ఆహ్లాదం కరువు..!

ABN , First Publish Date - 2022-01-28T04:13:06+05:30 IST

మార్కాపురం పట్టణంలో ప్రజలు కాస్త సేదతీర్చుకోవడానికి పార్కులే కరువుయ్యాయి.

ఆహ్లాదం కరువు..!
గాంధీ పార్క్‌ చుట్టూ విస్తరించిన బంకులు

పార్కుల్లో లేని సౌకర్యాలు

కొన్ని చోట్ల స్థలాలు మాయం

ఆక్రమణలో గాంధీ, ప్రారంభానికి నోచకోని మాగుంట పార్క్‌

మార్కాపురం(వన్‌టౌన్‌), జనవరి 27 : మార్కాపురం పట్టణంలో ప్రజలు కాస్త సేదతీర్చుకోవడానికి పార్కులే కరువుయ్యాయి. ఆదివారం సెలవు రోజు కుటుంబ సభ్యులతో గడపాలంటే ఒక్క పార్క్‌ కూడా సరైనది లేదు. మార్కాపురం పట్టణంలోని నడిబొడ్డున గాంధీ పార్క్‌ 1950లో స్థానికంగా నివాసం ఏర్పరుచుకున్న గుజరాతీ వ్యాపారులు సిపాని అండ్‌ కో వారు పట్టణ నడిబొడ్డులో  పార్క్‌ను ఏర్పాటు చేశారు. గాంధీ మహాత్ముడి ఏకశిల పాలరాతి  విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. కాలక్రమేణా  ఆ పార్క్‌ శిథి లావస్థకు చేరి మరుగుదొడ్లకు, మూత్రశాలలకు ఉపయోగపడింది.  1994లో అప్పటి మైస్‌ కార్యదర్శి డా. చెప్పల్లి కిశోర్‌రెడ్డి రూ.3 లక్షలతో  పార్క్‌ను ఆధునికీకరించారు. 2019లో ఆయన సతీమణి శ్రావణి స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు డా. చెప్పల్లి కనకదుర్గ  రూ.5 లక్షలతో పార్క్‌ను అభివృద్ధి చేశారు. కానీ ఈ పార్క్‌ చుట్టూ బంకులు, తోపుడుబండ్లను ఏర్పాటు చేయడంతో కనీసం గాలి కూడా రాని పరిస్థితి నెలకుంది. విపరీతమైన ట్రాఫిక్‌ కారణంగా  పార్క్‌ రానురాను ఆదరణకు నోచుకోలేదు. అంతేకాక సాయంత్రం 6 నుంచి 9 గంటల వరకు మాత్రమే దీనిని తెరిచి ఉంచుతారు. పట్టణంలోని చెన్నకేశవనగర్‌లో సుమారు 2.16 ఎకరాలతో మాగుంట సుబ్బరామిరెడ్డి పార్క్‌ను ఏర్పాటు చేశారు. స్టేట్‌  ఫైనాన్స్‌ కమిషన్‌ నిధులు రూ.కోటితో గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే 2019లో పార్కులో అభివృద్ధి పనులు పూర్తి చేశారు. మరో రూ.10 లక్షలతో అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేయాల్సి ఉంది. పార్క్‌లో వాకింగ్‌ ట్రాక్‌, వ్యాయామానికి సంబంధించిన పరికరాలు, పిల్లలు ఆడుకునేందుకు సామగ్రి, మొక్కలు, గ్రీనరీ, కూర్చోవడానికి బల్లలు ఏర్పాటు చేశారు. కానీ నేటికీ అది ప్రారంభానికి నోచుకోలేదు. దీంతో ఆట సామగ్రి చుట్టూ పిచ్చి మొక్కలు మొలిచాయి. గ్రీనరీ, చిన్నమొక్కలు ఎండిపోయాయి. పెద్ద మొక్కలు ఇష్టారీతిగా పెరిగి పాములకు ఆవాసాలుగా మారాయి. మున్సిపల్‌ అధికారులు కేవలం ఒక దివ్యాంగుడైనా వాచ్‌మన్‌ను కేటాయించి చేతులు దులుపుకున్నారు. కనీసం మొక్కలకు నీరు పోసి వాటిని కత్తిరించే దిక్కు లేదు. 19వ వార్డులోని పార్క్‌ను రూ.20 లక్షలతో టీడీపీ హయాంలో అభివృద్ధి చేశారు. అప్పట్లో సగం ప్రహరీ నిర్మాణం కాలేదు.  14వ ఆర్థిక సంఘం నిధులతో రెండు వైపులా కాంపౌండ్‌ నిర్మాణానికి టెండర్లు పిలవనున్నట్లు తెలిపారు. పట్టణంలోని జవహర్‌నగర్‌ కాలనీ, కోఆపరేటివ్‌ హౌసింగ్‌ సొసైటీ, ఏసీబీసీ కాలనీ,  కోఆపరేటివ్‌ బిల్డింగ్‌ హౌంసింగ్‌ సొసైటీ, డ్రైవర్స్‌ కాలనీ, ఫోర్త్‌ క్లాస్‌ ఎంప్లాయీస్‌ కాలనీ, ఏసీబీసీ కోఆపరేటివ్‌ ఎంప్లాయీస్‌ సొసైటీ, రైల్వే స్టేషన్‌ రోడ్డులోని పబ్లిక్‌ సర్వెంట్‌, కార్పొరేటివ్‌ హౌసింగ్‌ బిల్డింగ్‌ సొసైటీ, జవహర్‌నగర్‌, సంజీవ్‌రెడ్డి నగర్‌లలో ప్రజల ఉపయోగార్థం ఖాళీ స్థలాలను వదిలారు. 4వ తరగతి ఉద్యోగుల కాలనీలో పార్క్‌కు కేటాయించిన స్థలం ఆక్రమణకు గురైంది. పూలసుబ్బయ్య కాలనీలో పార్కు కోసం కేటాయించిన స్థలం వివిధ నిర్మాణాలతో నిండిపోయింది. కోఆపరేటివ్‌ ఎంప్లాయీస్‌ సొసైటీ, ఎస్బీఐ కోఆపరేటివ్‌ సొసైటీ కాలనీలలో పార్కు స్థలాలు వృథాగా పడి ఉన్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా ఆయా ప్రాంతాలలో  పార్లు అభివృద్ధికి చర్యలు చేపట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.






Updated Date - 2022-01-28T04:13:06+05:30 IST