పోప్ ఫ్రాన్సిస్‌కు మోదీ బహుమతులివే!

ABN , First Publish Date - 2021-10-31T00:34:14+05:30 IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేకంగా తయారు చేయించిన

పోప్ ఫ్రాన్సిస్‌కు మోదీ బహుమతులివే!

రోమ్ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేకంగా తయారు చేయించిన రజత కాండిలబ్రాను, భారత దేశ వాతావరణ పరిరక్షణ చర్యలపై ఓ పుస్తకాన్ని రోమన్ కేథలిక్ చర్చ్ అధిపతి పోప్ ఫ్రాన్సిస్‌కు బహుమతిగా ఇచ్చారు. శనివారం ఓ గంటసేపు జరిగిన సమావేశంలో ఈ బహుమతుల గురించి ఆయనకు వివరించి చెప్పారు. 


వాటికన్ న్యూస్ వెల్లడించిన వివరాల ప్రకారం, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ‘ది క్లైమేట్ క్లైంబ్ : ఇండియాస్ స్ట్రాటజీ, యాక్షన్స్ అండ్ అచీవ్‌మెంట్స్’ పుస్తకాన్ని, ప్రత్యేకంగా తయారు చేయించిన రజత కాండిలబ్రాను పోప్ ఫ్రాన్సిస్‌కు బహుమతిగా ఇచ్చారు. అదేవిధంగా పోప్ కూడా మోదీకి బహుమతులు ఇచ్చారు. ‘ఎడారి ఓ తోటగా మారుతుంది’ అనే నినాదంతో కూడిన కాంస్య ఫలకం, పపల్ డాక్యుమెంట్స్, మానవాళి సౌభ్రాతృత్వంపై 2019 ఫిబ్రవరి 4న అబుదాబిలో పోప్, అల్-అజహర్ గ్రాండ్ ఇమామ్ సంతకాలు చేసిన పత్రాన్ని అందజేశారు. పోప్ ఫ్రాన్సిస్ 2013లో బాధ్యతలు చేపట్టారు. ఆయనతో సమావేశమైన తొలి భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీయే.


నరేంద్ర మోదీ శనివారం ఇచ్చిన ట్వీట్‌లో, తాను పోప్ ఫ్రాన్సిస్‌తో అత్యంత ఆత్మీయంగా సమావేశమైనట్లు తెలిపారు. ఆయనతో అనేక అంశాలను చర్చించే అవకాశం లభించిందని పేర్కొన్నారు.  ఆయనను భారత దేశానికి ఆహ్వానించానని తెలిపారు. 


1999లో పోప్ జాన్ పాల్-2 భారత దేశంలో పర్యటించారు. అప్పట్లో అటల్ బిహారీ వాజ్‌పాయి ప్రధాన మంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత కేథలిక్ చర్చ్ అధిపతి మన దేశంలో పర్యటించలేదు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ  తాజాగా పోప్ ఫ్రాన్సిస్‌ను ఆహ్వానించారు. 


జీ20 సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ ఇటలీ వెళ్ళిన సంగతి తెలిసిందే. ఆయనతోపాటు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఉన్నారు. 


Updated Date - 2021-10-31T00:34:14+05:30 IST