Abn logo
Jun 3 2020 @ 08:16AM

చైనా దూకుడుపై ట్రంప్‌, ప్రధాని మోదీ చర్చలు

సరిహద్దులో ఉద్రిక్తతలు, ప్రపంచ ఆరోగ్య సంస్థ 

సంస్కరణపై మాటామంతీ 

జీ7 సదస్సుకు రావాలని మోదీకి ట్రంప్‌ ఆహ్వానం

కరోనా అనంతర ప్రపంచానికి పునాది మా చర్చలు: మోదీ

తూర్పు లద్ధాఖ్‌లో గణనీయంగా చైనా బలగాలు: రాజ్‌నాథ్‌

భారత్‌ సరిహద్దులవైపు కదులుతున్న డ్రాగన్‌ సైన్యం

నిరంకుశ ప్రభుత్వాలే ఇలా చేస్తాయి: పాంపియో

వాషింగ్టన్‌, జూన్‌ 2: భారత్‌, చైనా వాస్తవాధీన రేఖ వెంబడి చైనా సైన్యాన్ని భారీగా మోహరిస్తోంది. చైనా దళాలు తూర్పు లద్దాఖ్‌ ప్రాంతానికి చేరుకున్నాయని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ వెల్లడించారు. మంగళవారం కూడా పెద్దఎత్తున చైనా బలగాలు భారత్‌ సరిహద్దువైపు కదిలాయని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్‌ పాంపియో వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే, సరిహద్దుల్లో ఉద్రిక్తతలు, డబ్ల్యూహెచ్‌వోలో సంస్కరణలపై ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో ఫోన్లో మాట్లాడారు. దాదాపు 25 నిమిషాలపాటు జరిగిన చర్చల్లో కరోనా కట్టడి, జీ-7 శిఖరాగ్ర సమావేశం సహా పలు అంశాలూ చర్చకు వచ్చాయి. అనంతరం ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది.


అమెరికాలో ప్రస్తుతం జరుగుతున్న ప్రజాందోళనలపై మోదీ ఆందోళన వ్య క్తం చేశారని, సమస్య త్వరలోనే సమసిపోవాలని ఆకాంక్షించారని తెలిపింది. జీ7ను విస్తరించి భారత్‌ సహా రష్యా, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియాలకు సభ్యత్వం కల్పించాలని ట్రంప్‌ ఆకాంక్షించినట్లు వివరించింది. అమెరికాలో జరిగే జీ7 సదస్సుకు మోదీని ట్రంప్‌ ఆహ్వానించినట్లు తెలిపింది. ట్రంప్‌ది సృజనాత్మక, దూరదృష్టి కలిగిన ఆలోచనగా మోదీ కొనియాడారని, జీ7ను విస్తరించడం ద్వారా కరోనా అనంతరం ఎదురయ్యే సవాళ్లను అధిగమించవచ్చని తెలిపారని పేర్కొంది. అనంతరం ట్రంప్‌తో తన సంభాషణపై మోదీ ట్వీట్‌ చేశారు. ‘‘నా మిత్రుడు ట్రంప్‌తో ఫలవంతమైన చర్చలు జరిగాయి. జీ7, కరోనా సహా వివిధ అంశాలపై చర్చించాం’’ అని పేర్కొన్నారు. తమ దేశాన్ని చిన్నబుచ్చడానికి చేసే ప్రయత్నం విఫలమవుతుందని చైనా వ్యాఖ్యానించింది.


తూర్పు లద్ధాఖ్‌లో చైనా బలగాలు: రాజ్‌నాథ్‌

తూర్పు లద్ధాఖ్‌లో ‘గణనీయమైన సంఖ్య’లో చైనా బలగాలు మోహరించాయని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ వెల్లడించారు. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి భారత్‌ అన్ని చర్యలూ తీసుకుందన్నారు. జూన్‌ 6న భారత్‌, చైనా సైనికాధికారుల సమావేశం జరగనుందని, తన వైఖరి నుంచి భారత్‌ వెనక్కి వెళ్లే పరిస్థితే లేదన్నారు.


చైనా నిరంకుశత్వం: పాంపియో

‘‘వూహాన్‌లో మొదలైన కరోనా వైరస్‌ వివరాలను వెల్లడించకుండా ఆలస్యం చేసి ప్రపంచమంతా మూల్యం చెల్లించేలా చేసింది. హాంకాంగ్‌ ప్రజల స్వేచ్ఛను కాలరా స్తూ చట్టాన్ని తీసుకొచ్చింది. భారత్‌తో వాస్తవాధీన రేఖ వెంబడి తన సైన్యాన్ని మరింతగా పెంచింది. చైనా కమ్యూనిస్టు పార్టీ నిరంకుశత్వ వైఖరికి ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే’’ అని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్‌ పాంపియో మండిపడ్డారు. భారత్‌తో సరిహద్దుల వద్ద చైనా సైన్యం మోహరించడంపై ఆందోళన వ్యక్తం చేశారు. చైనా వ్యవహరించే తీరు ఆ దేశాన్ని పాలిస్తున్న కమ్యూనిస్టు పార్టీ ప్రవర్తనకు నిదర్శనమని పాంపియో దుమ్మెత్తి పోశారు. చైనా చర్యలను అడ్డుకోవాల్సిన బాధ్యత, అడ్డుకోగలిగిన సామర్ధ్యం అమెరికాకు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు.. నిబంధనల్ని గౌరవించి.. చర్చలు, దౌత్యపరమైన చర్యల ద్వారా సరిహద్దు వివాదాన్ని పరిష్కరించుకోవాలని అమెరికా ప్రతినిధుల సభ విదేశీ వ్యవహారాల కమిటీ  చీఫ్‌ ఎలియట్‌ ఏంజెల్‌, చైనాకు హితవు పలికారు. వాస్తవాధీన రేఖ వద్ద చైనా దుందుడుకు ప్రవర్తన తీవ్ర ఆందోళనకర అంశమని ఆయన స్పష్టం చేశారు. ‘‘చర్చల ద్వారా కంటే ఇరుగుపొరుగు దేశాలను తమ సైనిక బలంతో కవ్వించేందుకే చైనా ఆరాటపడుతోంది. చైనా సహా అన్ని దేశాలు అంతర్జాతీయ చట్టాల్ని గౌరవించాల్సిందే. బలమైన వాడిదే రాజ్యం అనే ప్రపంచంలో మనం బతకట్లేదు. ఈ విషయాన్ని చైనా గుర్తించాలి’’ అని ఆయన పేర్కొన్నారు. 


అమెరికాపై చైనా ఆగ్రహం

అమెరికా తమతో ప్రచ్ఛన్న యుద్ధాన్ని ప్రారంభించాలని చూస్తోందని చైనా ఆరోపించింది. జీ-7 దేశాల్లో దూరం పెట్టడం ద్వారా ప్రపంచం నుంచి తమను వేరు చేయాలనే ప్రయత్నాలు ఫలించవంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యంగా కరోనా విషయంలో తమపై లేనిపోని అబద్ధాలన్నీ కల్పించి ప్రపంచానికి చెబుతోందని ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి వాంగ్‌ యీ ఆక్షేపించారు. హాంకాంగ్‌ విషయం తమ దేశ అంతర్గత వ్యవహారమని, బయటివారి జోక్యాన్ని సహించబోమన్నారు.

Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement
Advertisement