ఆత్మగుణాలతో ఆనందప్రాప్తి

ABN , First Publish Date - 2020-08-27T09:06:29+05:30 IST

గౌతమ మహర్షి ప్రతిపాదించిన ఎనిమిది ఆత్మగుణాలు ఇవి. ప్రతి మనిషికీ ఈ ఆత్మగుణాలు ఉన్నప్పుడే వారి జీవితం సార్థక్యమవుతుంది. ఆనందప్రాప్తి కలుగుతుంది. ఆర్య సంస్కృతికి నూతన ఊపిరిపోసి, అద్వైత సిద్ధాంతమును

ఆత్మగుణాలతో ఆనందప్రాప్తి

దయా, సర్వభూతేషు క్షాంతి రనసూయా

శౌచ మనాయాసో మంగళ మకార్పణ్య మస్పృహా చేతి


గౌతమ మహర్షి ప్రతిపాదించిన ఎనిమిది ఆత్మగుణాలు ఇవి. ప్రతి మనిషికీ ఈ ఆత్మగుణాలు ఉన్నప్పుడే వారి జీవితం సార్థక్యమవుతుంది. ఆనందప్రాప్తి కలుగుతుంది. ఆర్య సంస్కృతికి నూతన ఊపిరిపోసి, అద్వైత సిద్ధాంతమును సమగ్రరీతిలో ప్రతిపాదించి, మాయావాదాన్ని వ్యాప్తి చేసిన మహా పురుషులు ఆదిశంకరాచార్యులవారిలో ఈ గుణాలు ప్రస్ఫుటం. దయాసర్వభూతేషు.. అంటే అన్ని జీవుల పట్లా దయతో వర్తించడం. వారి క్షేమాన్ని, హితాన్ని కోరుకోవడం. శంకరులు బాల్యంలో భిక్షాటనకు వెళ్లినప్పుడు.. ఒక నిరుపేద బ్రాహ్మణ స్త్రీ ఆయనకు భిక్ష పెట్టడానికి తన వద్ద ఒక్క ఉసిరికాయ తప్ప మరేమీ లేవని చింతిస్తూ దాన్నే భిక్షగా వేసింది. వెంటనే ఆయన లక్ష్మీదేవి స్తోత్రం (కనకధారా స్తవం) చేశారు. ఆ వరాల తల్లి ఆ పేద స్త్రీ ఇంట బంగారు ఉసిరికాయల వర్షాన్ని కురిపించింది. క్షాంతి అంటే.. అవతలివారు ఎంత బాధపెట్టినా, హింసించినా నొచ్చుకోకుండా వారిపట్ల ఆదరంగా ఉండడం. ఒకసారి ఒక కాపాలికుడు శంకరాచార్యుల వద్దకు వచ్చి ఆయన శిరస్సు కావాలని కోరాడు. అప్పుడాయన.. ‘నేను ధ్యానంలోకి వెళ్లినప్పుడు బాహ్యస్మృతి లేకుండా ఉంటాను.


అప్పుడు నా శిరస్సు తీసుకో’ అని చెప్పారు. కాపాలికుడు ఆ ప్రయత్నంలో ఉండగా.. శంకరుల శిష్యుడైన పద్మపాదుడు నృసింహస్వామిని స్మరించడంతో స్వామి అతడిని ఆవహించి కాపాలికుణ్ని సంహరించాడు. సత్పురుషులు తమ శరీరాన్ని పరహిత కాంక్షులై సమర్పిస్తే దేవుడే వారిని కాపాడతాడని చెప్పే ఘట్టమిది. అనసూయ.. అంటే అసూయ లేకుండడం. తన శిష్యుడైన హస్తామలకాచార్యుడు ఆత్మతత్వ ప్రతిపాదకాలైన పన్నెండు శ్లోకాలు చెప్తే పరమానందం చెంది, వాటికి అద్భుత వ్యాఖ్యానం రాసిన అనసూయ మూర్తి ఆదిశంకరులు. శౌచం అంటే.. శరీరాన్ని, మనసును, వాక్కును పరిశుద్ధంగా ఉంచుకోవడం. శారీరక శౌచం లేనివారికి మనశ్శుద్ధి అరుదు. ఆదిశంకరుల మనసు పరిశుద్ధమైనది, పవిత్రమైనది. వారి వాక్శుద్ధి, సత్యభాషణం గురించి అందరికీ తెలిసిందే. అనాయాసమంటే.. తన శక్తికి మించిన ధర్మాలను చేయకుండా ఉండడం. ఆత్మకు వ్యధ కలగకుండా వ్యవహరించడం. ఆసేతుహిమాచలం ఎంతో ఇష్టంగా పర్యటించి ధర్మస్థాపన చేసిన శక్తి శంకరులది. మంగళమంటే శుభం. 


వైష్ణవ, శాక్తేయ, గాణపత్య, సౌర, శైవమతాలను సమన్వయించి అద్వైతబోధతో లోకానికి మహోపకారం చేసిన మంగళకరుడు, శుభకరుడు శంకరులు. అకార్పణ్యమంటే ఎంత కష్టం, విపత్తు వచ్చినా దైన్యం చూపక ధైర్యంగా ఉండడం. కాపాలికుడి ఉదంతమే ఇందుకు నిదర్శనం. అస్పృహ అంటే దేనియందూ కోరిక, ఆసక్తి లేకపోవడం. సంతృప్తితో ఉండడం. కేరళ మహారాజు శంకరాచార్యులవారికి ధన, కనక, వస్తు, వాహనాలు పంపితే.. సున్నితంగా వాటిని తిప్పిపంపిన మహానుభావుడాయన. గౌతముడు ప్రతిపాదించిన ఎనిమిది ఆత్మగుణాలను ఆచరించిచూపిన శంకరులు జగతికి ఆదర్శం. వారి బాటలో నడిచి ధన్యులు కావడం మనందరి కర్తవ్యం.


 పి.వి. సీతారామమూర్తి, 9490386015

Updated Date - 2020-08-27T09:06:29+05:30 IST