వైసీపీలో భగ్గుమన్న విభేదాలు

ABN , First Publish Date - 2022-01-28T05:33:11+05:30 IST

కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉషాశ్రీచరణ్‌, శెట్టూరు జడ్పీటీసీ సభ్యుడు అయ్యగార్లపల్లి మంజునాథ్‌ మధ్య నెలకొన్న విభేదాలు బట్టబయలయ్యాయి.

వైసీపీలో భగ్గుమన్న విభేదాలు

కళ్యాణదుర్గం ఎమ్మెల్యే, శెట్టూరు జడ్పీటీసీ మధ్య వివాదం తీవ్రస్థాయికి..

ప్లాట్ల తొలగింపులో హైడ్రామా

జడ్పీటీసీపై పోలీసులకు ఫిర్యాదు

శెట్టూరు, జనవరి 27: కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉషాశ్రీచరణ్‌, శెట్టూరు జడ్పీటీసీ సభ్యుడు అయ్యగార్లపల్లి మంజునాథ్‌ మధ్య నెలకొన్న విభేదాలు బట్టబయలయ్యాయి. ఎమ్మెల్యే వ్యవహరిస్తున్న తీరుపై ఇటీవల పార్టీ పెద్దలకు జడ్పీటీఈ ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఈక్రమంలోనే జడ్పీటీసీ సభ్యుడిపై ఎమ్మెల్యే కక్ష పెంచుకున్నట్లు కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. రెండేళ్ల క్రితం మంజునాథ్‌ మాకోడికి గ్రామానికి చెందిన వడ్డే సాలమ్మకు చెందిన సర్వేనెంబరు 555/2, 5.05 ఎకరాలు (డీ-పట్టా) భూమిని కొనుగోలు చేసి, అందులో లేఔట్‌వేసి ప్లాట్లను గ్రామస్థులకు 5సెంట్లు రూ.లక్ష ప్రకారం విక్రయించినట్లు తెలిసింది. దీనిని పసిగట్టిన ఎమ్మెల్యే డీ-పట్టా ఎలా కొనుగోలు చేస్తారనీ, ప్లాట్లు ఏర్పాటుచేసి విక్రయించడం చట్టరీత్యా నేరమని అధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈక్రమంలో ఆమె అనుచరులు గురువారం ఎక్స్‌కవేటర్‌తో ప్లాట్లను తొలగించారు. మంజునాథ్‌ తమకు డీ-పట్టా భూమిలో ప్లాట్లు విక్రయించి, మోసం చేశాడని కొనుగోలుదారులు సుబ్బరాయుడు, రమే్‌షనాయక్‌, మురళి తదితరులు శెట్టూరు ఎస్‌ఐ యువరాజ్‌కు ఫిర్యాదు చేశారు. మరికొంతమంది కొనుగోలుదారులు వివాదాస్పదంగా ఉన్న స్థలం ఎందుకు విక్రయించారని మంజునాథ్‌ను నిలదీసినట్లు తెలిసింది. తాను ప్లాట్లు విక్రయించలేదనినీ, తనపేరుపై ఎలాంటి క్రయవిక్రయాలు లేవని మంజునాథ్‌.. కొనుగోలుదారులకు తెలియజేశారు. ఎమ్మెల్యే అనుచరులు లేఔట్‌లో ఏర్పాటు చేసిన హద్దులను తొలగించి, భూమిని చదును చేశారు. ఇదంతా ఓ హైడ్రామా అని వైసీపీ కార్యకర్తలు గుసగుసలాడుతున్నారు.


మంజునాథ్‌కు పొలం అమ్మేశా

మాకోడికి తండా నుంచి లక్ష్మంపల్లి వెళ్లే రహదారిలో ఉన్న 5 ఎకరాల పొలాన్ని గతంలోనే అయ్యగార్లపల్లి మంజునాథ్‌కు అమ్మేశా. రూ.25లక్షలకు విక్రయించా.

- సాలమ్మ, మాకోడికి


లేఔట్లతో సంబంధం లేదు

లేఔట్లతో నాకు సంబంధంలేదు. ఆ స్థలం  యజమాని సాలమ్మ పేరుపైనే అగ్రిమెంట్‌ చేసుకున్నారు.

- మంజునాథ్‌, శెట్టూరు జడ్పీటీసీ సభ్యుడు


Updated Date - 2022-01-28T05:33:11+05:30 IST