క్రీడారంగ ప్రముఖులతో ప్రధాని మోదీ సమావేశం

ABN , First Publish Date - 2020-04-03T19:43:46+05:30 IST

క్రీడా రంగానికి చెందిన 40 మంది ప్రముఖులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం అయ్యారు....

క్రీడారంగ ప్రముఖులతో ప్రధాని మోదీ సమావేశం

న్యూఢిల్లీ: క్రీడా రంగానికి చెందిన 40 మంది ప్రముఖులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం అయ్యారు. కరోనా వైరస్ కారణంగా ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులు, ఈ మహమ్మారిని అరికట్టేందుకు క్రీడాకారుల నుంచి కావాల్సిన సహకారంపై ఆయన ప్రధానంగా చర్చించారు. కోవిడ్-19‌కు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం 21 రోజుల లాక్‌డౌన్‌ విధించిన తర్వాత క్రీడాకారులతో ప్రధాని మాట్లాడడం ఇదే తొలిసారి. ఈ కార్యక్రమంలో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, మాజీ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, మహిళా బాక్సర్ మేరీ కోమ్ తదితరులు ఉన్నారు. పీటీ ఉష, పుల్లెల గోపీచంద్, విశ్వనాథన్ ఆనంద్, హిమదాస్, బజ్రంగ్ పూనియా, పీవీ సింధు, రోహిత్ శర్మ, వీరేంద్ర సెహవాగ్, యువరాజ్ సింగ్, ఛటేశ్వర పూజారా తదితరులు కూడా ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.


కాగా అద్భుత ప్రదర్శన కనబర్చుతూ దేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెడుతున్న భారత క్రీడాకారులపై ప్రధాని ఈ సందర్భంగా ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం కరోనా మహమ్మారిపై జరుగుతున్న యుద్ధంలో కూడా క్రీడాకారులు కీలక పాత్ర పోషించాలని ప్రధాని కోరారు. ప్రజలకు సామాజిక దూరం (సోషల్ డిస్టెన్సింగ్)‌పై అవగాహన కల్పించడంతో పాటు, లాక్‌డౌన్‌ సమయంలో ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించేలా ప్రజలను ప్రోత్సహించాలని ప్రధాని పిలుపునిచ్చారు. ఆయుష్ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన మార్గదర్శకాల మేరకు ప్రజల్లో శారీరక, మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించాలని కోరారు. కాగా ఈ సందర్భంగా క్రీడారంగ ప్రముఖులు సైతం కరోనా కట్టడికి ప్రధాని మోదీ తీసుకుంటున్న చర్యలపై ప్రశంసలు కురిపించడం విశేషం.

Updated Date - 2020-04-03T19:43:46+05:30 IST