంత్రి దీపావ‌ళి సంద‌ర్భంగా ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు.‘‘దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని దేశ ప్రజలకు శుభాకాంక్షలు. ఈ వెలుగుల పండుగ మీ జీవితంలో ఆనందం, శ్రేయస్సు, అదృష్టాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నాను. అందరికీ దీపావళి శుభాకాంక్షలు’’ అని ప్రధాన మంత్రి ట్వీట్ చేశారు.

Updated Date - 2021-11-04T17:01:01+05:30 IST