ముంచుకొస్తున్న గడువు..

ABN , First Publish Date - 2022-07-22T05:41:14+05:30 IST

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కూడా పీఎం కిసాన్‌ లబ్ధి పొందాలంటే ఆధార్‌ అథెంటికేషన్‌ ఉన్న ప్రతి ఒక్క రైతు తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకుంటేనే పథకం తాలూకా సొమ్ము వారి ఖాతాల్లో జమ అవుతుందని కేంద్రం ప్రకటించింది.

ముంచుకొస్తున్న గడువు..

 పీఎం కిసాన్‌ ఈ కేవైసీకి ఈ నెలఖారే ముగింపు

 ఇప్పటికీ 50శాతం కూడా పూర్తికాని వైనం

 ఖరీఫ్‌ పనుల్లో రైతులు, అవగాహన లోపం కూడా కారణమే

 లబ్ధిపొందాలంటే ఈ కేవైసీ తప్పనిసరి

 గతంలో కూడా చాలామందికి అందని పథకం

 

సేద్యంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న అన్నదాతలకు అండగా ఉండాలనే ఉద్దేశంతో కేంద్రం పీఎం కిసాన్‌ పథకాన్ని అమలు చేస్తోంది. కానీ ప్రతి ఏటా కేంద్రం జమ చేసే లబ్ధిదారుల సంఖ్యకు క్షేత్రస్థాయిలో ఉన్న రైతాంగం సంఖ్యకు పొంతనే ఉండడం లేదు. ఆధార్‌, బ్యాంకు అనుసంధానం, ఈ కేవైసీ ఇలాంటి సాంకేతిక కారణాలను చూపడంతో చాలామంది అన్నదాతలకు పీఎం కిసాన్‌ పథకం ఫలాలు అందకుండా పోతున్నాయి. ఇలాంటి అంశాలపై అవగాహన కల్పించాల్సిన యంత్రాంగం మొక్కుబడిగా కార్యక్రమాలు నిర్వహించడంతో అవగాహన లేమితో అందే ఆ కాస్త మొత్తానికి కూడా అన్నదాతలు దూరంగా ఉండిపోవాల్సి వస్తుంది.



బాపట్ల,జూలై 21(ఆంధ్రజ్యోతి): ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కూడా పీఎం కిసాన్‌ లబ్ధి పొందాలంటే ఆధార్‌ అథెంటికేషన్‌ ఉన్న ప్రతి ఒక్క రైతు తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకుంటేనే పథకం తాలూకా సొమ్ము వారి ఖాతాల్లో జమ అవుతుందని కేంద్రం ప్రకటించింది. దీనికి గడువును ఇప్పటికే పలుమార్లు పొడిగించుకుంటూ వచ్చిన కేంద్రం  జూలై 31ను చివరి తేదీ గా నిర్ణయించింది. ఒకవైపు గడువు ముంచుకొస్తున్నప్పటికీ గుంటూరు, బాపట్ల జిల్లాల్లో ఈ కేవైసీ చేయించుకున్న రైతుల సంఖ్య 50శాతం దాటలేదు. ఈ లెక్కనే నమోదు కొనసాగితే వేల సంఖ్యలో రైతులు కేవలం ఈ కేవైసీ కారణంగా పీఎం కిసాన్‌కు అనర్హులుగా మిగిలిపోయే  ప్రమాదం పొంచి ఉంది. యంత్రాంగం ఇప్పుడు గ్రామాల్లో అవగాహన సభులు నిర్వహించి రైతులను ఈ కేవైసీ చేయించుకోవాలని చైతన్యపరుస్తోంది. ఖరీఫ్‌ పనులు ముమ్మరంగా సాగుతున్న సమయం కావడంతో అన్నదాతలు దీనిపై దృష్టి సారించడం లేదని తెలుస్తోంది. రైతులందరూ విధిగా ఈ కేవైసీ చేయించుకోవాలని వ్యవసాయశాఖ విజ్ఞప్తి చేస్తోంది


50శాతం కూడా పూర్తికాలేదు...

బాపట్ల జిల్లాలో 1,93,408 మంది రైతులుంటే ఇప్పటి వరకు ఈ కేవైసీ చేయించుకుంది దాదాపు 75,000 మంది మాత్రమేనని తెలుస్తోంది. అదే విధంగా గుంటూరు జిల్లాలో 1,37,119 మంది ఆధార్‌ అథెంటికేషన్‌ రైతాంగం ఉంటే ఇప్పటి వరకు 45,000కు సంఖ్య మించలేదని సమాచారంగా ఉంది. అలాగే పల్నాడు జిల్లాలో లబ్ధిదారులు 2.34 లక్షల మందిం ఉండగా, కేవైసీ 1.04 లక్షల మంది, అంటే 45 శాతం నమోదు చేసుకున్నారు. నమోదులో ఇంకా 50శాతం కూడా చేరుకోకపోవడం, గడువు దగ్గరపడుతుండడం ఆందోళన కలిగిస్తోంది


ఇప్పటికి 11 విడతలుగా సాయం విడుదల...

కేంద్రం 2019లో పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. అప్పటి నుంచి ఏడాదికి మూడు సార్లు చొప్పున మొత్తం 11 విడతలుగా సాయాన్ని అన్నదాతలకు  అందించింది.  విడతకు రెండు వేల రూపాయల చొప్పున ఏడాదికి మూడుసార్లు రూ.6,000ను అన్నదాతల ఖాతాల్లో కేంద్రం జమ చేస్తోంది. ఏటికేడు పీఎం కిసాన్‌ అందుకుంటున్న వారి సంఖ్య తగ్గిపోతుండడంతో దీనిపై కూడా పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సాంకేతిక కారణాలతో అర్హులైన అన్నదాతలు కూడా పీఎం కిసాన్‌ సాయాన్ని అందుకోలేకపోతున్నారు


కౌలు దారులకు అందని పీఎం కిసాన్‌...

పీఎం కిసాన్‌ పథకం కేవలం సొంత భూమి ఉన్న రైతులకు మాత్రమే వర్తిస్తుంది. కౌలుదారులకు ఈ పథకాన్ని వర్తింపచేయకపోవడం పట్ల వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీసీఆర్‌సీ కార్డు ఉన్నప్పటికీ అర్హులు కారని కేవలం సొంతభూమినే ప్రామాణికంగా తీసుకోవడంతో క్షేత్రస్థాయిలో సేద్యం చేసే కొంతమంది అన్నదాతలకు ఫలాలు అందకుండా భూయజమానులకు మాత్రమే మేలు జరుగుతుందనే ఆరోపణలున్నాయి


అనర్హులను ఏరివేయడానికే.....

ప్రస్తుతం పీఎం కిసాన్‌ లబ్ధి పొందుతున్న వారిలో నిబంధనలకు విరుద్ధంగా ఉన్నవారు చాలామంది ఉన్నారని కేంద్రం భావించి ఈ కేవైసీని తప్పనిసరి చేసినట్లు తెలుస్తోంది. ఆదాయపు పన్ను చెల్లిస్తున్నవారు , ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నవారు, చనిపోయినవారు ఇలా ఎంతోమంది అనర్హులను ఏరివేయడంతో పాటు అర్హులకు లబ్ధి చేకూర్చడానికే గడువు విధించి రైతాంగాన్ని ఈ కేవైసీ చేయించుకోవాలని కోరామని కేంద్రం చెబుతోంది


అవగాహన లేకపోవడమే....

ఈ కేవైసీపై పూర్తి స్థాయిలో రైతులకు అవగాహన లేకపోవడం ఒక కారణంకాగా, వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతుండడంతో ఈ దిశగా చాలామంది దృష్టి కేంద్రీకరించడం లేదని తెలుస్తోంది. ఇన్ని రోజులు నిమ్మకు నీరెత్తినట్లు ఉన్న యంత్రాంగం ఇప్పుడు గ్రామాల్లో సభలు పెట్టి చైతన్యపరుస్తాన్నమంటూ హడావుడి చేస్తోంది. గతంలో రెండుసార్లు చివరి గడువు విధించిన కేంద్రం అనుకున్న స్థాయిలో నమోదు కాకపోవడంతో గడువు తేదీని పొడిగిస్తూ వస్తోంది. ప్రస్తుతం జూలై 31తో ఈ కేవైసీకి గడువు ముగియనుండడం, నమోదు చూస్తే 50శాతం కూడా దాటకపోవడంతో వేల సంఖ్యలో రైతులు పీఎం కిసాన్‌ పథకానికి దూరమయ్యే ప్రమాదం పొంచి ఉంది


మీ సేవా కేంద్రాలు...కామన్‌ సర్వీస్‌ సెంటర్లు...

ఈకేవైసీ చేయించుకోని రైతులు దగ్గరలోని మీ సేవా కేంద్రాన్ని గాని లేక కామన్‌సర్వీస్‌ సెంటర్లోగాని  సంప్రదించి నమోదు పూర్తి చేసుకోవాలి. అన్నదాతలకు ఏమైనా సందేహాలుంటే ఆర్‌బీకేలోని వ్యవసాయ సహాయకుడిని సంప్రదించి నివృత్తి చేసుకోవాలని జిల్లా వ్యవసాయశాఖ చెబుతోంది. ఆధార్‌కు మొబైల్‌ నంబరు లింక్‌ అయి ఉండి సాంకేతికంగా అవగాహన ఉన్నరైతులు నేరుగా పీఎంకిసాన్‌ సైట్‌ ద్వారా కూడా ఈ కేవైసీ పూర్తి చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు


Updated Date - 2022-07-22T05:41:14+05:30 IST