సాధికారతా గ్రూపులకు మోదీ దిశానిర్దేశం

ABN , First Publish Date - 2020-04-04T22:28:39+05:30 IST

కోవిడ్-19పై తక్షణం స్పందించేందుకు, సత్వర చర్యల అమలుకు ఏర్పాటు చేసిన సాధికారతా గ్రూపులకు ప్రధాని నరేంద్ర మోదీ శనివారంనాడు దిశానిర్దేశం..

సాధికారతా గ్రూపులకు మోదీ దిశానిర్దేశం

న్యూఢిల్లీ: కోవిడ్-19పై తక్షణం స్పందించేందుకు, సత్వర చర్యల అమలుకు ఏర్పాటు చేసిన సాధికారతా గ్రూపులకు ప్రధాని నరేంద్ర మోదీ శనివారంనాడు దిశానిర్దేశం చేశారు. సాధికారతా గ్రూపులు తీసుకుంటున్న చర్చలు, సన్నద్ధతను అడిగి తెలుసుకున్నారు. సాధికారతా గ్రూపులతో ఏర్పాటు చేసిన సంయుక్త సమావేశానికి ప్రధాని అధ్యక్షత వహించినట్టు ప్రధాని కార్యాలయం ఓ ట్వీట్‌లో తెలియజేసింది.


'సాధికారతా గ్రూపుల సంయుక్త సమావేశానికి మోదీ అధ్యక్షత వహించారు. దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్న ఆసుపత్రులు, ఐసొలేషన్, క్వారంటైన్ సౌకర్యాల కల్పన, సంసిద్ధతలపై ప్రధాని ఈ సమావేశంలో సమీక్షించారు' అని ఆ ట్వీట్‌లో పీఎంఓ తెలిపింది. 2005 విపత్తుల నిర్వహణా చట్టం కింద కోవిడ్-19పై సమగ్ర, సత్వర స్పందన కోసం 11 సాధికారతా గ్రూపులను కేంద్ర హోం శాఖ ఈనెల 29న ఏర్పాటు చేసింది.


మెడికల్ ఎమర్జెన్సీ ప్లాన్, ఆసుపత్రుల అందుబాటు, ఐసొలేషన్, క్వారంటైన్ సౌకర్యాలు, వ్యాధి నిర్ధారణ, క్రిటికల్ కేర్ ట్రైనింగ్, వైద్య పరికరాలు అందుబాటులో ఉండేలా చూడటం, మానవ వనరులను సమర్ధవంతంగా ఉపయోగించుకోవడం, ఆహారం, మందులు వంటి అత్యవసరాలను అందుబాటులో ఉంచేలా చూడటం, వీటికి సంబంధించి ప్రైవేటు రంగం, ఎన్జీవోలు, అంతర్జాతీయ సంస్థలతో సమన్వయం చేయడం, ఆర్థిక, సంక్షేమ చర్యలు, కమ్యూనికేషన్, ప్రజల్లో చైతన్యం తీసుకురావడం, టెక్నాలజీ-డాటా మేనేజిమెంట్, ప్రజా సమస్యలు, సూచనలు, లాక్‌డౌన్‌కు సంబంధించిన వ్యూహాత్మక అంశాలపై ఈ సాధికారతా సంస్థలు ప్రధానంగా దృష్టి సారిస్తుంటాయి. 11 సాధికారతా గ్రూపులలో తొమ్మది గ్రూపులకు సెక్రటరీ స్థాయి అధికారులు, ఒక గ్రూపునకు నీతి ఆయోగ్ సభ్యుడు, మరో గ్రూపునకు నీతి ఆయోగ్ సీఈఓ నేతృత్వం వహిస్తుంటారు.


ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయనే దానిని ఈ గ్రూపులు గుర్తించి, సమర్థవంతమైన పరిష్కారాలు అందజేస్తుంటారు. ఇందుకు అవసరమైన ప్రణాళికలను నిర్దిష్ట కాలపరిమితిలోగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటారు.

Updated Date - 2020-04-04T22:28:39+05:30 IST