ఖాళీ కుర్చీకి పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి దరఖాస్తు

ABN , First Publish Date - 2022-05-28T05:40:17+05:30 IST

పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకం దరఖాస్తు సమర్పణకు వచ్చిన మహిళా రైతుకు అధికారులు ఎవరూ కనిపించకపోవడంతో ఖాళీ కుర్చికి దరఖాస్తు సమర్పించింది.

ఖాళీ కుర్చీకి పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి దరఖాస్తు
కుర్చీకి వినతిపత్రం సమర్పిసున్న మహిళా రైతు

అధికారులు అందుబాటులో లేకపోవడంతో మహిళా రైతు నిరసన 

జగిత్యాల అర్బన్‌, మే 27: పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకం దరఖాస్తు సమర్పణకు వచ్చిన మహిళా రైతుకు అధికారులు ఎవరూ కనిపించకపోవడంతో ఖాళీ కుర్చికి దరఖాస్తు సమర్పించింది. జగిత్యాల అర్బన్‌ మండలం లింగంపేట(మున్సిపల్‌ వార్డు ప్రస్తుతం) చెందిన లక్ష్మి రైతు ఇటీవలే భూమిని కొనుగోలు చేసింది. పట్టాదారు పాసుబుక్‌ రావడంతో తన భూమికి సంబంధించిన వివరాలను వ్యవసాయ శాఖ అధికారులకు అందించి తనకు పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధితో పాటు రైతు బంధు వచ్చేలా చూడాలని కోరుతూ దరఖాస్తు సమర్పించేందుకు వ్యవసాయ శాఖ కార్యాలయానికి వచ్చింది. మహిళా రైతుకు అధికారులు ఎవరూ కనిపించక పోవడంతో కుర్చీలో దరఖాస్తు పెట్టి వెళ్లింది. విషయం తెలుసుకొని అక్కడికి చేరుకున్న బీజేపీ నేతలు ఆమెకు సంఘీభావం ప్రకటించారు. బీజేపీ నాయకులు శ్రీనివాస్‌ మాట్లాడుతూ సంక్షేమ ఫలాల దరఖాస్తుకు వచ్చిన రైతులకు అధికారులు అందుబాటులో ఉండేలా చూడాలని కోరారు. ఇదే విషయమై జిల్లా వ్యవసాయ అధికారి సురేష్‌ కుమార్‌ను వివరణ కోరగా రూరల్‌, అర్బన్‌ మండల కార్యాలయాన్ని తరలించి, ఏడీఏ ఆపీస్‌లోకి మార్చామని, సిబ్బంది అందుబాటులో ఉండగా కుర్చీకి దరఖాస్తు ఇచ్చినట్లు తెలిసిందని ఆయన వివరణ ఇచ్చారు. రైతులు అవసరమైతే జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయానికి రావాలని  కోరారు.


Updated Date - 2022-05-28T05:40:17+05:30 IST