ముడసర్లోవ డంపింగ్‌ యార్డులో ఇసుక లోడింగ్‌పై రభస

ABN , First Publish Date - 2021-06-14T05:47:27+05:30 IST

ముడసర్లోవ ఇసుక డంపింగ్‌ యార్డులో లారీలలో ఇసుక లోడింగ్‌ చేసే ధర విషయంలో పాత లోడింగ్‌ యజమానికి, కొత్తగా కాంట్రాక్టు తీసుకున్న వ్యక్తికి అభిప్రాయ భేదాలు తలెత్తడంతో నాలుగు రోజులుగా ఇసుక రవాణాకు అంతరాయం వాటిల్లింది.

ముడసర్లోవ డంపింగ్‌ యార్డులో ఇసుక లోడింగ్‌పై రభస
ముడసర్లోవలోని ఇసుక డంపింగ్‌ యార్డ్‌

పాత లోడింగ్‌ యజమానిపై కొత్త కాంట్రాక్టరు పోలీసులకు ఫిర్యాదు

ఆరిలోవ, జూన్‌ 13: ముడసర్లోవ ఇసుక డంపింగ్‌ యార్డులో లారీలలో ఇసుక లోడింగ్‌ చేసే ధర విషయంలో పాత లోడింగ్‌ యజమానికి, కొత్తగా కాంట్రాక్టు తీసుకున్న వ్యక్తికి అభిప్రాయ భేదాలు తలెత్తడంతో నాలుగు రోజులుగా ఇసుక రవాణాకు అంతరాయం వాటిల్లింది.  వివరాలిలా ఉన్నాయి. ముడసర్లోవ డంపింగ్‌ యార్డులో లారీలలో ఇసుక లోడ్‌ చేసేందుకు పాత లోడింగ్‌ యజమాని రాజుకు టన్ను ఇసుకకు రూ.25 చెల్లించేవారు. ప్రభుత్వం తాజాగా ఇసుక పాలసీని ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడంతో జయప్రకాశ్‌ అనే సంస్థకు బాధ్యతలను అప్పగించారు. ఇందులో భాగంగా లోడింగ్‌  చేసే యంత్రానికి తక్కువ మొత్తంలో చార్జీలు చెల్లిస్తున్నారు. దీంతో ఇసుక లోడింగ్‌కు గంటకు రూ.1,500 చెల్లిస్తానని కొత్త కాంట్రాక్టర్‌ రాజుకు తెలపగా, ప్రస్తుతం డీజల్‌ ధరలు పెరిగినందున తనకు గిట్టుబాటు కాదన్నాడు. దీంతో కాంట్రాక్టర్‌ మరో లోడింగ్‌ యూనిట్‌ని సమకూర్చుకుని పనులు ప్రారంభించాడు. అయితే రాజు తనకు రావాల్సిన మొత్తం బకాయిలు చెల్లించాకే కొత్త యూనిట్‌తో పనులు చేసుకోవాలని, అప్పటివరకు పనులు నిలిపివేయాలన్నాడు. దీంతో జయప్రకాశ్‌ సంస్థ తరపున దినేశ్‌ అనే వ్యక్తి ఆరిలోవ పోలీసులకు రాజు పనులకు అంతరాయం కలిగిస్తున్నాడని ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని ఆదివారం రాజుతో చర్చించి కొత్త లోడింగ్‌ యంత్రాల ద్వారా పనులు జరిగేలా చర్యలు చేపట్టారు.  


Updated Date - 2021-06-14T05:47:27+05:30 IST