Abn logo
Dec 2 2020 @ 23:48PM

ఆ ప్లాట్లు కొనొద్దు!

ఎస్‌.కోట బర్మాకాలనీ వెనక భాగంలో అక్రమ లేఅవుట్‌లో పంచాయతీ అధికారులు ఏర్పాటు చేసిన నోటీస్‌ బోర్డు

అక్రమ లే అవుట్లలో నోటీసు బోర్డులు

ఎస్‌.కోటలో చర్యలు చేపట్టిన పంచాయతీ అధికారులు

ప్రభుత్వ భూములను గుర్తించే పనిలో రెవెన్యూ శాఖ 

(శృంగవరపుకోట)

అక్రమ లేఅవుట్లలో ప్లాట్లు కొనొద్దు... అనుమతులు లేకుంటే క్రయవిక్రయాలు చేయొద్దు అంటూ అధికారులు నోటీస్‌ బోర్డులు పెడుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. శృంగవరపుకోట మండల రెవెన్యూ, పంచాయతీ అధికారులు ఎట్టకేలకు మేల్కొన్నారు. పంచాయతీ అధికారులు సూచిక బోర్డులు ఏర్పాటు చేస్తుండగా రెవెన్యూ అధికారులు వాటిల్లో కలిపేసుకున్న ప్రభుత్వ భూములను గుర్తించేపనిలో పడ్డారు. ఎప్పుడూ లేని విధంగా ఈ రెండు శాఖలు ఒకేసారి చర్యలకు ఉపక్రమించడం స్థానికులను ఆశ్చర్యపరుస్తోంది. మండలంలోని ప్రైవేట్‌ లేఅవుట్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. ఎక్కడా నిబంధనలను పాటించడం లేదు. అనుమతులు లేకుండానే యజమానులు క్రయ విక్రయాలు చేసేస్తున్నారు. దీంతో పంచాయతీకి రావాల్సిన ఆదాయం, రెవెన్యూకు రావాల్సిన భూ మార్పిడి ఫీజు వసూలు కావడం లేదు. ఎంతో కాలంగా ఇలానే జరుగుతున్నా పంచాయతీలు, రెవెన్యూ శాఖ సరిగ్గా పట్టించుకోకపోవడంతో లేఅవుట్ల యజమానుల వ్యాపారం మూడు పువ్వులు... ఆరు కాయలుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో బుధవారం వివిధ పంచాయతీల్లో ఉన్న లేఅవుట్లలో కార్యదర్శులు నోటీస్‌ బోర్డులు పెట్టారు. రెవెన్యూ అధికారులు కూడా పంచాయతీ అధికారులు నోటీస్‌ బోర్డులు ఏర్పాటు చేస్తున్న సమయంలోనే భూ మార్పిడి జరగని లేఅవుట్లను, అక్రమంగా కలిపేసుకున్న ప్రభుత్వ భూములను గుర్తిస్తున్నారు. ఈ క్రమంలో  మూడు రోజుల్లో ఇందుకు సంబంధించిన నివేదికను అందించాలని సర్వేయర్‌, ఆర్‌ఐ, వీఆర్వోలను తహసీల్దార్‌ ఎల్‌.రామారావు ఆదేశించారు.  ఇదిలావుంటే ఎన్నడూ లేని విధంగా స్పందించిన యంత్రాంగం ఎంతవరకు చిత్తశుద్ధితో ముందుకు వెళ్తారో వేచి చూడాల్సిందే. 

Advertisement
Advertisement
Advertisement