హైదరాబాద్‌లో ఏం జరుగుతోంది?

ABN , First Publish Date - 2022-05-27T08:48:10+05:30 IST

హైదరాబాద్‌/సిటీ, మే 26 (ఆంధ్రజ్యోతి): ‘‘హైదరాబాద్‌లో ఏం జరుగుతోంది..? (హైదరాబాద్‌ మే క్యా చల్‌ రహా హై).. అధికారంలోకి వస్తామా..? (రూలింగ్‌ మే ఆ సక్‌తే

హైదరాబాద్‌లో ఏం జరుగుతోంది?

అధికారంలోకి వస్తామా..?

-బేగంపేటలో కార్పొరేటర్లను అడిగిన మోదీ

-ప్రధానికి బీజేపీ నేతల ఘనస్వాగతం

-షెడ్యూల్‌ కంటే అరగంట ముందుగానే రాక

-ఐఎ్‌సబీ పరిసర ప్రాంతాల్లో పటిష్ఠ బందోబస్తు

హైదరాబాద్‌/సిటీ, మే 26 (ఆంధ్రజ్యోతి): ‘‘హైదరాబాద్‌లో ఏం జరుగుతోంది..? (హైదరాబాద్‌ మే క్యా చల్‌ రహా హై).. అధికారంలోకి వస్తామా..? (రూలింగ్‌ మే ఆ సక్‌తే క్యా..?)’’ అని ప్రధాని నరేంద్ర మోదీ ఓ బీజేపీ కార్పొరేటర్‌ను అడిగారు. ఒక రోజు హైదరాబాద్‌ పర్యటనకు వచ్చిన ప్రధానికి బేగంపేటలో ఘన స్వాగతం పలికారు. అనంతరం హైదరాబాద్‌ కేంద్రీయ వర్సిటీలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌, ఐఎ్‌సబీలో జరిగిన కార్యక్రమం వద్ద పలు దఫాలుగా ప్రధాని మోదీకి జీహెచ్‌ఎంసీలోని బీజేపీ కార్పొరేటర్లను పరిచయం చేశారు. కార్పొరేటర్లు తమ పేరు, ప్రాతినిధ్యం వహిస్తున్న డివిజన్‌ పేరు మోదీకి చెప్పారు. ఈ క్రమంలోనే ఓ కార్పొరేటర్‌ను హైదరాబాద్‌లో ఏం జరుగుతోందని అడగ్గా, అంతా బాగుందని సమాధానమిచ్చారు. అధికారంలోకి వస్తామా..?అని అడిగిన ప్రధాని.. పార్టీ పరిస్థితి గురించీ అడిగి తెలుసుకున్నారు. ఐఎ్‌సబీలో సమావేశం ముగిసిన అనంతరం తిరిగి వెళ్లే క్రమంలో హెలిప్యాడ్‌ వద్ద మరో ఎనిమిది మంది కార్పొరేటర్లను పరిచయం చేయాల్సి ఉండగా.. గాలి దుమారం, వర్షం రావడంతో వారిని కలవకుండానే వెళ్లిపోయారు. వారిని ప్రధాని మరోసారి నగరానికి వచ్చినప్పుడు లేదా వీలును బట్టి ఢిల్లీకి తీసుకెళ్లి పరిచయం చేస్తామని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చెప్పినట్టు సమాచారం. కాగా, ప్రధాని మోదీకి బేగంపేట విమానాశ్రయంలో గవర్నర్‌ తమిళిసై, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, కె.లక్ష్మణ్‌, ఎమ్మెల్యేలు రాజాసింగ్‌, ఈటల రాజేందర్‌, రఘునందన్‌రావు, ఎంపీ బాపూరావు, విజయశాంతి తదితరులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ ఘన స్వాగతం పలికారు.  

షెడ్యూల్‌ కంటే అరగంట ముందుగానే..

షెడ్యూలు (మధ్యాహ్నం 1.30 గంటలకు) కంటే అరగంట ముందే ప్రత్యేక విమానంలో మోదీ బేగంపేట చేరుకున్నారు. విమానాశ్రయం ప్రధాన ద్వారం బయట ఏర్పాటు చేసిన సభా వేదికపైకి మోదీ 1.10 గంటలకు చేరుకున్నారు. బండి సంజయ్‌ రెండు నిమిషాల పాటు ప్రధానికి స్వాగతోపన్యాసం చేయగా, ఆ తర్వాత మోదీ ప్రసంగించారు. సుమారు 20 నిమిషాల పాటు పార్టీ కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించిన మోదీ 1.40కి హెలికాప్టర్‌లో గవర్నర్‌ తమిళిసైతో కలిసి హెలికాప్టర్‌లో హెచ్‌సీయూకు చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా ఐఎ్‌సబీకి వెళ్లారు.

ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ ‘బిడ్‌’నెస్‌!

ప్రధాని మోదీ ప్రసంగం ప్రారంభంలోనే ఆయన నోట మాట దొర్లింది. ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ అనబోయి.. ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిడ్‌నెస్‌ అనడంతో విద్యార్థులు కాస్త అయోమయానికి గురయ్యారు. అలాగే ఆయన మాట్లాడుతున్న సమయంలో ఐఎ్‌సబీలో ఇప్పటి వరకు 50వేల మంది విద్య పూర్తి చేశారని చెప్పగానే.. విద్యార్థులతో పాటు ఐఎ్‌సబీ బోర్డు చైర్మన్‌ కూడా గందరగోళానికి గురయ్యారు. అంతకు ముందు చైర్మన్‌ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు 13500 మంది విద్యార్థులు పట్టా పొందినట్లు ప్రకటించడం గమనార్హం. ఇక మోదీ హైదరాబాద్‌ పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బీజేపీ నేతలు గచ్చిబౌలి నుంచి ఐఎ్‌సబీ గేటు వరకు ఉన్న రోడ్డుపై అడుగడుగునా మోదీకి స్వాగతం పలికే ఫ్లెక్సీలు, బోర్డులు ఏర్పాటు చేశారు. ఐఎ్‌సబీలోని సభాప్రాంగణంలో ప్రతి 10 సీట్లకు ఒకరి చొప్పున సుమారు 100-120 మంది మఫ్టీలో ఉన్న అధికారులు నిఘా కొనసాగించారు. గద్వాలకు చెందిన బీజేపీ సీనియర్‌ నాయకుడు రామచంద్రారెడ్డి ప్రధాని సమావేశంలో పాల్గొనేందుకు ముందుగానే పాస్‌లు తీసుకున్నారు. అయినా ఆయన్ను పోలీసులు అడ్డుకున్నారు.

ఉక్కపోత.. నీళ్ల కరువు

ఐఎ్‌సబీలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆడిటోరియంలో ఏసీలు లేకపోవడంతో అధికారులు కూలర్లను అమర్చారు. 1500 మంది ఉన్న ప్రాంగణంలో ఆ గాలి సరిపోలేదని పలువురు విద్యార్థులు తెలిపారు. లోపలికి వాటర్‌ బాటిళ్లు తీసుకెళ్లేందుకు అనుమతి ఇవ్వలేదని, మంచినీళ్ల ఏర్పాటు సక్రమంగా లేదని చెప్పారు. ఐఎ్‌సబీ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ప్రధాని మోదీ బేగంపేట విమానాశ్రయానికి చేరుకొని 3.50 గంటలకు చెన్నై బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా తమిళిసై ప్రఽధానికి పుస్తకం అందజేశారు. నగరంలో వర్షం కారణంగా మోదీ కాన్వాయ్‌ కొద్దిసేపు నిలిచిపోయింది. 

గ్రేటర్‌ బీజేపీలో మోదీ జోష్‌!

ప్రధాని మోదీ ఒక రోజు పర్యటన గ్రేటర్‌ బీజేపీ కార్యకర్తల్లో జోష్‌ నింపింది. బేగంపేటలో బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో మోదీ.. టీఆర్‌ఎస్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు. ఒక్కో కార్యకర్త సర్దార్‌పటేల్‌ మాదిరిగా పోరాడాలని చెప్పడంతో గట్టిగా చప్పట్లు చరిచారు. మధ్యాహ్నం ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రధాని ప్రసంగాన్ని ఆసక్తిగా విన్నారు. తెలంగాణలో రానున్నది బీజేపీ ప్రభుత్వమని ప్రకటించడంతో హర్షధ్వానాలు చేశారు. హైదరాబాద్‌ ప్రజలు చూపే ఆదరాభిమానాలను మరవలేననడంతో ‘భారత్‌ మాతాకీ జై, మోదీ జిందాబాద్‌’అంటూ నినాదాలు చేశారు. ఆయన ప్రసంగిస్తున్నంతసేపూ ‘మోదీ.. మోదీ’అంటూ నినదించారు. 

బండీ.. ఆరోగ్యం జాగ్రత్త..

‘బండీ.. ఆరోగ్యం జాగ్రత్త..’ అంటూ ప్రధాని మోదీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్‌కి హితవుపలికారు. పాదయాత్ర తర్వాత ఆరోగ్యం ఎలా ఉంది? అని ఆరాతీశారు. తన ఆరోగ్యం భేషుగ్గా ఉందని సంజయ్‌ ప్రధానికి చెప్పారు. 

Updated Date - 2022-05-27T08:48:10+05:30 IST