ఒక్క అవకాశమివ్వండి ప్లీజ్‌..!

ABN , First Publish Date - 2022-05-15T08:21:04+05:30 IST

‘‘ఇప్పటివరకు అనేక పార్టీలకు అధికారం ఇచ్చారు. తెలంగాణలో ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి’’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రజలను కోరారు.

ఒక్క అవకాశమివ్వండి ప్లీజ్‌..!

  • పేదలకు ఎన్ని ఇళ్లైనా నిర్మిస్తాం
  • నిరుద్యోగులకు ఏటా జాబ్‌ క్యాలెండర్‌
  • పెట్రోలు, డీజిల్‌పై వ్యాట్‌ తగ్గిస్తాం
  • రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుతున్నారు
  • నిజాం సమాధి వద్ద మోకరిల్లే వారికి స్థానం 
  • లేదిక్కడ.. బండి సంజయ్‌ వ్యాఖ్యలు
  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ 


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి): ‘‘ఇప్పటివరకు అనేక పార్టీలకు అధికారం ఇచ్చారు. తెలంగాణలో ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి’’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రజలను కోరారు. తుక్కుగూడ బహిరంగ సభలో సంజయ్‌ ఉద్వేగంగా మాట్లాడారు. కాంగ్రెస్‌, టీడీపీ, టీఆర్‌ఎ్‌సకు అధికారం ఇచ్చినా.. పేదల బతుకుల్లో మార్పు రాలేదని చెప్పారు. ‘ప్లీజ్‌.. ఒక్కసారి మాకు అధికారం ఇవ్వండి. పేదల కష్టాలు తీరుస్తాం’’ అని అభ్యర్ధించారు.  అవకాశం ఇస్తే శక్తిమంతమైన ప్రజాస్వామ్యాన్ని నిర్మిస్తామన్నారు. ప్రజల కోసం కష్టపడి, ఇష్టపడి పనిచేస్తామని చెప్పారు. నిజాం సమాధి వద్ద మోకరిల్లే వారికి ఈ గడ్డపై స్థానం లేదని పేర్కొన్నారు. తన పాదయాత్రలో ప్రజలు అనేక సమస్యలపై వినతి పత్రాలు అందజేశారని.. ఇందులో 60 శాతం ఇళ్లకోసమేనని చెప్పారు.ముదనష్టపు ధరణితో ప్రజల భూములకు ఎసరు పెట్టారని ఆరోపించారు. తెలంగాణలో అధికార మార్పు జరగాలని ప్రజలంతా కోరుకుంటున్నారన్నారు. కేసీఆర్‌ కుటుంబం రాష్ట్రాన్ని లూటీ చేస్తోందని, పంచభూతాలను మింగేస్తోందని.. కీలక శాఖలన్నీ తమవద్దే ఉంచుకుని పాలిస్తోందని విమర్శించారు.వారి పాలనను అంతం చేసేందుకే అమిత్‌ షా ఇక్కడకు వచ్చారన్నారు. కేసీఆర్‌ తనకు ఇష్టమైన ఎక్సైజ్‌ శాఖను మాత్రం ఎందుకో మర్చిపోయినట్లున్నారని ఎద్దేవా చేశారు.


శ్రీలంక పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని చెప్పారు. ఇప్పటికే ఉద్యోగులకు జీతాలు సరిగా అందడం లేదని, పింఛన్లు రావడం లేదని.. మూర్ఖపు పాలనకు తెరదించాలని పిలుపునిచ్చారు. కేసీఆర్‌  చేతగాని దద్దమ్మ, తుగ్లక్‌ అని విమర్శించారు. ఒకసారి వరి వేయమంటాడు.. మరోసారి వద్దంటాడు.. ఆయన మాత్రం ఫామ్‌హౌ్‌సలో వరి వేసుకుంటాడు.. అని సంజయ్‌ పేర్కొన్నారు. బీజేపీకి అధికారం ఇస్తే ప్రజలకు ఎలా మేలు చేయాలో చేసి చూపిస్తామన్నారు. పేదలందరికీ ఎన్ని లక్షల ఇళ్లైనా నిర్మిస్తామని చెప్పారు. ఫసల్‌ బీమా యోజనతో రైతులను ఆదుకుంటామని, ఏటా జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తామని తెలిపారు. పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్‌ను తగ్గిస్తామని హామీ ఇచ్చారు. వైద్యం, విద్య ఉచితంగా అందిస్తామని చెప్పారు. పాలమూరు ప్రజలు ఇంకా ఎడారి పరిస్థితుల్లోనే ఉన్నారని, ఆర్డీఎ్‌సను పూర్తిచేసే బాధ్యత బీజేపీ తీసుకుంటుందని స్పష్టం చేశారు. తెలంగాణ నుంచి టీఆర్‌ఎ్‌సను తరిమికొట్టాలని సంజయ్‌ బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, మజ్లిస్‌ నాటకాలాడుతున్నాయని విమర్శించారు. టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ఒకటేనని కాంగ్రె్‌సకు ఓటేస్తే టీఆర్‌ఎ్‌సకు వేసినట్లేనని అన్నారు. ‘గుంట నక్కలు గుంపులుగా వస్తాయి.. సింహం సింగిల్‌గా వస్తుంది. అదే బీజేపీ’ అని చెప్పారు .


కేటీఆర్‌ మోకాళ్ల యాత్ర చెయ్‌.. 

అమిత్‌ షా రాకతో తెలంగాణ భవన్‌లో పీఠాలు కదులుతున్నాయని బీజేపీ ఓబీసీ సెల్‌ జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ లక్ష్మణ్‌ అన్నారు. కేటీఆర్‌ మోకాళ్ల యాత్ర చేస్తే.. అమిత్‌ షాకు వేసిన 27 ప్రశ్నలకు జవాబిస్తామన్నారు. ముందస్తు ఎన్నికలు వస్తే టీఆర్‌ఎ్‌సకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.


రైతుల కళ్లలో మట్టి కొట్టిన కేసీఆర్‌ 

రైతుల కళ్లలో మట్టి కొట్టిన దుర్మార్గుడు కేసీఆర్‌ అని ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. వడ్లు కొనే దమ్ము లేక చేతులేత్తేశాడన్నారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేశాడని.. ఇది గుడ్డి తెలంగాణ కాదు.. గుద్దుడు తెలంగాణ అని గుర్తుంచుకోవాలన్నారు.


Updated Date - 2022-05-15T08:21:04+05:30 IST