ఐపీఎల్‌కు ‘ఆటగాళ్ల’ అడ్డంకులు!

ABN , First Publish Date - 2021-06-22T05:51:58+05:30 IST

అర్ధంతరంగా వాయిదా పడిన ఐపీఎల్‌ను యూఏఈలో పూర్తి చేయాలని బీసీసీఐ నిర్ణయించింది. మిగిలిన

ఐపీఎల్‌కు ‘ఆటగాళ్ల’ అడ్డంకులు!

న్యూఢిల్లీ: అర్ధంతరంగా వాయిదా పడిన ఐపీఎల్‌ను యూఏఈలో పూర్తి చేయాలని బీసీసీఐ నిర్ణయించింది. మిగిలిన 31 మ్యాచ్‌ల నిర్వహణలో భాగంగా.. సెప్టెంబరు 19 నుంచి అక్టోబరు 15 మధ్య ఐపీఎల్‌ ఫేజ్‌-2ను షెడ్యూల్‌ చేసింది. అయితే, ఈ విండోలో విదేశీ ఆటగాళ్లను రప్పించడానికి భారత బోర్డుకు అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయి. కాగా, కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ను నాలుగు రోజులు ముం దుకు జరిపేలా క్రికెట్‌ వెస్టిండీస్‌ (సీబ్ల్యూఐ)ను ఒప్పించడంలో బీసీసీఐ సఫలమైంది. వాస్తవంగా ఆగస్టు 28 నుంచి సెప్టెంబరు 19 వరకు కరీబియన్‌ లీగ్‌ను షెడ్యూల్‌ చేయగా.. బీసీసీఐ విజ్ఞప్తి మేరకు ఆగస్టు 26 నుంచి సెప్టెంబరు 15కు రీషెడ్యూల్‌ చేశారు. దీంతో విండీస్‌ ఆటగాళ్లు గేల్‌, రస్సెల్‌తోపాటు దక్షిణాఫ్రికా ఆటగాళ్లు క్రిస్‌ మోరిస్‌, డుప్లెసి, నోకియా లాంటి వారు లీగ్‌లో పాల్గొనడానికి మార్గం సుగమమైంది. 



ఇంగ్లండ్‌ బోర్డును ఒప్పిస్తుందా?

ఐపీఎల్‌ ఫేజ్‌-2కు తమ ఆటగాళ్లు అందుబాటులో ఉండబోరని ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) ముందుగానే ప్రకటించింది. ఐపీఎల్‌ సమయంలో పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ పర్యటనలకు ఇంగ్లండ్‌ వెళ్లనుంది. కానీ, ఇంగ్లిష్‌ ఆటగాళ్లలో కొంతమందినైనా రప్పించేందుకు బీసీసీఐ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. కానీ, ఈసీబీ తరహాలో క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) నుంచి కూడా ఇప్పటికీ ఎలాంటి ప్రకటనా రాలేదు. కాగా, ఐపీఎల్‌ సమయంలో వెస్టిండీస్‌, అఫ్ఘానిస్థాన్‌తో ముక్కోణపు సిరీ్‌సను నిర్వహించాలని సీఏ భావిస్తోంది.


అదే జరిగితే మ్యాక్స్‌వెల్‌, స్మిత్‌, రిచర్డ్‌సన్‌ దూరమైనట్టే! కమిన్స్‌ ఈ పాటికే ఐపీఎల్‌ నుంచి అవుటయ్యాడు. న్యూజిలాండ్‌ క్రికెట్‌ బోర్డు కూడా తమ ఆటగాళ్ల విషయమై మౌనం పాటిస్తోంది. సిరీ్‌సలు లేకపోవడంతో దక్షిణాఫ్రికా క్రికెట్‌ నుంచి ఇబ్బందులు లేకపోయినా.. అఫ్ఘానిస్థాన్‌, బంగ్లాదేశ్‌ లాంటి చిన్న బోర్డులను కూడా ఒప్పించాల్సిన పరిస్థితి. మరి ఈ అడ్డంకులను బీసీసీఐ ఎలా అధిగమిస్తుందో చూడాలి. 


Updated Date - 2021-06-22T05:51:58+05:30 IST