మోదీ ఫామ్ హౌస్ పీఎం కాదు.. సీఎం కేసీఆర్‌పై విజయశాంతి సెటైర్

ABN , First Publish Date - 2022-06-30T04:24:56+05:30 IST

జులై 2,3 తేదీల్లో నగరంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరనున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. నగరంలో ....

మోదీ ఫామ్ హౌస్ పీఎం కాదు.. సీఎం కేసీఆర్‌పై విజయశాంతి సెటైర్

హైదరాబాద్ (Hyderabad): జులై 2,3 తేదీల్లో నగరంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరనున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. నగరంలో బీజేపీ నేతలకు సంబంధించిన ఫెక్సీలు ఏర్పాటు చేస్తున్నాయి. అయితే హైదరాబాద్‎లోని మెట్రో, ప్రధాన కూడళ్ల వద్ద టీఆర్ఎస్ ఫెక్సీలు, బ్యానర్లు కనిపిస్తున్నాయి. ప్రధాని మోదీ (Pm Modi), బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (Jp Nadda)కు ఆహ్వానం పలుకుతూ హోర్డింగ్స్ ఏర్పాటు చేసేందుకు అవకాశం లేకుండా టీఆర్ఎస్ (Trs) హోర్డింగ్స్ ఉన్నాయి. దీంతో బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ మహిళా నాయకులు విజయశాంతి (Vijayashanthi) కూడా ఫైర్ అయ్యారు. సీఎం కేసీఆర్ కుటిలబుద్ధి మరోసారి బ‌య‌ట‌ప‌డిందని మండిపడ్డారు. తెలంగాణ‌కు ప్ర‌ధాని మోడీ వ‌స్తుంటే సీఎం కేసీఆర్ పేరు ఎక్క‌డ విన‌బ‌డ‌కుండా పోతుందోన‌ని భ‌యం ప‌ట్టుకుందని ఎద్దేవా చేశారు.  అందుకే ప్ర‌జాధనంతో న‌గ‌రం మొత్తం హోర్డింగ్స్ పెట్టిస్తున్నాడని విమర్శించారు. 


‘‘హైదరాబాద్‌లోని మెట్రో పిల్లర్లు, హోర్డింగ్స్‌ని రాష్ట్ర సర్కార్ ప్రకటనలతో ముంచెత్తుతోంది. సిటీలోని ప్రధాన ప్రాంతాల్లో పెద్ద దొర సీఎం కేసీఆర్ (Cm Kcr), చిన్న దొర‌ మంత్రి కేటీఆర్ (Minister Ktr) చిత్రాల ఫ్లెక్సీలు భారీ ఎత్తున ఏర్పాటు చేసింది. వారం రోజుల పాటు ఈ ప్రచార హోరు కొనసాగనుంది. ఇందుకోసం కోట్లాది రూపాయల ప్ర‌జాధనం ఖర్చు చేస్తున్నారు. కేసీఆర్... బీజేపీ (Bjp)కి పోటీగా ఎన్ని హోర్డింగ్స్ అయినా పెట్టుకో... కానీ ప్ర‌జ‌ల పైస‌ల‌తో ప్ర‌చారం చేసుకునే హ‌క్కు నీకు ఎవ‌రిచ్చారు?.  ముఖ్య‌మంత్రి ప‌ద‌వి అంటే నిజాం రాజు ప‌ద‌వి అనుకుంటున్నావా?. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు, మోడీ సభ జరగనున్న రోజుల్లో బీజేపీకి సరైన ప్రచారం లభించకుండా కేసీఆర్ చిల్ల‌ర‌ ఎత్తుగడ వేశాడు. కేసీఆర్ లాగా ప్రధాని నరేంద్ర మోడీ ఫామ్ హౌస్ పీఎం కాదు. ప్ర‌జ‌ల మ‌నిషి. హోర్డింగ్‎లు, ఫ్లెక్సీలు అవ‌స‌రం లేదు. కేసీఆర్ భ‌జ‌న బ్యాచ్ సిటీ మొత్తాన్ని ప్ర‌కట‌న‌లతో నింపేసింది. అయినా టీఆర్ఎస్ పార్టీని ప్రజలు న‌మ్మే స్థితిలో లేరు. హైదరాబాద్‌లో మొత్తం 2,599 వరకు మెట్రో పిల్లర్లు ఉంటే... కేసీఆర్ స‌ర్కార్  వీటన్నింటిని ఫ్లెక్సీలతో నింపేసింది. కేసీఆర్ స‌ర్కార్ చేస్తున్న ఈ చిల్ల‌ర రాజ‌కీయాలు చూసి ప్ర‌జ‌లు న‌వ్వుకుంటున్నారు. మోడీ అంటే కేసీఆర్‌కి ఇంత భ‌యమా? అని మాట్లాడుకుంటున్నారు. నైతికంగా బీజేపీ ఎప్పుడో విజ‌యం సాధించింది. ఎన్నిక‌ల్లో విజ‌యం ఒక్క‌టే బాకీ ఉంది. రాబోయే రోజుల్లో అది కూడా చేసి చూపిస్తాం. కేసీఆర్ హోర్డింగుల రాజ‌కీయాన్ని త్వరలోనే ఫామ్ హౌస్‌కి పంపిస్తాం’’ అని విజయశాంతి హెచ్చరించారు. 




Updated Date - 2022-06-30T04:24:56+05:30 IST