2024 Lok Sabha Elections: నితీశ్ బై బై చెప్పినా, మోదీయే మొనగాడు : సర్వే

ABN , First Publish Date - 2022-08-12T20:14:14+05:30 IST

బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ (Bihar CM Nitish Kumar) ఎన్డీయే

2024 Lok Sabha Elections: నితీశ్ బై బై చెప్పినా, మోదీయే మొనగాడు : సర్వే

న్యూఢిల్లీ : బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ (Bihar CM Nitish Kumar) ఎన్డీయే (NDA)కు గుడ్‌బై చెప్పినప్పటికీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)  నేతృత్వంలోనే మళ్ళీ  ప్రభుత్వం ఏర్పాటవుతుందని తాజా సర్వే అంచనా వేసింది. అయితే ఎన్డీయేకు ఆధిక్యత తగ్గే అవకాశం ఉందని చెప్పింది. దేశాన్ని నడిపించే నాయకుడిగా అత్యధిక ప్రజాదరణ మోదీకి ఉందని పేర్కొంది. 


లోక్‌సభ ఎన్నికలకు సుమారు రెండేళ్ళ సమయం ఉంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మొత్తం 543 లోక్‌సభ నియోజకవర్గాల్లో 286 స్థానాల్లో ఎన్డీయే గెలిచే అవకాశం ఉందని ఇండియా టుడే మ్యాగజైన్ (India Today Magazine) నిర్వహించిన ఈ సర్వే వెల్లడించింది. ఎన్డీయే నుంచి బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ వైదొలగినందువల్ల దాదాపు 21 స్థానాలను ఎన్డీయే కోల్పోయే అవకాశం ఉందని అంచనా వేసింది. అంతకుముందు ఇదే మ్యాగజైన్ నిర్వహించిన సర్వేలో ఎన్డీయే కూటమికి 307 స్థానాలు లభిస్తాయని అంచనా వేసిన సంగతి తెలిసిందే. ఈ సర్వేలను సీ-ఓటర్ అనే సంస్థతో కలిసి నిర్వహించారు. 


ఈ సర్వేలో ఫిబ్రవరి నుంచి ఆగస్టు వరకు 1,22,016 మంది పాల్గొన్నట్లు ఇండియా టుడే మ్యాగజైన్-సీ-ఓటర్ సర్వే నిర్వాహకులు తెలిపారు. ఈ సర్వేలో అత్యధిక భాగం ఎన్డీయే నుంచి జేడీయూ వైదొలగక మునుపు జరిగినట్లు తెలిపారు. ఎన్డీయే నుంచి జేడీయూ వైదొలగిన తర్వాత నిర్వహించిన సర్వేలో ఎన్డీయేకు జరగబోయే నష్టం వెల్లడైనట్లు పేర్కొన్నారు.


ప్రస్తుతం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు లోక్‌సభలో 300కుపైగా ఎంపీల బలం ఉంది. ఇదిలావుండగా, దేశంలో అధిక ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, కోవిడ్-19 మహమ్మారి వంటి అనేక సమస్యలు ఉన్నప్పటికీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన రాజకీయ ప్రత్యర్థులందరికన్నా అత్యధిక ప్రజాదరణను పొందుతున్నట్లు ఈ సర్వే వెల్లడించింది. తదుపరి ప్రధాన మంత్రిగా మోదీకి 53 శాతం మంది ఓటు వేశారని తెలిపింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి కేవలం 9 శాతం మంది, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌కు 7 శాతం మంది మాత్రమే మద్దతు పలికారని చెప్పింది. 


Updated Date - 2022-08-12T20:14:14+05:30 IST