నో లాక్‌డౌన్‌!

ABN , First Publish Date - 2021-04-21T07:08:45+05:30 IST

‘‘కరోనా తొలి వేవ్‌ నుంచి కోలుకొని దేశం స్థిమితపడుతున్న తరుణంలో సెకండ్‌ వేవ్‌ తుఫానులా వచ్చింది. వైరస్‌ వ్యాప్తిని అరికట్టడం, ప్రజల ప్రాణాలను కాపాడడానికి అత్యధిక ప్రాధాన్యమిస్తున్నాం...

నో లాక్‌డౌన్‌!

  • రాష్ట్రాలకూ ఇది చివరి అస్త్రం కావాలి
  • దేశాన్ని లాక్‌డౌన్‌ నుంచి కాపాడుకోవాలి
  • ప్రజారోగ్యంతో పాటు ఆర్థిక వ్యవస్థనూ రక్షించాలి
  • సెకండ్‌ వేవ్‌ తుఫానులా విరుచుకుపడుతోంది
  • కరోనాపై పోరులో స్వీయ క్రమశిక్షణ అవసరం
  • ఎవరూ అనవసరంగా బయటకు రావద్దు
  • సూక్ష్మ కట్టడి ప్రాంతాలపై దృష్టి పెట్టాలి
  • పెను సవాలే.. సంకల్పంతో ఎదుర్కొందాం
  • వలస కార్మికులూ ఆందోళన చెందొద్దు
  • 1 నుంచి 18 ఏళ్లు దాటిన వారందరికీ టీకాలు
  • ఆక్సిజన్‌ అందించేందుకు అన్ని ప్రయత్నాలూ 
  • తయారీదారులూ టీకా ఉత్పత్తిని పెంచండి
  • జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ


న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 20: ‘‘కరోనా తొలి వేవ్‌ నుంచి కోలుకొని దేశం స్థిమితపడుతున్న తరుణంలో సెకండ్‌ వేవ్‌ తుఫానులా వచ్చింది. వైరస్‌ వ్యాప్తిని అరికట్టడం, ప్రజల ప్రాణాలను కాపాడడానికి అత్యధిక ప్రాధాన్యమిస్తున్నాం. అదేసమయంలో దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడడం కూడా అత్యవసరం. ఈ మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొనేందుకు స్వీయ క్రమశిక్షణ అత్యవసరం. అందరూ కచ్చితంగా కొవిడ్‌ నిబంధనలు పాటిస్తే లాక్‌డౌన్‌ అవసరం ఉండదు. కరోనా కట్టిడికి ప్రభుత్వ పరంగా అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటున్నాం. సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తున్నప్పటికీ మనమంతా సమష్టిగా పోరాడాలి. ప్రస్తుత పరిస్థితుల్లో మనం దేశాన్ని లాక్‌డౌన్‌ నుంచి కాపాడుకోవాలి’’ అని ప్రధాని మోదీ చెప్పారు. 


ప్రజలు అనవసరంగా బయట తిరగొద్దని కోరారు. కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తున్న నేపథ్యంలో మంగళవారం రాత్రి ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు. దాదాపు 20 నిమిషాలకు పైగా సాగిన ప్రధాని ప్రసంగంలో దేశంలో తక్షణమే లాక్‌డౌన్‌ ఏమీ ఉండదని, వలస కార్మికులకు ఎలాంటి ఇబ్బందీ రానివ్వబోమని స్పష్టమైన సందేశమిచ్చారు. ‘‘మనమంతా కలిసి పనిచేస్తే కట్టడి ప్రాంతాలు, లాక్‌డౌన్‌ అవసరమే రాదు. లాక్‌డౌన్‌ను కేవలం చివరి అస్త్రంగానే వాడుకోవాలని రాష్ట్రాలకు విజ్ఞప్తి చేస్తున్నా. వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవడానికి మన దృష్టంతా సూక్ష్మ కట్టడి ప్రాంతాలపైనే ఉండాలి. దేశ ప్రజల ఆరోగ్యంతో పాటే ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యాన్నీ కాపాడాలి’’ అని మోదీ అన్నారు. ప్రభుత్వాల ప్రయత్నాలన్నీ ప్రజల ప్రాణాలు కాపాడేందుకేనని చెప్పారు. అదేసమయంలో ఆర్థిక కార్యకలాపాలు, జీవనోపాధిపై సాధ్యమైనంత తక్కువ ప్రభావం ఉండేలా చూడాల్సి ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతానికి దేశంలో లాక్‌డౌన్‌ విధించే ప్రసక్తే లేదని మోదీ స్పష్టం చేశారు. గత ఏడాది కరోనా వైరస్‌ దేశంలోకి ప్రవేశించే సమయానికి మనదగ్గర మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఎలాంటి ఆయుధాలూ లేవని.. మాస్కులు, పీపీఈ కిట్లు వంటి వాటినీ దిగుమతి చేసుకోవాల్సి వచ్చిందని ప్రధాని గుర్తుచేశారు. నాటితో పోల్చితే నేడు కొవిడ్‌పై పోరులో మనమెంతో మెరుగ్గా ఉన్నామన్నారు. చికిత్సలోనూ ఎంతో పురోగతి సాధించామని చెప్పారు. ధైర్యంగా ఉంటేనే మహమ్మారిని సమర్థంగా ఎదుర్కోగలమన్నారు. కరోనా సెకండ్‌ వేవ్‌లో మన దగ్గర మందుల కొరత లేదని మోదీ చెప్పారు. టీకాల తయారీలోనూ మనం సత్తా చాటామని చెప్పారు. కొవిడ్‌పై పోరులో సమర్థంగా పనిచేసిన వైద్యులకు, ఫార్మా సంస్థలకు ప్రధాని అభినందనలు తెలిపారు. 


వలస కార్మికులకు ఇబ్బందులు రానివ్వం

వలస కార్మికులు ఎక్కడి వారక్కడే ఉండాలని, వారి జీవనోపాధిపై ఎలాంటి ప్రభావం పడకుండా చూస్తామని ప్రధాని హామీ ఇచ్చారు. వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయడానికి పౌరులు, ముఖ్యంగా యువత ముందడుగు వేయాలని కోరారు. అప్పుడు లాక్‌డౌన్‌ అన్న ప్రశ్నే ఉత్పన్నమవదని చెప్పారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దన్నారు. ‘‘ఇవ్వాళ నవరాత్రి చివరి రోజు. రేపు రామ నవమి. పురుషోత్తముడైన రాముడు క్రమశిక్షణతో ఉండాలని మనకి సందేశం ఇచ్చాడు. ఇక రంజాన్‌ మాసంలో ఏడో రోజు వచ్చింది. ఈ పండగ కూడా మనకు సహనం, క్రమశిక్షణ గురించే చెబుతుంది. కొవిడ్‌పై పోరుకు కూడా ఓర్పు, క్రమశిక్షణే అవసరం’’ అని మోదీ పేర్కొన్నారు.   దేశంలో కేసులు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో అనేక రాష్ట్రాల్లో ఆక్సిజన్‌కు భారీ డిమాండ్‌ ఏర్పడిందని ప్రధాని చెప్పారు. ఈ డిమాండ్‌ను తట్టుకొని, ఆస్పత్రులకు అవసరమైన ఆక్సిజన్‌ను సరఫరా చేసేందుకు తమ ప్రభుత్వం అన్ని ప్రయత్నాలూ చేస్తోందని తెలిపారు. ప్రపంచంలోనే భారీ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ మన దగ్గర కొనసాగుతోందన్నారు. మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికీ టీకాలు వేయనున్నామని, తద్వారా వైరస్‌ వ్యాప్తిని మరింత సమర్థంగా అడ్డుకోవచ్చని మోదీ తెలిపారు. కాగా, ప్రధాని సందేశాన్ని పారిశ్రామిక వర్గాలు స్వాగతించాయి. అన్ని వర్గాల వారికి స్పష్టమైన హామీ ఇచ్చారని.. ఇది ఆర్థిక వ్యవస్థకు ఉపయుక్తంగా ఉంటుందని కొనియాడాయి. 


ఉత్త మాటలే.. ఏం లేదు: కాంగ్రెస్‌ 

ప్రధాని మోదీ ప్రసంగంపై కాంగ్రెస్‌ పార్టీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది. కరోనాపై పోరాటాన్ని ప్రజలకే వదిలేశారని ఆరోపించింది. ఆయన ప్రసంగంలో ఉత్త మాటలు తప్ప ఏమీ లేదని ధ్వజమెత్తింది. ప్రధాని మోదీ జాతినుద్దేశించిన చేసిన ప్రసంగంలో విషయం ఏమీ లేదని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి అజయ్‌ మాకెన్‌ ఓ ప్రకటనలో విమర్శించారు. లాక్‌డౌన్‌పై రాష్ట్రాలకు సలహాలివ్వడమే తప్ప ప్రధానిగా ఆయన తన బాధ్యతలను విస్మరించారని.. దేశాన్ని కాపాడే బాధ్యత స్వచ్ఛంద సంస్థలు, యువతదేనని చెప్పారని మండిపడ్డారు. 


ఉత్పత్తి పెంచండి.. అండగా ఉంటాం

దేశంలో సాధ్యమైనంత తక్కువ సమయంలో అందరికీ టీకాలు వేయాలని, అందుకోసం వీలైనంత ఎక్కువగా టీకాలను ఉత్పత్తి చేయాలని ప్రధాని మోదీ వ్యాక్సిన్‌ తయారీదారులను కోరారు. దేశవ్యాప్తంగా ఉన్న టీకా తయారీదారులతో ఆయన మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వ్యాక్సిన్‌ ఉత్పత్తిని పెంచే విషయంలో ప్రభుత్వం పరంగా అన్ని రకాలుగా సాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. రాబోయే రోజుల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో ప్రైవేటు రంగానిదే కీలక పాత్ర అన్నారు. 


ప్రజలకు మళ్లీ భరోసా ఇచ్చారు: బీజేపీ

కరోనా మహమ్మారి దేశాన్ని వణికిస్తున్న వేళ జాతినుద్దేశించి ప్రధాని మోదీ చేసిన ప్రసంగం ప్రజల్లో మళ్లీ విశ్వాసాన్ని నింపిందని కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు చెప్పారు. క్రమశిక్షణ, ఓర్పు అవసరమని స్పష్టం చేయడం ద్వారా ప్రజల భాగస్వామ్యంతోనే  సమస్యను అధిగమించగలమని ప్రధాని స్పష్టం చేశారని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ అన్నారు. ప్రజల ఆరోగ్యంతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపర్చుతామని మోదీ దేశ ప్రజలకు హామీ ఇచ్చారని మరో నేత గజేంద్రసింగ్‌ షెకావత్‌ పేర్కొన్నారు. ప్రజలంతా స్వీయ క్రమశిక్షణ పాటించాలని, వైర్‌సపై సమష్టిగా పోరాడాలని మోదీ స్పష్టం చేశారని బీజేపీ నేత బీఎల్‌ సంతోష్‌ ట్వీట్‌ చేశారు.

Updated Date - 2021-04-21T07:08:45+05:30 IST