Abn logo
Apr 23 2021 @ 16:11PM

ఆక్సిజన్ తయారీదారులతో మోదీ సమావేశం

న్యూఢిల్లీ : కోవిడ్-19 రెండో ప్రభంజనం నేపథ్యంలో ఆక్సిజన్ తయారీదారులతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. శుక్రవారం వర్చువల్ విధానంలో జరిగిన ఈ సమావేశంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ ముకేశ్ అంబానీ, ఎయిర్ వాటర్ జంషెడ్‌పూర్ ఎండీ నొరియో షిబుయ, జిందాల్ స్టీల్ అండ్ పవర్‌కు చెందిన నవీన్ జిందాల్, ఎన్ఓఎల్‌కు చెందిన రాజేశ్ కుమార్ షరాఫ్, లిండే తరపున ఎం బెనర్జీ, జేఎస్‌డబ్ల్యూ తరపున సజ్జన్ జిందాల్, సెయిల్ చైర్‌పర్సన్ సోమ మొండల్ తదితరులు పాల్గొన్నారు. 


దేశవ్యాప్తంగా ఆక్సిజన్ సరఫరాపై మోదీ ఈ నెల 16, 17, 22 తేదీల్లో కూడా సమీక్షా సమావేశాలు నిర్వహించారు. మోదీ శుక్రవారం కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కూడా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆక్సిజన్, ఔషధాల అవసరాలను తీర్చుకునేందుకు పరస్పరం సహకరించుకోవాలని, సమన్వయంతో వ్యవహరించాలని రాష్ట్రాలను మోదీ కోరారు. ఆక్సిజన్, మందుల బ్లాక్ మార్కెటింగ్‌, అక్రమ నిల్వలను నిరోధించేందుకు గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పారు. 


కోవిడ్-19 కేసుల భారం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నిర్వహించిన ఈ ఉన్నత స్థాయి సమావేశంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, నీతీ ఆయోగ్ హెల్త్ మెంబర్ వీకే పాల్, కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, హర్షవర్ధన్, ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, ఉద్ధవ్ థాకరే, అశోక్ గెహ్లాట్, బీఎస్ యడియూరప్ప, పినరయి విజయన్, శివరాజ్ సింగ్ చౌహాన్, విజయ్ రూపానీ, భూపేష్ బాఘేల్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ పాల్గొన్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఈ సమావేశంలో పాల్గొనలేదు. ఆ రాష్ట్రం తరపున ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆలాపన్ బందోపాధ్యాయ పాల్గొన్నారు. 


Advertisement