మార్పును బిహార్ వ్యతిరేకించిందా?

ABN , First Publish Date - 2020-11-14T05:53:32+05:30 IST

అమెరికాలో మార్పును లక్ష్యిస్తున్నవారు విజయం సాధించారు. బిహార్‌లో మార్పును వ్యతిరేకిస్తున్నవారు అతిస్వల్ప మెజారిటీతో విజయం సాధించారు. నరేంద్ర మోదీ 2014 నుంచి ప్రధానమంత్రిగా ఉన్నారు. నితీశ్ కుమార్ 2005 నుంచి ముఖ్యమంత్రిగా.....

మార్పును బిహార్ వ్యతిరేకించిందా?

అమెరికాలో మార్పును లక్ష్యిస్తున్నవారు విజయం సాధించారు. బిహార్‌లో మార్పును వ్యతిరేకిస్తున్నవారు అతిస్వల్ప మెజారిటీతో విజయం సాధించారు. నరేంద్ర మోదీ 2014 నుంచి ప్రధానమంత్రిగా ఉన్నారు. నితీశ్ కుమార్ 2005 నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నారు. దేశంలో అత్యంత పేద రాష్ట్రం బిహారే. బిహార్ ఓటర్లు ‘మార్పుకు వ్యతిరేకంగా’ ఓటు వేశారా? అదే నిజమైతే వారి నిర్ణయాన్ని గౌరవిద్దాం. యథావిధిగా ముందుకు సాగుదాం.


ప్రతిఎన్నికలోను ఒక విజేత ఉంటాడు, ఒక పరాజితుడు ఉంటాడు. అయితే ప్రతి ఎన్నిక ఒక జాతిని అంతకు ముందుకంటే మరింత ఎక్కువగా విభజిస్తుంది. ఇదే, అమెరికా అధ్యక్ష పదవీ ఎన్నికతో పాటు మన దేశంలోని బిహార్ రాష్ట్ర శాసనసభ ఎన్నికలు చెప్పిన పాఠం లేదా మిగిల్చిన అనుభవం. ఉప ఎన్నికలు ఒక భిన్నమైన వ్యవహారం. ఒకప్పుడు ఒక రాష్ట్రంలో ఒకటి లేదా రెండు ఉప ఎన్నికలు, ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వ పాలనా దక్షత, ఆమోదయోగ్యతకు పరీక్షగా పరిగణింపబడేవి. అటువంటి పరిస్థితి ఇంకెంత మాత్రం లేదు. నేడు ఉప ఎన్నికలలో అధికార పక్షం అనేక అనుకూలతలతో రంగంలోకి దిగుతుంది. 


ఎన్నికల విషయంలో ఓటర్ల మధ్యేకాదు, భిన్న ప్రాంతాల మధ్య కూడా తప్పక తేడాలు ఉంటాయి. సార్వత్రక ఎన్నికలు ఆ వ్యత్యాసాలను ప్రతిబింబిస్తున్నాయి. సంపూర్ణ అక్షరాస్యత ఉన్న కేరళలో ఓటర్లు తమ ప్రజాస్వామిక హక్కును ఒక పద్ధతి ప్రకారం ఉపయోగించుకోవడం కద్దు. కేరళ ప్రజలు రెండు ఫ్రంట్ లకు మద్దతు నివ్వడం ఒక పరిపాటిగా ఉంది. సిపి ఎం నేతృత్వంలోని లెప్ట్ డెమొక్రాటిక్ ఫ్రంట్ (ఎల్ డీఎఫ్) కాంగ్రెస్ సారథ్యంలోని యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (యూడీ ఎఫ్),కు ప్రాధాన్యమిస్తూ ప్రత్యామ్నాయ ఎన్నికలలో వాటిని ఎన్నుకొంటున్నారు. 1980 నుంచీ కేరళలో ఇదే ధోరణి. తమిళనాడులో కూడా 1989 నుంచి డిఎంకె లేదా అన్నా డిఎంకెను ఎన్నుకొంటున్నారు. అయితే ఈ ఆనవాయితీని జయలలిత 2016లో బద్దలు గొట్టారు. ఆ సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో జయలలిత నాయకత్వంలోని అన్నా డిఎంకె, కరుణానిధి సారథ్యంలోని డిఎంకెను చిత్తు చేసింది. పంజాబ్ కూడా 2012 వరకు కేరళ వలే ప్రత్యామ్నాయ పార్టీ లేదా ఫ్రంట్‌లను ఎన్నుకొనేది. 


ఉత్తర భారతావనిలో గుజరాత్ నుంచి బిహార్ దాకా కాంగ్రెస్ ప్రాబల్యాన్ని బీజేపీ కూలదోసింది. దక్షిణాది రాష్ట్రాల- కేరళ, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి-లో ప్రాంతీయ పార్టీలదే రాజ్యం- కర్ణాటకలో మినహా. కేరళలో కాంగ్రెస్, సిపిఎం, సిపిఐలు ఒక జాతీయ పార్టీ రాష్ట్ర విభాగాలుగా కాకుండా కేరళకే పరిమితమైన ప్రాంతీయ పార్టీలుగా వ్యవహరించడం కద్దు. మళ్ళీ ‘విభజిత జాతి’ పరిణామం విషయం వద్దకు వద్దాం. ఎన్నికల జయాపజయాలు ఒక జాతిలో తీవ్ర విభజనలకు దారి తీయడానికి ప్రధాన కారణం ఎథ్నో -జాతీయ వాదం. అమెరికాలో ఈ జాతీయవాద ధోరణి శ్వేతజాతీయుల పూర్ణాధిపత్యం, జాతి, జెండర్ పరమైన దురభిమానాలు, ప్రపంచీకరణ పట్ల పాదుకు పోయిన అనుమానాలను గోప్యపరుస్తోంది. అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన నాలుగేళ్ళ పాలనలో పలు దిగ్భ్రాంతికరమైన నిర్ణయాలు తీసుకున్నారు. నాఫ్తా కూటమి నుంచి వైదొలగడం, పారిస్ వాతావరణ ఒడంబడిక నుంచి ఉపసంహరించుకోవడం, ఐక్యరాజ్యసమితికి, దాని అనుబంధ సంస్థలకు నిధులు నిరాకరించడం మొదలైనవన్నీ అమెరికా ప్రయోజనాలకే కాకుండా అంతర్జాతీయ సమాజానికీ హాని చేసేవే. అయినప్పటికీ ఆ నిర్ణయాలకు ఆయన ప్రజల ఆమోదాన్ని పొందగలిగారు. సంకుచిత జాతీయవాద ధోరణుల ప్రభావమే అందుకు కారణం. 


మన దేశంలో హిందువుల సర్వాధిపత్యం, అగ్ర కులాల ప్రాబల్యం, మైనారిటీలు, దళితులు, పాకిస్థాన్ పట్ల ద్వేష భావం మొదలైన అసహన ధోరణులను జాతీయవాదం కప్పిపుచ్చుతుంది. తన జనాభాలో సగం మందిని లేదా అంతకంటే ఎక్కువ మందిని పేదవాళ్ళుగా ఉంచడం ద్వారా ఏ దేశమూ అభివృద్ధి చెందిన దేశం కాలేదు. కచ్చితంగా సంపన్న దేశం కాలేదు. ఇరుగు పొరుగు దేశాలతో నిరంతరం ఘర్షణపడే ఏ దేశమూ తన వనరులను అభివృద్ధికి సరైన విధంగా వినియోగించలేదు. వాణిజ్య రంగంలో సంరక్షణ విధానాలను అనుసరించే ఏ దేశం కూడా అభివృద్ధి చెందలేదు. బాహ్య, అంతర్గత వలసలను నిరోధించే ఏ దేశం కూడా అభివృద్ధి సాధనకు అవసరమైన ప్రతిభా పాటవాలను సంతరించుకోలేదు. ఇటువంటి సంకుచిత జాతీయ వాద ధోరణులను విడనాడాలని విశ్వకవి రవీంద్రుడు ఏనాడో మనలను హెచ్చరించాడు. 


నవంబర్ 3 అమెరికా అధ్యక్ష పదవీ ఎన్నికలలో ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు 72.3 మిలియన్ ఓట్లు (47.4 శాతం) వచ్చాయి. అయితే ఆయన పరాజయం పాలయ్యాడు. ట్రంప్ ప్రత్యర్థి జో బైడెన్ అమెరికా తదుపరి అధ్యక్షుడుగా ఎన్నికయ్యారని ప్రపంచ నాయకులు అంగీకరిస్తున్నారు. బైడెన్‌ను అభినందిస్తున్నారు. అయితే ట్రంప్ గానీ, ఆయన మద్దతుదారులు గానీ, ఈ వ్యాసం రాస్తున్న సమయానికి, ట్రంప్ ఓడిపోయారన్న వాస్తవాన్ని అంగీకరించేందుకు సిద్ధంగా లేరు! మన దేశంలో నరేంద్ర మోదీ వరుసగా అనేక ఎన్నికలలో విజయం సాధిస్తూ వస్తున్నారు. అయితే మైనారిటీల (ముఖ్యంగా ముస్లింల) లేదా దళితుల మద్దతును పొందేందుకు ఆయన ఎటువంటి ప్రయత్నాలు చేయడం లేదు. పేదప్రజలతో ఆయన సంబంధం పూర్తిగా ఒక లావాదేవీ వ్యవహారమే: ‘మీరు నాకు ఓటు వేయండి, మీకు నేను విద్యుత్తు, కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా ఉచిత వ్యాక్సిన్ మొదలైన వాటిని సమకూరుస్తాను’.


ప్రతి చిన్నారికి ప్రపంచస్థాయి ప్రమాణాలతో కూడిన విద్యను అందించే సమాజంగా భారత్‌ను పునః భావించే ప్రయత్నాలు లేవు. ప్రతి పేద కుటు ంబం హుందాగా జీవించేందుకు దోహదం చేసే ఉద్యోగం/ఉపాధి పొందే ఆర్థిక వ్యవస్థగా భారత్‌ను పునఃభావించే ప్రయత్నాలూ లేవు. పాలనపై కుల మతాల, భాషా ప్రాంతాల ప్రభావం లేకుండా చేసేందుకు పాలకులు ప్రయత్నిస్తున్నారా? లేదు. సైన్స్, టెక్నాలజీల ఆలంబనతో ఒక ఆధునిక, లౌకిక, వైవిధ్యపూరిత స్వేచ్ఛా సమాజంగా భారత్‌ను పునః భావిస్తున్నారా? లేదు. సంకల్పమే లేనప్పుడు ఆచరణకు ప్రేరణ ఎక్కడ నుంచి వస్తుంది?


అమెరికా సమాజంలోనూ ఎన్నో లొసుగులు, వైషమ్యాలు ఉన్నాయి. అయితే ‘సమాజంలోని అన్ని విభజనలను రూపుమాపుతానని, సంఘర్షణలకు స్వస్తి చెప్పి సహకారాన్ని పెంపొందిస్తానని, ప్రజల సంక్షేమానికి దోహదం చేసే విధంగా రాజ్యవ్యవస్థను తీర్చిదిద్దుతానని, జాతి, జెండర్ వివక్షలను తొలగించి అందరికీ సమానవకాశాలను మెరుగుపరుస్తానని జో బైడెన్ భరోసా ఇచ్చారు. మన దేశంలో, ముఖ్యంగా ఉత్తర భారతావని రాష్ట్రాలలో రంగంలో ఉన్న ఏ రాజకీయ పార్టీ కూడా నరేంద్ర మోదీ, బీజేపీ/ ఆర్‌ఎస్‌ఎస్‌ల కథనాలు, ప్రచారాలలోని అసంబద్ధతను ఎత్తి చూపగల ప్రత్యామ్నాయ సందేశాలను ఇవ్వలేకపోతోంది.


అటు అమెరికన్ సమాజం లోనూ ఇటు మన సమాజంలోనూ ఉన్న విభజనలు మరింత తీవ్రమవనున్నాయని నేను అభిప్రాయపడుతున్నాను. అమెరికా సమాజంలో సామాజిక అశాంతి తప్పక ప్రబలుతుంది. అయితే ఆర్థిక వ్యవస్థ కచ్చితంగా మెరుగుపడుతుంది. మరింత అభివృద్ధిని సాధిస్తుంది. పెట్టుబడులను ఆకర్షిస్తుంది. ఉద్యోగాలను సృష్టిస్తుంది. పేదల అభ్యున్నతికి తోడ్పడుతుంది. మన భారత్ పరిస్థితి వేరు. పరిస్థితులు మరింతగా దిగజారుతాయి. సమాజం పలు వైషమ్యాలతో మరింతగా చీలిపోతుంది. ఆర్థిక వ్యవస్థ పెరుగుదల పెద్దగా ఉండదు. పేదలు పేదలుగానే మిగిలిపోతారు. ఆర్థిక అసమానతలు మరింతగా పెరిగిపోతాయి. అమెరికాలో మార్పును లక్ష్యిస్తున్నవారు విజయం సాధించారు. బిహార్‌లో మార్పును వ్యతిరేకిస్తున్నవారు అతి స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు. నరేంద్ర మోదీ 2014 నుంచి అధికారంలో ఉన్నారు. నితీశ్ కుమార్ 2005 నుంచి అధికారంలో ఉన్నారు. దేశంలో అత్యంత పేద రాష్ట్రం బిహారే. బిహార్ ఓటర్లు ‘మార్పుకు వ్యతిరేకంగా’ ఓటు వేశారా?అదే నిజమైతే వారి నిర్ణయాన్ని గౌరవిద్దాం. యథావిధిగా ముందుకు సాగుదాం.




పి. చిదంబరం

(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు)

Updated Date - 2020-11-14T05:53:32+05:30 IST