ప్రధాని బంగ్లా యాత్ర

ABN , First Publish Date - 2021-03-27T06:04:50+05:30 IST

భారత ప్రధాని నరేంద్రమోదీ బంగ్లాదేశ్ పర్యటనకు అనేక నేపథ్యాలు, ప్రాధాన్యాలు ఉన్నాయి. బంగ్లాదేశ్ అవతరణ చరిత్రలో భారత్ ప్రమేయాన్ని ఉభయదేశాల ప్రజలకు గుర్తుచేయడం, ఉపఖండంలో సోదరదేశాల మైత్రీబంధాన్ని పునరుద్ఘాటించి....

ప్రధాని బంగ్లా యాత్ర

భారత ప్రధాని నరేంద్రమోదీ బంగ్లాదేశ్ పర్యటనకు అనేక నేపథ్యాలు, ప్రాధాన్యాలు ఉన్నాయి. బంగ్లాదేశ్ అవతరణ చరిత్రలో భారత్ ప్రమేయాన్ని ఉభయదేశాల ప్రజలకు గుర్తుచేయడం, ఉపఖండంలో సోదరదేశాల మైత్రీబంధాన్ని పునరుద్ఘాటించి చైనా ప్రాబల్యాన్ని తగ్గించే ప్రయత్నం చేయడం, పనిలో పనిగా బెంగాల్ ఎన్నికలలో తన పార్టీకి దోహదం చేసే పనులు చక్కబెట్టుకోవడం. బంగ్లాదేశ్ లో పర్యటించవలసిన సందర్భం నిజంగా విశేషమైనదే. బంగ్లాదేశ్ స్వాతంత్ర్య స్వర్ణోత్సవాలు, ఆ దేశ జాతిపిత, బంగబంధు షేక్ ముజిబుర్ రెహమాన్ శతజయంతి ఉత్సవాలు జమిలిగా జరుగుతున్నాయి. ముజిబుర్ రెహమాన్ కుమార్తె, ప్రస్తుత బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా హయాంలో ఉభయదేశాల మధ్య సత్సంబంధాలున్నాయి, వాటిని మరింత పటిష్ఠపరచుకునే సంకల్పం కూడా ఉభయదేశాల నేతలకు ఉన్నది. సందర్భం ఇంతటి ముఖ్యమైనది కాబట్టే, దాదాపు పదిహేనునెలల తరువాత ప్రధాని మొదటిసారిగా విదేశపర్యటనకు వెళ్లారు. ప్రధాని కోసం ప్రత్యేకంగా రూపొందించిన అత్యాధునిక నూతన విమానంలో ఆయన బంగ్లాదేశ్‌కు మొదటి ప్రయాణం చేశారు. ఈ సందర్శనలో ఆయన ముజిబుర్ రెహమాన్ సమాధిని సందర్శించనున్నారు. బంగబంధు సమాధిని సందర్శించబోయే మొదటి విదేశీ నేత కూడా మోదీయే. 


భారత, బంగ్లా దేశాల మధ్య సంబంధాలు ఈ యాభై ఏళ్ల కాలం అంతటా సుహృద్భావంతో లేవు. బంగ్లాదేశ్ సరిహద్దులను దాటి దేశంలోకి అక్రమంగా ప్రవేశించే వలసదారులు అస్సాంకు సమస్యగా మారి, అక్కడ పెద్ద ఉద్యమమే వచ్చింది. ఇస్లామిక్ శక్తులు బలపడుతున్న కొద్దీ భారతదేశంపై వ్యతిరేకత కొద్దికొద్దిగా పెరుగుతూ వచ్చింది. ఖలీదా జియా హయాంలో బంగ్లాదేశ్‌లోని మైనారిటీలపై జరిగిన దాడులు బెంగాల్ లోకి వలసలను పెంచాయి. బంగ్లాదేశ్ సరిహద్దుల నుంచి అక్రమంగా వలస వచ్చేవారు భారతదేశంలో నలుమూలలా వ్యాపించడాన్ని భారతీయ జనతాపార్టీ, దాని అనుబంధ శక్తులు చాలా కాలంగా ప్రచారం చేస్తూ వస్తున్నాయి. బంగ్లాదేశ్ కూడా భారత్‌తో సత్సంబంధాలలో లేకపోవడం, యావత్ ఉపఖండంలో భారత్ ఏకాకి అవుతుందేమోనన్న ఆందోళనను పెంచింది కూడా. 


బంగ్లాదేశ్ మన దేశానికి పొరుగు దేశం మాత్రమే కాదు. ఒకప్పుడు అది విశాల భారతదేశంలో అంతర్భాగం. బ్రిటిష్ వలసపాలకులు భారతదేశంలో అనైక్యతను పెంచి పోషించే కుయుక్తులలో భాగంగా, 1905లో బెంగాల్ విభజన చేశారు. మతప్రాతిపదికన బెంగాల్‌ను రెండుగా విభజించడాన్ని యావత్ దేశం నిరసించింది. భారతదేశ జాతీయోద్యమ ప్రస్థానంలో అదే మొదటి పెద్ద ఉద్యమం. నాడు బ్రిటిషర్లు విభజనను వెనక్కు తీసుకోవలసి వచ్చినప్పటికీ, దేశవిభజన సందర్భంగా బెంగాల్ రెండుగా మారకతప్పలేదు. పాకిస్థాన్ తూర్పు భూభాగంగా సగం బెంగాల్ మారిపోయింది. కానీ, పాకిస్థాన్ తూర్పు బెంగాల్‌ను సమానప్రతిపత్తితో చూడకపోవడం, బెంగాలీ భాషను, సంస్కృతిని చిన్నచూపు చూడడం ప్రజాందోళనలకు దారితీసింది. మతం ఒకటే అయినా, భాష, సంస్కృతి వేరు కావడంతో ఐక్యత సాధ్యపడలేదు. అంతిమంగా, అది మహాప్రజా ఉద్యమానికి దారితీసింది. అవామీ లీగ్ ఆధ్వర్యంలో జరిగిన ప్రజా ఆందోళనపై పాక్ నియంత యాహ్యాఖాన్ ఉక్కుపాదం మోపాడు.


1971 మార్చి 25-, 26 తేదీలలో అవామీ లీగ్ నేత షేక్ ముజిబుర్ రెహమాన్, తూర్పు పాకిస్థాన్ చిటగాంగ్ రెజిమెంట్ అధిపతి మేజర్ జియా వుర్ రెహమాన్ (తరువాత ఈయన బంగ్లాదేశ్ పాలకుడయ్యారు) రహస్య రేడియ కేంద్రాల ద్వారా, మిలటరీ కమ్యూనికేషన్ల ద్వారా తూర్పుపాకిస్థాన్ వేర్పాటును, బంగ్లాదేశ్ అవతరణను ప్రకటించారు. తీవ్రమైన అణచివేత, ఉధృతమైన పోరాటం నిజానికి ఆ తరువాత కాలంలోనే జరిగినప్పటికీ, ప్రత్యేక దేశం అవతరణను ప్రకటించిన రోజునే స్వాతంత్ర్యదినోత్సంగా బంగ్లాదేశ్ జరుపుకుంటున్నది. 1971 డిసెంబర్ 3-–17 మధ్య జరిగిన భారత్‌–పాక్ యుద్ధం బంగ్లా విమోచనకు సైనికంగా, రాజకీయంగా దోహదం చేసింది. ఒక విముక్తి పోరాటానికి చేసిన సహాయంగా అప్పటి భారత ప్రభుత్వం ఆ దోహదాన్ని చెప్పుకునేది. దేశంలోని తీవ్రజాతీయవాద శక్తులు ఆ పరిణామాన్ని పాకిస్థాన్‌ను విభజించి, బలహీనపరచిన చర్యగా పరిగణిస్తాయి. ఆ శక్తుల పరంపరలోని ప్రస్తుత భారతదేశ రాజకీయ నాయకత్వం కూడా, శత్రువుకు గుణపాఠం చెప్పిన చరిత్రను మరోసారి ప్రజలకు గుర్తు చేస్తున్నది. బెంగాల్‌లో పెరుగుతున్న తీవ్రజాతీయవాదులకు ఈ సందర్భం మంచి ఉత్సాహాన్ని ఇస్తుంది. అలాగే, ఇస్లామిక్‌శక్తులు భారత సైనికచర్యను పాకిస్థాన్ ఆంతరంగిక వ్యవహారాల్లో చేసుకున్న జోక్యంగా పరిగణిస్తాయి. అటువంటి వారి ప్రతినిధులు ఇప్పుడూ ఉన్నారు. మోదీ పర్యటన సందర్భంగా వారు నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. 


బంగ్లాదేశ్ అవతరణలో భారత ప్రమేయాన్ని గుర్తుచేసి, ఉభయదేశాల మధ్య సకలరంగాల స్నేహాల అవకాశాన్ని మరొకసారి చర్చకు తీసుకువచ్చి, ఆ పొరుగుదేశంతో గట్టి సంబంధాలను స్థాపించుకోవడానికి భారతప్రధాని ప్రయత్నిస్తున్నారు. అలనాటి పాక్ అత్యాచారాలను, అణచివేతను కూడా మోదీ ప్రస్తావించారు. రోహింగ్యాలు, బంగ్లా దేశీయుల చొరబాట్లు, పౌరసత్వ వ్యతిరేక చట్టం మొదలైన అంశాలేవీ ఉభయదేశాల ప్రస్తుత నాయకుల మధ్య దూరం పెంచినట్టు లేదు. ప్రాంతీయ సహకార దృష్టితో ఏర్పరిచే సత్సంబంధాలు, భూటాన్ దాకా వచ్చిన చైనాను హద్దులో ఉంచడానికి ఉపయోగపడవచ్చు. ఇక, బంగ్లాదేశ్‌లో మతవా తెగ స్థాపకుని కుటుంబాన్ని కలవడం వెనుక ఎన్నికల ప్రయోజనాలుండవచ్చు. బెంగాల్‌లో ఆరు పార్లమెంటరీ నియోజకవర్గాలలో తగిన సంఖ్యలో ఉన్న మతవా తెగవారు, ప్రత్యేక సాంస్కృతిక ధోరణులున్న దళితులు.

Updated Date - 2021-03-27T06:04:50+05:30 IST