Abn logo
Mar 26 2020 @ 20:07PM

రాష్ట్రాల్లో కోవిడ్-19పై పోరుకు మంత్రుల నాయకత్వం, మోదీ ఆదేశం

న్యూఢిల్లీ : కోవిడ్-19 మహమ్మారిపై యుద్ధానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరో కొత్త నిర్ణయం తీసుకున్నారు. ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ) వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం కేంద్ర మంత్రులు తమ తమ రాష్ట్రాల్లో ఈ మహమ్మారిపై పోరాటానికి నాయకత్వం వహించాలని మోదీ ఆదేశించినట్లు తెలుస్తోంది. విస్తరిస్తున్న ఈ మహమ్మారిని ఓడించేందుకు చురుకైన పాత్ర పోషించాలని కోరినట్లు సమాచారం. 


ఓ కేంద్ర మంత్రి తెలిపిన సమాచారం ప్రకారం నిరుపేదలు, అణగారిన వర్గాలకు సక్రమంగా ఆహార ధాన్యాలు, ఇతర నిత్యావసర వస్తువులు అందే విధంగా జాగ్రత్త వహించాలని ఎన్నికైన ప్రజా ప్రతినిథులను మోదీ కోరారు. ప్రజా పంపిణీ వ్యవస్థకు చెందిన దుకాణాల్లో రేషన్ సరుకులు, స్థానిక మార్కెట్లలో నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉండేవిధంగా చూడాలని కూడా కోరారు. అమ్మకందారులు ఈ వస్తువులకు ప్రజల నుంచి అధిక ధరలు వసూలు చేయకుండా జాగ్రత్తవహించాలని ఆదేశించారు.


కేంద్ర మంత్రులు తమ సొంత నియోజకవర్గాల్లో కోవిడ్-19 పరిస్థితులను కూడా సమగ్రంగా తెలుసుకోవాలని మోదీ చెప్పారు. స్థానిక అధికార యంత్రాంగంతో నిరంతరం సంబంధాలు కొనసాగించాలని తెలిపారు. జిల్లా కలెక్టర్లతో మాట్లాడాలని, విదేశాల నుంచి వచ్చినవారంతా క్వారంటైన్‌లో ఉండేవిధంగా చూడాలని తెలిపారు. 


కోవిడ్-19 మహమ్మారి సామాజికంగా వ్యాపించకుండా నిరోధించేందుకు మోదీ ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇతర పార్టీల సీనియర్ నేతలను కూడా విశ్వాసంలోకి తీసుకుంటున్నట్లు సమాచారం.


కోవిడ్-19 మహమ్మారిని ఓడించే బాధ్యతను ఏ రాష్ట్రంలో ఏయే కేంద్ర మంత్రులు నిర్వహించాలో వివరిస్తూ మోదీ ఓ లేఖ రాశారు. జార్ఖండ్‌కు ముక్తార్ అబ్బాస్ నఖ్వీని, మహారాష్ట్రకు నితిన్ గడ్కరీ, ప్రకాశ్ జవదేకర్‌లను, ఉత్తర ప్రదేశ్‌కు రాజ్‌నాథ్ సింగ్‌, మహేంద్రనాథ్ పాండే, సంజీవ్ బల్యాన్, కృఫ్షపాల్ గుర్జర్‌లను ఇన్‌ఛార్జులుగా నియమించారు. 


Advertisement
Advertisement
Advertisement