భర్త, పిల్లలను వదిలి ఉపాధి కోసం విదేశానికి వెళ్తే ఊహించని పరిణామం.. భార్యకు ఉరి శిక్ష.. అసలేం జరిగిందంటే..

ABN , First Publish Date - 2022-04-12T18:47:26+05:30 IST

భర్త, పిల్లలను వదిలి ఉపాధి కోసం విదేశానికి వెళ్లిన భారతీయ మహిళకు ఊహించని పరిణామం ఎదురైంది. యెమెన్‌లో నర్సుగా విధులు నిర్వహించే ఆమె.. అక్కడి ఓ అరబ్ వ్యక్తికి సేవలు చేసింది. ఈ క్రమంలో ఆ వ్యక్తి హఠాన్మరణం చెందారు. అయితే, ఆ వ్యక్తికి మత్తుపదార్థాలను హైడోస్‌గా ఇవ్వడంతోనే చనిపోయినట్లు తేలింది.

భర్త, పిల్లలను వదిలి ఉపాధి కోసం విదేశానికి వెళ్తే ఊహించని పరిణామం.. భార్యకు ఉరి శిక్ష.. అసలేం జరిగిందంటే..

ఎన్నారై డెస్క్: భర్త, పిల్లలను వదిలి ఉపాధి కోసం విదేశానికి వెళ్లిన భారతీయ మహిళకు ఊహించని పరిణామం ఎదురైంది. యెమెన్‌లో నర్సుగా విధులు నిర్వహించే ఆమె.. అక్కడి ఓ అరబ్ వ్యక్తికి సేవలు చేసింది. ఈ క్రమంలో ఆ వ్యక్తి హఠాన్మరణం చెందారు. అయితే, ఆ వ్యక్తికి మత్తుపదార్థాలను హైడోస్‌గా ఇవ్వడంతోనే చనిపోయినట్లు తేలింది. దాంతో ఆ సమయంలో అతని వద్ద నర్సుగా విధులు నిర్వహించిన ఆమె చిక్కుల్లో పడింది. మృతుడి కుటుంబ సభ్యులు భారతీయురాలిపై కోర్టులో కేసు వేయడంతో విచారణ అనంతరం న్యాయస్థానం ఆమెను దోషిగా తేల్చింది. అలాగే కొంతకాలం తర్వాత ఉరిశిక్షను కూడా ఖరారు చేసింది. భారత మహిళ ఉరి నుంచి తప్పించుకోవాలంటే మృతుడి కుటుంబ సభ్యులు ఆమెకు క్షమాభిక్ష పెట్టాలి. అందుకుగాను ఆమె వారికి బ్లడ్ మనీ(మృతుడి కుటుంబానికి దోషిగా తేలిన వ్యక్తి ఇచ్చే కొంత మొత్తం)గా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ హైకోర్టులో భారతీయ మహిళను ఉరిశిక్ష నుంచి కాపాడేందుకు దౌత్యపరమైన సహాయం కావాలంటూ ఓ న్యాయవాది ఆమె కుటుంబ సభ్యుల అభ్యర్థన మేరకు ఓ అప్పీల్ వేశారు. 


పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కేరళకు చెందిన నిమిషా ప్రియా అనే మహిళ కొన్నేళ్ల క్రితం ఉపాధి కోసం అరబ్ దేశమైన యెమెన్ వెళ్లింది. అక్కడ ఓ అరబ్ వ్యక్తి వద్ద నర్సుగా పనికి కుదిరింది. కొంతకాలం అంత బాగానే జరిగింది. కానీ, 2017 జూలైలో ప్రియా పనిచేసే వ్యక్తి హఠాన్మరణం చెందాడు. రోజువారీగా తీసుకునే ఇంజెక్షన్లు, మాత్రలు ఓవర్‌డోస్‌ తీసుకోవడం వల్లే అతడు మరణించాడని వైద్య పరీక్షల్లో తేలింది. దీంతో ఆమె కావాలనే చంపేసిందంటూ మృతుడి కుటుంబ సభ్యులు కేసు పెట్టారు. ‘మా నాన్న వద్ద ఆమె పాస్‌పోర్ట్ ఉంది. దాన్ని తీసుకోవడానికే ఇలా చేసింది. అంతే కాకుండా మా నాన్నతో ఆమె పెళ్లి అయినట్టు ఫోర్జరీ డాక్యుమెంట్లను కూడా సృష్టించింది.’ అంటూ మృతుడి కుమారులు ప్రియాపై అభియోగాలు మోపారు. తనకు ఏ పాపం తెలియదనీ.. ఆయన మరణానికి, తనకు సంబంధం లేదని ప్రియా వాపోయినప్పటికీ ఆమెకు వ్యతిరేకంగా చాలా ఆధారాలు దొరికాయి. చివరకు ఆ ఆరోపణలు అన్నీ నిజాలేనని యెమన్ కోర్టులో నిరూపణ అయింది. దీంతో విచారణ అనంతరం 2020లో అక్కడి న్యాయస్థానం ప్రియాను దోషిగా తేల్చి మరణశిక్ష విధించింది. అప్పటి నుంచి యెమెన్ జైల్లోనే మగ్గుతుంది.


ఈ క్రమంలో మృతుడి కుటుంబం ప్రియాకు క్షమాభిక్ష పెట్టేందుకు ఒప్పుకుంది. దానికి ఆమె కొంత మొత్తం వారికి పరిహారంగా ఇవ్వాల్సి ఉంటుంది. కానీ, ప్రియా ఆర్థిక పరిస్థితి చూస్తే.. ఆ పరిహారం చెల్లించడం చాలా కష్టం. భర్త ఆటో డ్రైవర్ కాగా, ఆమె తల్లి ఇళ్లలో పనిచేస్తుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రియాకు బ్లడ్ మనీ చెల్లించడం దాదాపు అసాధ్యం. అందుకే ఆమెను కాపాడేందుకు భారత విదేశాంగ జోక్యం చేసుకుని దౌత్యపరమైన సహాయంతో పాటు ఆర్థిక సాయం చేయాలని గత నెల 15న ఢిల్లీ హైకోర్టులో ఓ పీటిషన్ నమోదైంది. ప్రియాను ఉరిశిక్ష నుంచి తప్పించేందుకు ప్రభుత్వం తరఫున పీటిషనర్‌ను యెమెన్‌కు పంపించేలా దౌత్యపరమైన సహాయం చేయాల్సిందిగా న్యాయవాది అనురాగ్ అహ్లువాలియా తెలిపారు.    

Updated Date - 2022-04-12T18:47:26+05:30 IST