India Vs Pakistan : సానుభూతి చూపిన మోదీ... మర్యాద మరచిన పాక్ పీఎం...

ABN , First Publish Date - 2022-08-31T19:46:01+05:30 IST

వరద బీభత్సంతో అతలాకుతలమవుతున్న పాకిస్థాన్‌ పట్ల ప్రధాన

India Vs Pakistan : సానుభూతి చూపిన మోదీ... మర్యాద మరచిన పాక్ పీఎం...

న్యూఢిల్లీ : వరద బీభత్సంతో అతలాకుతలమవుతున్న పాకిస్థాన్‌ పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) సానుభూతి ప్రకటించగా, ఆ దేశ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ (Shehbaz Sharif) మర్యాదను మర్చిపోయి, దీనిని కూడా రాజకీయాలకు వాడుకున్నారు. జమ్మూ-కశ్మీరులో నరమేధం జరుగుతోందంటూ, వచ్చే ఏడాది ఎన్నికల్లో గెలుపుపై దృష్టి పెట్టి మాట్లాడారు. 


పాకిస్థాన్‌లో వరదల వల్ల సుమారు 1,000 మంది ప్రాణాలు కోల్పోయారు. పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆహార కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం ఓ ట్వీట్ చేశారు. పాకిస్థాన్‌లో వరదల వల్ల జరిగిన విధ్వంసాన్ని చూసి తాను చలించిపోయానని తెలిపారు. బాధితులకు సానుభూతి, మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. అతి త్వరగా సాధారణ పరిస్థితులు నెలకొనాలని ఆకాంక్షించారు. 


పాకిస్థాన్ ఆర్థిక మంత్రి మిఫ్తా ఇస్మాయిల్ స్థానిక మీడియాతో సోమవారం మాట్లాడుతూ, వరదల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు ఉపశమనం కలిగించడం కోసం భారత దేశం నుంచి కూరగాయలు, ఆహార పదార్థాలను దిగుమతి చేసుకోవడం గురించి తమ ప్రభుత్వం పరిశీలిస్తుందని తెలిపారు. 


పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మంగళవారం అంతర్జాతీయ మీడియాతో మాట్లాడారు. భారత దేశంతో వాణిజ్యాన్ని పునరుద్ధరిస్తారా? ఆహార పదార్థాలు, కూరగాయలు దిగుమతి చేసుకునే అవకాశాలు ఉన్నాయా? అని విలేకర్లు అడిగినపుడు షరీఫ్ మాట్లాడుతూ, భారత దేశంతో వ్యాపారం చేయడంలో సమస్యలేవీ లేవన్నారు. అయితే భారత దేశంలో నరమేధం జరుగుతోందన్నారు. కశ్మీరీల హక్కులు నిరాకరణకు గురవుతున్నాయన్నారు. భారత రాజ్యాంగంలోని అధికరణ 370ని రద్దు చేసి, కశ్మీరును బలవంతంగా కలుపుకున్నారన్నారు. అయితే తాను ప్రధాని మోదీతో చర్చించడానికి సిద్ధమేనని తెలిపారు. యుద్ధం తగదన్నారు. ఇరు దేశాలకు ఉన్న స్వల్ప వనరులను పేదరిక నిర్మూలనకు ఉపయోగించాలన్నారు. ఈ సమస్యలను పరిష్కరించకుండా మనం ప్రశాంతంగా జీవించలేమని అన్నారు. ఈ సమయంలో రాజకీయాలు చేయకూడదని, కానీ భారత దేశంలో మైనారిటీల హక్కులు అణచివేతకు గురవుతున్నాయనేది వాస్తవమని చెప్పారు. ఈ ప్రాంతంలో శాంతి అవసరమని, ఇరుగు పొరుగు దేశాలుగా ఉండటం మనం కోరుకున్నది కాదని అన్నారు.


2019 ఆగస్టులో అధికరణ 370, అధికరణ 35ఏలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీంతో జమ్మూ-కశ్మీరు రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఏర్పడింది. జమ్మూ-కశ్మీరు, లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతాలు ఏర్పడ్డాయి. 


Updated Date - 2022-08-31T19:46:01+05:30 IST