Modi conversation with Zelenskyy: జెలెన్‌స్కీ‌కి మోదీ ఫోన్‌

ABN , First Publish Date - 2022-10-05T03:22:15+05:30 IST

న్యూఢిల్లీ: రష్యా- ఉక్రెయిన్ యుద్ధ వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ‌‌కి ఫోన్ చేశారు.

Modi conversation with Zelenskyy: జెలెన్‌స్కీ‌కి మోదీ ఫోన్‌

న్యూఢిల్లీ: రష్యా- ఉక్రెయిన్ యుద్ధ వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ‌‌కి ఫోన్ చేశారు. యుద్ధ పరిణామాలతో పాటు, తాజా సంక్షోభంపై చర్చించారు. యుద్ధం పరిష్కారం కాదని, చర్చలు, దౌత్య మార్గాల ద్వారా యుద్ధం ముగించాలని మోదీ సూచించారు. శాంతి యత్నాలకు తాము ఎప్పుడూ సిద్ధమేనని మోదీ చెప్పారు. 






మోదీ ఇటీవలే ఉజ్బెకిస్థాన్‌ (Ujbekistan)లోని సమర్కండ్‌లో షాంఘై సహకార సంఘం (Shanghai Cooperation Organisation) సమావేశం సందర్భంగా పుతిన్‌తో చర్చలు జరిపారు. ఉక్రెయిన్‌పై యుద్ధం చేయడానికి ఇది సమయం కాదని, ఇది యుద్ధాలు చేసే కాలం కాదని మోదీ చెప్పారు. సాద్యమైనంత త్వరగా యుద్ధాన్ని ఆపేందుకు చర్యలు తీసుకుంటామని పుతిన్ మోదీతో చెప్పారు. ఇప్పుడు జెలెన్‌స్కీతో కూడా యుద్ధం వద్దని మోదీ చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. 


మరోవైపు రష్యా- ఉక్రెయిన్ యుద్ధ వేళ ఇటీవలే కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉక్రెయిన్‌పై యుద్ధంలో తాము ఆక్రమించుకున్న నాలుగు ప్రాంతాలను రష్యాలో విలీనం చేసుకున్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అధికారికంగా ప్రకటించారు. ఖేర్సన్, జపోరిజియా, లుహాన్స్క్, దొనేట్స్క్ ప్రాంతాలను విలీనం చేసుకున్నట్లు క్రెమ్లిన్‌లో జరిగిన సమావేశంలో తెలిపారు. ప్రజాభిప్రాయ సేకరణ ద్వారానే ఈ ప్రాంతాలను విలీనం చేసుకున్నామంటూ ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఈ నాలుగు ప్రాంతాలు కలిపితే సుమారు 15 శాతం భూభాగం రష్యా వశమైనట్లైంది. 


ఇదే సమయంలో పుతిన్ పశ్చిమదేశాలపై విరుచుకుపడ్డారు. మధ్యయుగంలో వలసవాదంతో బానిసలుగా చేసుకుని వ్యాపారం చేశారని పశ్చిమదేశాల విధానాలను విమర్శించారు. భారత గిరిజన జాతులను ఊచకోత కోశారని, భారత్‌ను, ఆఫ్రికాను దోచుకున్నారని యూరోపియన్ దేశాల తీరును ఘాటుగా విమర్శించారు. పశ్చిమదేశాధినేతలు ప్రస్తుతం అన్ని దేశాలనూ డ్రగ్స్‌లో ముంచేశారని, జాతులను సమూలంగా నాశనం చేస్తున్నారని పుతిన్ విమర్శలు గుప్పించారు. భూముల కోసం, వనరుల కోసం ప్రజలను జంతువుల్లా వెంటాడారని మండిపడ్డారు. మానవత్వం, స్వేచ్ఛ, న్యాయం, ధర్మానికి విరుద్ధంగా వ్యవహరించారని పుతిన్ ఆరోపించారు. చివరగా చర్చలకు రావాలని పుతిన్ ఉక్రెయిన్‌కు పిలుపునిచ్చారు. 

Updated Date - 2022-10-05T03:22:15+05:30 IST