భారత్-సెంట్రల్ ఆసియా మధ్య సహకారంతో శాంతి, సౌభాగ్యాలు : మోదీ

ABN , First Publish Date - 2022-01-27T23:57:43+05:30 IST

సమైక్య, సుస్థిర, సువిశాల ఇరుగు, పొరుగు పట్ల భారత

భారత్-సెంట్రల్ ఆసియా మధ్య సహకారంతో శాంతి, సౌభాగ్యాలు : మోదీ

న్యూఢిల్లీ : సమైక్య, సుస్థిర, సువిశాల ఇరుగు, పొరుగు పట్ల భారత దేశ దార్శనికతకు కేంద్ర బిందువు మధ్య ఆసియా అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. తొలి ఇండియా-సెంట్రల్ ఆసియా సమ్మిట్‌లో గురువారం ఆయన వర్చువల్ విధానంలో మాట్లాడారు. ఈ సదస్సుకు మూడు లక్ష్యాలు ఉన్నాయని తెలిపారు. ఐదు దేశాల అధ్యక్షులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.


ఈ సదస్సుకుగల మూడు లక్ష్యాలను మోదీ వివరిస్తూ, మొదటిది, ప్రాంతీయ భద్రత, సౌభాగ్యాల కోసం భారత దేశం, మధ్య ఆసియా మధ్య పరస్పర సహకారం అవసరమని నొక్కి వక్కాణించడమని చెప్పారు. రెండోది, ఈ పరస్పర సహకారానికి సమగ్ర నిర్మాణాన్ని కల్పించడమని, సంబంధితులందరి మధ్య ప్రతి నిత్యం సంభాషణలు జరగడానికి ఓ వేదిక ఏర్పాటుకు ఈ నిర్మాణం దోహదపడుతుందని తెలిపారు. మూడోది, ఈ పరస్పర సహకారం కోసం ఓ గొప్ప మార్గసూచిని రూపొందించడమని చెప్పారు. ప్రాంతీయ అనుసంధానం, సహకారం కోసం ఓ సమైక్య వైఖరిని స్వీకరించేందుకు ఈ మార్గసూచి దోహదపడుతుందన్నారు. 


ఆఫ్ఘనిస్థాన్‌లో పరిస్థితులపై మనమంతా ఆందోళన చెందుతున్నామన్నారు. ఈ నేపథ్యంలో ప్రాంతీయ సుస్థిరత, భద్రతలకు భారత్-సెంట్రల్ ఆసియా మధ్య సహకారం మరింత ముఖ్యమైనదవుతుందన్నారు. 


ఈ వర్చువల్ సమావేశంలో కజకిస్థాన్ ప్రెసిడెంట్ కస్సిమ్-జోమర్ట్ టొకయేవ్, ఉజ్బెకిస్థాన్ ప్రెసిడెంట్ షవకట్ మిర్జియొయెవ్, తజకిస్థాన్ ప్రెసిడెంట్ ఎమొమలి రహమోన్, తుర్క్‌మెనిస్థాన్ ప్రెసిడెంట్ గుర్బంగులీ బెర్డిముహమెడోవ్, కిర్గిజ్ ప్రెసిడెంట్ సడిర్ జపరోవ్ పాల్గొన్నారు. 


దేశాధినేతలు పాల్గొన్న తొలి భారత్-సెంట్రల్ ఆసియా సమావేశం ఇదేనని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. మధ్య ఆసియా దేశాలతో సత్సంబంధాలు పెరుగుతుండటానికి ఇది నిదర్శనమని పేర్కొంది. 


Updated Date - 2022-01-27T23:57:43+05:30 IST