అప్పు ఇవ్వండి ప్లీజ్‌

ABN , First Publish Date - 2022-07-06T06:36:16+05:30 IST

కణేకల్లులోని ప్రభుత్వ వ్యవసాయ విత్తనోత్పత్తి క్షేత్రానికి కష్టం వచ్చింది.

అప్పు ఇవ్వండి ప్లీజ్‌

- వ్యాపారులను వేడుకున్న అధికారులు

-విత్తనోత్పత్తి క్షేత్రానికి పెట్టుబడి కష్టాలు

-పేరుకుపోయిన రూ.1.18 కోట్ల బకాయిలు

-ధర్నాకు దిగిన వ్యాపారులు, వ్యవసాయ కూలీలు


కణేకల్లు/రాయదుర్గం, జూలై 5: కణేకల్లులోని ప్రభుత్వ వ్యవసాయ విత్తనోత్పత్తి క్షేత్రానికి కష్టం వచ్చింది. ఖరీఫ్‌లో పంట సాగు చేయడానికి ఈ ఒక్కసారికి అప్పు ఇచ్చి ఆదుకోవాలని వ్యాపారులను అధికారులు బతిమాలుకోవాల్సి వచ్చింది. కూలి డబ్బులను త్వరగా ఇచ్చేలే చూస్తాం.. పని చేయండి అని కూలీలను వేడుకోవాల్సి వచ్చింది. ప్రభుత్వం నుంచి మూడేళ్లుగా నిధులు రాకపోవడంతో ఈ క్షేత్రం అప్పులపాలైంది. మూడేళ్లుగా పెట్టుబడి కింద చేసిన అప్పులు రూ.1.18 కోట్లు పేరుకుపోయాయి. దీంతో ఎరువుల దుకాణదారులు, వ్యవసాయ కార్మికులు, ఇతర వ్యాపారులు అప్పు ఇవ్వడం లేదు. దీంతో 150 ఎకరాలలో విత్తనోత్పత్తి సందిగ్ధంలో పడింది. సమస్య పరిష్కారం కోసం రాష్ట్ర వ్యవసాయ కమిషనరేట్‌ జేడీఏ కృపాదాస్‌, జిల్లా జేడీఏ చంద్రానాయక్‌, కడప జేడీఏ నాగేశ్వరరావు మంగళవారం కణేకల్లు వ్యవసాయ విత్తనోత్పత్తి క్షేత్రానికి వచ్చారు. అప్పులు ఇచ్చి సహకరించాలని వ్యాపారులను, పనులు చేయాలని వ్యవసాయ కూలీలను కోరారు. దీనికి బాధితులు ఒప్పుకోకపోగా, బకాయిలను చెల్లించాలని డిమాండ్‌ ధర్నాకు దిగారు. దీంతో అధికారులు ఒక్కొక్కరితో విడిగా మాట్లాడి.. ఒప్పించే ప్రయత్నం చేశారు. 

కణేకల్లు విత్తనోత్పత్తి క్షేత్రానికి ఏడీగా ప్రభుత్వం రవిని నియమించింది. గత ఏడీ నానా తంటాలు పడి అప్పులు చేసి విత్తనోత్పత్తి చేశారు. కానీ అప్పులను తీర్చేందుకు ప్రభుత్వం పైసా ఇవ్వలేదు. దీంతో కొత్త ఏడీని పాత బకాయిలు భయపెడుతున్నాయి. ఈ కారణంగా ఆయన బాధ్యతలు స్వీకరించలేదు. ఈ నేపథ్యంలో మంగళవారం క్షేత్రానికి వచ్చిన అధికారులు, ప్రభుత్వాన్ని ఒప్పించి పాత బకాయిలను నెలలోగా చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం సాగు చేసేందుకు నిధులు లేకపోవడంతో ఎరువులు, ట్రాక్టర్లు, యంత్ర పరికరాలను అప్పుగా ఇవ్వాలని వ్యాపారులను కోరారు. గుంటూరు నుంచి బ్రీడర్‌ వరి విత్తనాలను తెప్పిస్తున్నామని, సాగుకు అందరూ సహకరించి అప్పులు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో ఈ పరిస్థితి నెలకొందని వివరించారు. వ్యవసాయ క్షేత్రంలో 2,300 క్వింటాళ్ల నాన సీడ్‌ స్టాకు ఉందని, దాన్ని విక్రయించి బకాయిలు చెల్లిస్తామని అన్నారు. దీనికి వ్యాపారులు ఒప్పుకోలేదు. ప్రభుత్వం నుంచి డబ్బులు వస్తాయనే నమ్మకం లేదని, పాత బకాయి రూ.1.18 కోట్లు చెల్లిస్తే కొత్తగా ఖరీఫ్‌కు అప్పు కింద ఇస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏడీఏలు సనావుల్లా, రవి, ఏవో శ్రావణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 





Updated Date - 2022-07-06T06:36:16+05:30 IST