రైజర్స్‌ గట్టెక్కింది..

ABN , First Publish Date - 2020-10-23T09:55:54+05:30 IST

కీలక మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆల్‌రౌండ్‌ షోతో జూలు విదిల్చింది. మనీశ్‌ పాండే (47 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్సర్లతో 83 నాటౌట్‌) విలువైన

రైజర్స్‌ గట్టెక్కింది..

 చావో.. రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ అసలైన సత్తాను ప్రదర్శించింది. నాలుగేళ్ల తర్వాత తొలి ఐపీఎల్‌ మ్యాచ్‌ ఆడిన పేసర్‌ హోల్డర్‌ మూడు  వికెట్లతోపాటు, ఓ రనౌట్‌తో అదుర్స్‌ అనిపించుకున్నాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌లో మనీశ్‌ పాండే సరైన సమయంలో ఫామ్‌ను అందుకుని మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు.  అతడికి విజయ్‌ శంకర్‌  అండగా నిలవగా రైజర్స్‌ ప్లేఆఫ్స్‌ రేసులో కొచ్చింది. అటు ఈ ఓటమితో రాజస్థాన్‌ ఇక చివరి మూడు మ్యాచ్‌లను కచ్చితంగా గెలవాల్సిందే.. 


రాజస్థాన్‌పై గెలిచి ప్లేఆఫ్స్‌ రేసులోకి..

ఆదుకున్న మనీశ్‌ పాండే 


దుబాయ్‌: కీలక మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆల్‌రౌండ్‌ షోతో జూలు విదిల్చింది. మనీశ్‌ పాండే (47 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్సర్లతో 83 నాటౌట్‌) విలువైన ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడు. ఇక విజయ్‌ శంకర్‌ (51 బంతుల్లో 6 ఫోర్లతో 52 నాటౌట్‌, (15/1) బౌలింగ్‌, బ్యాటింగ్‌లోనూ మెరిశాడు. దీంతో రాజస్థాన్‌ రాయల్స్‌పై 8 వికెట్ల తేడాతో హైదరాబాద్‌ ఘనవిజయం సాధించింది. ఫలితంగా 8 పాయింట్లతో రైజర్స్‌ ఐదో స్థానానికి చేరగా, రాజస్థాన్‌ అన్నే పాయింట్లతో ఏడో స్థానానికి పడిపోయింది. గురువారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 154 పరుగులు చేసింది. శాంసన్‌ (36), స్టోక్స్‌ (30) మాత్రమే రాణించారు. హోల్డర్‌ మూడు, రషీద్‌ ఓ వికెట్‌ తీశాడు. ఆ తర్వాత ఛేదనలో హైదరాబాద్‌ 18.1 ఓవర్లలో 2 వికెట్లకు 156 పరుగులు చేసి గెలిచింది. ఆర్చర్‌కు రెండు వికెట్లు దక్కాయి. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా మనీశ్‌ పాండే నిలిచాడు.  


మనీశ్‌, విజయ్‌ శతక భాగస్వామ్యం

స్వల్ప లక్ష్యం కోసం బరిలోకి దిగిన హైదరాబాద్‌.. పేసర్‌ ఆర్చర్‌ విజృంభణకు తొలి ఓవర్‌లోనే వార్నర్‌ (4), మూడో ఓవర్‌లో బెయిర్‌స్టో (10) వికెట్లను కోల్పోయింది. ఇక, ఆ తర్వాత ఆర్‌ఆర్‌కు ఒక్క వికెట్‌ కూడా దొరకలేదు. మనీశ్‌ పాండే మరో అవకాశం ఇవ్వకుండా ఎదురుదాడికి దిగాడు. అతడికి చివరి దాకా విజయ్‌ శంకర్‌ చక్కగా సహకరించడంతో మూడో వికెట్‌కు అజేయంగా 140 పరుగుల భారీ భాగస్వామ్యం దక్కింది. ఇటీవలి కాలంలో అంతగా రాణించలేకపోతున్న పాండే ఈ కీలక మ్యాచ్‌లో మాత్రం వరుస బౌండరీలతో చెలరేగాడు. కార్తీక్‌ త్యాగి ఓవర్‌లో రెండు ఫోర్లు.. స్టోక్స్‌ ఓవర్‌లో రెండు సిక్సర్లతో బ్యాట్‌కు పనిచెప్పాడు. ఇక ఆరో ఓవర్‌లో త్యాగిని మరోసారి 4,6,6తో వణికించగా పవర్‌ప్లేలో జట్టు 58/2 స్కోరు సాధించింది. ఈ జోరుతో తను 28 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేశాడు. 11వ ఓవర్‌లో పాండే ఓ ఫోర్‌, విజయ్‌ రెండు ఫోర్లతో జట్టు 15 పరుగులు రాబట్టింది. దీంతో 13 ఓవర్లలో రైజర్స్‌ వంద పరుగులు దాటింది. 16వ ఓవర్‌లో విజయ్‌ శంకర్‌ కూడా విజృంభించి హ్యాట్రిక్‌ ఫోర్లు బాదడంతో లక్ష్యం 4 ఓవర్లలో 24 పరుగులకు చేరింది. ఆ తర్వాత మనీశ్‌ సిక్సర్లతో రెచ్చిపోగా.. విజయ్‌ ఓ ఫోర్‌తో ఫినిషింగ్‌ టచ్‌ ఇస్తూ అర్ధసెంచరీ కూడా సాధించాడు. దీంతో మరో 11 బంతులుండగానే మ్యాచ్‌ ముగిసింది.


బౌలర్ల హవా

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌ ఆత్మవిశ్వాసంతో ఇన్నింగ్స్‌ను ఆరంభించినా.. మధ్య ఓవర్ల నుంచే పట్టు తప్పింది. పేసర్‌ హోల్డర్‌ కీలక వికెట్లతో దెబ్బతీయగా.. రషీద్‌, విజయ్‌ శంకర్‌ పరుగులను కట్టడి చేశారు. ఆరంభంలో రెండు ఫోర్లు, ఓ సిక్స్‌ బాదిన ఓపెనర్‌ ఊతప్ప (19) మంచి టచ్‌లో ఉన్నట్టు కనిపించాడు. కానీ నాలుగో ఓవర్‌లో అతడి అత్యుత్సాహం కొంప ముంచింది. తొలి రెండు బంతులను స్టోక్స్‌ ఫోర్లుగా మలచగా.. మూడో బంతికి ఊతప్ప అనవసర పరుగు కోసం వెళ్లి హోల్డర్‌ చేతిలో రనౌటయ్యాడు. ఇక పేలవ ఫామ్‌తో ఇబ్బందిపడుతున్న శాంసన్‌ ఈ మ్యాచ్‌ ద్వారా లైన్‌లోకి వచ్చాడు. ఐదో ఓవర్‌లో రెండు ఫోర్లు బాది చకచకా పరుగులు సాధించాడు. అటు స్టోక్స్‌ మాత్రం తన సహజశైలిలో ఆడలేకపోయాడు. అయినా ఈ ఇద్దరూ నిలకడగా బ్యాటింగ్‌ చేస్తూ రన్‌రేట్‌ పడిపోకుండా చూశారు. స్టోక్స్‌ 17 రన్స్‌ వద్ద ఇచ్చిన క్యాచ్‌ను శంకర్‌ వదిలేశాడు. అయితే, ఈ జోడీ 12వ ఓవర్‌లో విడిపోయింది. ముందుగా శాంసన్‌ను హోల్డర్‌.. ఆ తర్వాత స్టోక్స్‌ను రషీద్‌ బౌల్డ్‌ చేశారు. దీంతో రెండో వికెట్‌కు 56 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత రాజస్థాన్‌ కూడా పరుగులు కోసం తడబడింది. చెన్నైపై చెలరేగిన బట్లర్‌ (9) త్వరగానే పెవిలియన్‌కు చేరాడు. అటు 18వ ఓవర్‌లో రియాన్‌ (20) వరుసగా 4,6,4తో మురిపించినా మరుసటి ఓవర్‌లో స్మిత్‌ (19), పరాగ్‌ను హోల్డర్‌ వరుస బంతుల్లో అవుట్‌ చేయడంతో ఆర్‌ఆర్‌ భారీ స్కోరుపై ఆశలు వదులుకుంది. చివరి ఓవర్‌లో ఆర్చర్‌ ఫోర్‌, సిక్స్‌ బాదడంతో కష్టం మీద 150 రన్స్‌ దాటగలిగింది.


దుబాయ్‌లో ఆడిన 6 మ్యాచ్‌ల్లో రాజస్థాన్‌కిది ఐదో ఓటమి 


సన్‌రైజర్స్‌ తరఫున ఐపీఎల్‌లో శతక భాగస్వామ్యాన్ని అందించిన తొలి భారత జోడీగా మనీశ్‌- విజయ్‌ శంకర్‌


స్కోరు బోర్డు

రాజస్థాన్‌ రాయల్స్‌: ఊతప్ప (రనౌట్‌/హోల్డర్‌) 19; స్టోక్స్‌ (బి) రషీద్‌ 30; శాంసన్‌ (బి) హోల్డర్‌ 36; బట్లర్‌ (సి) నదీమ్‌ (బి) విజయ్‌ శంకర్‌ 9; స్మిత్‌ (సి) మనీశ్‌ పాండే (బి) హోల్డర్‌ 19; పరాగ్‌ (సి) వార్నర్‌ (బి) హోల్డర్‌ 20; తెవాటియా (నాటౌట్‌) 2; ఆర్చర్‌ (నాటౌట్‌) 16; ఎక్స్‌ట్రాలు: 3; మొత్తం: 20 ఓవర్లలో 154/6. వికెట్ల పతనం: 1-30, 2-86, 3-86, 4-110, 5-134, 6-135. బౌలింగ్‌: సందీప్‌ శర్మ 4-0-31-0; హోల్డర్‌ 4-0-33-3; విజయ్‌ శంకర్‌ 3-0-15-1; నటరాజన్‌ 4-0-46-0; రషీద్‌ ఖాన్‌ 4-0-20-1; షాబాజ్‌ నదీమ్‌ 1-0-9-0.

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌: డేవిడ్‌ వార్నర్‌ (సి) స్టోక్స్‌ (బి) ఆర్చర్‌ 4; బెయిర్‌స్టో (బి) ఆర్చర్‌ 10; మనీశ్‌ పాండే (నాటౌట్‌) 83; విజయ్‌ శంకర్‌ (నాటౌట్‌) 52; ఎక్స్‌ట్రాలు: 7; మొత్తం: 18.1 ఓవర్లలో 156/2; వికెట్ల పతనం: 1-4, 2-16; బౌలింగ్‌: ఆర్చర్‌ 4-0-21-2; అంకిత్‌ రాజ్‌పుత్‌ 1-0-11-0; కార్తీక్‌ త్యాగి 3.1-0-42-0; బెన్‌ స్టోక్స్‌ 2-0-24-0; శ్రేయాస్‌ గోపాల్‌ 4-0-32-0; తెవాటియా 4-0-25-0. 

Updated Date - 2020-10-23T09:55:54+05:30 IST