Ethanol, Petrol Blending : లక్ష్యాన్ని గడువుకు ముందే సాధించాం : మోదీ

ABN , First Publish Date - 2022-06-05T23:05:37+05:30 IST

పెట్రోలులో 10 శాతం ఇథనాల్‌ను కలపాలనే లక్ష్యాన్ని నిర్దేశిత

Ethanol, Petrol Blending : లక్ష్యాన్ని గడువుకు ముందే సాధించాం : మోదీ

న్యూఢిల్లీ : పెట్రోలులో 10 శాతం ఇథనాల్‌ను కలపాలనే లక్ష్యాన్ని నిర్దేశిత గడువు కన్నా ఐదు నెలల ముందుగానే సాధించినట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం చెప్పారు. ప్రకృతిని పరిరక్షించేందుకు తన ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందన్నారు. సద్గురు ప్రారంభించిన ‘నేల తల్లిని రక్షించండి’ ఉద్యమ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆదివారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం కూడా అనే సంగతి తెలిసిందే. 


మన దేశంలో విడుదలవుతున్న కర్బన ఉద్గారాలు పట్టించుకోదగిన స్థాయిలో లేవని, అయినప్పటికీ, పర్యావరణ పరిరక్షణ కోసం మన దేశం చాలా చర్యలు చేపడుతోందని మోదీ చెప్పారు. అత్యధిక కర్బన ఉద్గారాలు అభివృద్ధి చెందిన దేశాల నుంచి వెలువడుతున్నాయన్నారు. ప్రకృతిని పరిరక్షించేందుకు మన దేశం బహుముఖ కృషి చేస్తోందన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అనేక కార్యక్రమాలు దీనికి దోహదపడుతున్నాయన్నారు. 


పర్యావరణాన్ని పరిరక్షించాలనే సందేశాన్ని అనేక ప్రభుత్వ పథకాలు వివరిస్తున్నాయని చెప్పారు. స్వచ్ఛ భారత్ మిషన్, నమై గంగే, ‘ఒక సూర్యుడు, ఒకే గ్రిడ్’ వంటి పథకాలు పర్యావరణాన్ని కాపాడవలసిన కర్తవ్యాన్ని వివరిస్తాయన్నారు. రైతుల ఆలోచనా ధోరణిని మార్చడంలో నేల తల్లి ఆరోగ్య కార్డులు (Soil Health Cards) ప్రాధాన్యం గురించి నొక్కివక్కాణించారు. భూమి ఆరోగ్యం గురించి అవగాహన లేని సమయంలో రైతులకు సాయిల్ హెల్త్ కార్డులను ఇచ్చే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రారంభించామని చెప్పారు. 


గంగా నది పరీవాహక ప్రాంతాల్లో ప్రకృతి సాగును ప్రోత్సహిస్తామని ఈ ఏడాది బడ్జెట్‌లో చెప్పామన్నారు. 13 నదుల పునరుద్ధరణ ప్రాజెక్టును ఈ ఏడాది మార్చిలో ప్రారంభించామన్నారు. అడవులు 7,400 చదరపు కిలోమీటర్లకుపైగా పెరగడానికి ఈ కార్యక్రమాలు దోహదపడతాయన్నారు. నేడు భారత దేశం అమలు చేస్తున్న జీవవైవిద్ధ్య, వన్య ప్రాణులకు సంబంధించిన విధానాలవల్ల వన్యప్రాణులు రికార్డు స్థాయిలో పెరిగాయన్నారు. పెట్రోలులో 10 శాతం ఇథనాల్‌ను కలపాలన్న లక్ష్యాన్ని నిర్దిష్ట గడువుకు ఐదు నెలల ముందే సాధించామని తెలిపారు. 


‘నేల తల్లిని కాపాడండి’ ఉద్యమాన్ని సద్గురు 2022 మార్చిలో ప్రారంభించారు. ఈ ఉద్యమంలో భాగంగా ఆయన 100 రోజులపాటు 27 దేశాల గుండా మోటార్‌సైకిల్ యాత్ర చేస్తున్నారు. జూన్ 5 ఆదివారం ఈ ఉద్యమంలో 75వ రోజు. 


వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్

పర్యావరణ దినోత్సవం సందర్భంగా తెలుసుకోదగిన మరొక ముఖ్యాంశం ఏమిటంటే, వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ మునుపెన్నడూ లేనంత తీవ్ర స్థాయికి చేరింది. పారిశ్రామికీకరణ పూర్వపు స్థాయి కన్నా 50 శాతంపైగా పెరిగింది. భూమి లక్షలాది సంవత్సరాల క్రితం సముద్రంలో మునిగిపోయినపుడు అత్యంత తీవ్రమైన వేడిగా ఉండేది. అప్పటి నుంచి పరిశీలించినపుడు లేనంత తీవ్ర స్థాయిలో కార్బన్ డయాక్సైడ్ నేటి వాతావరణంలో పెరిగింది. 


అమెరికాలోని నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ వెల్లడించిన వివరాల ప్రకారం, మే నెలలో 421 పార్ట్స్ పెర్ మిలియన్ కార్బన్ డయాక్సైడ్ నమోదైంది. హవాయిలోని మవున లోవా మానిటరింగ్ స్టేషన్ దీనిని నమోదు చేసింది. అదే విధంగా మే నెలలో గ్రీన్‌హౌస్ గ్యాస్ సంవత్సరంలో అత్యధిక స్థాయికి చేరింది. 19వ శతాబ్దంలో పారిశ్రామిక విప్లవానికి ముందు కార్బన్ డయాక్సైడ్ లెవెల్స్ 280 పార్ట్స్ పెర్ మిలియన్ ఉండేవని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అంటే మానవులు వాతావరణాన్ని చెప్పుకోదగ్గ స్థాయిలో మార్చినట్లు అర్థమవుతోందని చెప్తున్నారు. వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ 350 పార్ట్స్ పెర్ మిలియన్‌గా ఉండాలని ఉద్యమకారులు, శాస్త్రవేత్తలు ఆకాంక్షిస్తున్నారు. బొగ్గు, చమురు, గ్యాస్‌లను మండించడం వల్ల పారిశ్రామిక కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు వెలువడతాయి. గ్యాస్ స్థాయి తగ్గవలసిన అవసరం ఉన్న సమయంలో అందుకు విరుద్ధంగా పెరుగుతోందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 


అభివృద్ధి చెందిన దేశాలదే బాధ్యత : ఎన్‌హెచ్ఆర్‌సీ చైర్మన్

వాతావరణ మార్పులను నిరోధించే బాధ్యత అభివృద్ధి చెందిన దేశాలకు ఎక్కువగా ఉందని, ఈ భారాన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలపై మోపకూడదని జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ అరుణ్ మిశ్రా చెప్పారు. త్యాగాలు చేయవలసిన బాధ్యతను అభివృద్ధి చెందుతున్న దేశాలపైకి నెట్టేయకుండా, మరింత ఎక్కువ బాధ్యతను అభివృద్ధి చెందిన దేశాలు మోయాలని పిలుపునిచ్చారు. ప్రపంచ గ్రామం, వసుధైక కుటుంబం అనేవి ఎప్పుడు సాకారమవుతాయో వివరించారు. ఒకే విధమైన ప్రపంచంలో నివసించేందుకు, అభివృద్ధి చెందిన దేశాల ప్రజలతో సమానంగా హక్కులు సాకారమయ్యే ప్రపంచంలో జీవించేందుకు అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రజల అవసరాన్ని,  ఆకాంక్షలను అభివృద్ధి చెందిన దేశాలు గౌరవించినపుడు మాత్రమే ప్రపంచమంతా ఓ గ్రామం అనే భావన సాకారమవుతుందని తెలిపారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాల సందర్భంగా ఆయన ఈ సందేశం ఇచ్చారు. 


Updated Date - 2022-06-05T23:05:37+05:30 IST