వంటింట్లో ఆడేవాడు

ABN , First Publish Date - 2022-02-16T05:30:00+05:30 IST

మారుమూల పల్లె ప్రాంతం. పూట గడవడమే కష్టమైన కుటుంబం. క్రికెట్‌

వంటింట్లో ఆడేవాడు

మారుమూల పల్లె ప్రాంతం. పూట గడవడమే కష్టమైన కుటుంబం. క్రికెట్‌ అంటేనే తెలియని ఇంట్లో పుట్టిన పిల్లాడు... నేడు కుర్రాళ్ల ప్రపంచ కప్‌ను తిరిగి మన దేశానికి తెచ్చాడు.  ఒక కల... అది నెరవేర్చుకోవడానికి పట్టుదల... ఆ పట్టుదలకు ప్రేరణగా నిలిచి... ఆటలో ఓనమాలు దిద్దించింది అతడి అమ్మ. యువ సంచలనం... ‘పరుగుల’ వర్షం... జాతీయ అండర్‌-19 క్రికెట్‌ జట్టు  వైస్‌కెప్టెన్‌ షేక్‌ రషీద్‌ తల్లి జ్యోతి... తనయుడి విజయాన్ని ‘నవ్య’తో పంచుకున్నారు.


గుం  టూరు జిల్లా ప్రత్తిపాడు మండలంలోని పాతమల్లాయపాలెం అనే చిన్న పల్లెటూరు మాది. మావారు బాలీషా చిన్నచిన్న పనులు చేసేవారు. మాకు ఇద్దరు మగపిల్లలు. చిన్నవాడు రషీద్‌. కుటుంబం గడవడం కష్టంగా ఉండటంతో హైదరాబాద్‌కు వెళ్లాం. అక్కడి కొత్తపేటలో చిన్న ఇల్లు అద్దెకు తీసుకొని ఉన్నాం. అప్పుడు రషీద్‌ ఇరుగుపొరుగు పిల్లలతో కలిసి గల్లీలో క్రికెట్‌ ఆడేవాడు. చదువు ఏమాత్రం అబ్బేది కాదు. ఎంత చెప్పినా చదువుపై శ్రద్ధపెట్టేవాడు కాదు. వాడికి అప్పుడు పదేళ్లు. నాకు ఇప్పటికీ వాడు సరిగ్గా చదువుకోలేదనే బాధ ఉంది. 


ఎండలో పడుకుని... 

ఒక రోజు వాడు క్రికెట్‌ నేర్చుకొంటానని వాళ్ల నాన్నకు చెబితే ఆయన ఒప్పుకోలేదు. వాడు మొండికేశాడు. దాంతో ఆయన ‘నేను తిరిగి వచ్చేవరకు ఎండలోనే నేలపై పడుకొని ఉంటే అప్పుడు క్రికెట్‌కు పంపిస్తా’ అని చెప్పి వెళ్లిపోయారట. ఆ విషయం నాకు తెలియదు. నేను పక్కింటికి వెళ్లి తిరిగి వచ్చేసరికి రషీద్‌ మండుటెండలో బండలపై వెల్లికలా పడుకుని ఉన్నాడు. నేనే కాదు, పక్కింటివాళ్లు చెప్పినా లేవలేదు. మావారికి చెబుదామంటే ఆయన దగ్గర ఫోన్‌ లేదు. చివరకు రెండున్నరకి వాళ్ల నాన్న వచ్చాక గానీ రషీద్‌ అక్కడి నుంచి కదల్లేదు. అప్పటికే వాడి వీపు అంతా బొబ్బలు కట్టింది. ఆ పట్టుదల చూసి మాకు కష్టమైనా సరే శిక్షణ ఇప్పించాలని నిర్ణయించుకున్నాం. 


అల్లరి... ఆట... 

అప్పుడు హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో సమ్మర్‌ కోచింగ్‌ క్యాంప్‌ జరుగుతోంది. కొందరి సహకారంతో రషీద్‌ని అక్కడ చేర్పించాం. వాడి బ్యాటింగ్‌ స్టయిల్‌ కోచ్‌లు కృష్ణారావు, ఎస్‌ఎన్‌ గణేశ్‌, ఏజీ ప్రసాద్‌లను ఆకట్టుకుంది. వాడికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. వాళ్ల దగ్గర రషీద్‌ ఆటలో మంచి నైపుణ్యం సంపాదించాడు. చిన్నప్పుడు రషీద్‌ అల్లరి పిడుగు. ఎప్పుడూ మాట్లాడుతూ ఉండేవాడు. వంటింట్లో సొరకాయ కనిపిస్తే... దాన్నే బ్యాట్‌లా పట్టుకుని ఆడుతుండేవాడు. వంట పనిలో ఉన్న నా వద్దకు వచ్చి, ప్లాస్టిక్‌ బంతి ఇచ్చి బౌలింగ్‌ వేయమనేవాడు. కాస్త పెద్దయ్యాక వాళ్ల నాన్న చెక్క బ్యాట్‌ ఒకటి కొనిచ్చారు. అప్పుడు కూడా కార్క్‌ బాల్‌ ఇచ్చి... అలా విసురు... ఇలా విసురు... అంటూ వంటింట్లోనే సాధన చేసేవాడు. 


అదే లోకం... 

ఆట బాగా అబ్బాక పెళ్లిళ్ల వంటి శుభకార్యాలకు కూడా వెళ్లడం మానేశాడు. బయటికి వెళ్లి సరుకులు తెమ్మన్నా తెచ్చేవాడు కాదు. ఆటే వాడికి లోకం. హైదరాబాద్‌లో ఉన్నప్పుడు ఒకటి రెండుసార్లు వాడు కొట్టిన షాట్లకు పక్కింటి వాళ్ల  కిటికీ అద్దాలు పగిలిపోయాయి. అయితే వారు పెద్ద మనసుతో వాడిని ఏమీ అనలేదు. అండర్‌ 19 ప్రపంచకప్‌ గెలిచాక వాళ్లే ఫోన్‌ చేసి... ‘మీవాడు చాలా బాగా ఆడాడు’ అని చెప్పినప్పుడు ఆనందంతో నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. రషీద్‌కు మా కష్టం తెలుసు. అందుకే ఒకసారి వాళ్ల నాన్న వాడి కోసం కొత్త డ్రెస్‌ కొని తెస్తే ఎందుకంటూ కోప్పడ్డాడు. రషీద్‌కు సేమియా పాయసం చాలా ఇష్టం. ఇంట్లో ఉంటే నాన్‌వెజ్‌ కర్రీలు, బిర్యానీ చేయమంటాడు. డ్రైఫ్రూట్స్‌ ఎక్కువగా తింటాడు. 




ఆ సమయంలో ఇక్కడికి... 

 రషీద్‌ పుట్టింది గుంటూరులోనే. మాకు ఆంధ్ర క్రికెట్‌ అకాడమీ ఎంతో అండగా నిలిచింది. శరత్‌చంద్రారెడ్డి, శివారెడ్డి, గోపీనాథ్‌రెడ్డి, వేణుగోపాల్‌ బాగా ప్రోత్సహించారు. 11 ఏళ్ల వయస్సులోనే ఆంధ్ర అండర్‌-14 జట్టుకు ఎంపికయ్యాడు. సౌత్‌జోన్‌ తరుపున కూడా మంచి ప్రతిభ కనబరిచి 90 మంది ప్రాబబుల్స్‌కి ఎంపికయ్యాడు. ఆ తర్వాత జాతీయ జట్టులోకి వచ్చి, అండర్‌-19 జట్టుకి వైస్‌కెప్టెన్‌ అయ్యాడు. 


కరోనా నుంచి కోలుకుని...  

అండర్‌ 19 ప్రపంచ కప్‌లో ఒక మ్యాచ్‌ ఆడిన తర్వాత రషీద్‌తో పాటు మరికొంతమంది ఆటగాళ్లు కరోనా బారిన పడ్డారు. అప్పుడు ఇక్కడ మేము చాలా ఆందోళనపడ్డాం. రోజూ ఫోన్‌ చేసి త్వరగానే కోలుకొంటావని, ప్రశాంతంగా ఉండమని ధైర్యం చెప్పాం. చివరకు కీలకమైన క్వార్టర్‌ఫైనల్స్‌కి ముందురోజే కోలుకున్నాడు. తిరిగి జట్టులోకి వచ్చి బంగ్లాదేశ్‌పై కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. ఆ తరువాత ఆస్ర్టేలియాతో సెమీస్‌, ఇంగ్లండ్‌తో ఫైనల్స్‌లో అద్భుతమైన బ్యాటింగ్‌తో రాణించాడు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించినందుకు మేం చాలా సంతోషపడ్డాం. 


పట్టుదలే ఆయుధం... 

రషీద్‌ వరల్డ్‌ కప్‌కి వెళ్లేటప్పుడు... ‘బాగా ఆడాలి. పట్టుదలే నీ ఆయుధం. భారత్‌ గెలవడంలో నువ్వు కీలక పాత్ర పోషించాలి. కోట్ల మంది తెలుగు ప్రజల ఆకాంక్షలు తీసుకెళుతున్నావని మరిచిపోవద్దు’ అని చెప్పాం. మ్యాచ్‌ల్లో వాడు ఆడుతున్నంతసేపు రెప్ప వాల్చకుండా చూశాను. ఫైనల్స్‌ గెలిచిన తర్వాత ఫోన్‌లో మాట్లాడాడు. చాలా సంతోషంగా ఉందన్నాడు. ‘ఇక్కడితో ఆగిపోకుండా ఇంకా బాగా ఆడి సీనియర్‌ జట్టులో స్థానం సంపాదించేందుకు కృషి చేయాల’ని వాడికి చెప్పాం. ఆ రోజు కోసం మేమూ ఎదురుచూస్తున్నాం.’’  






అల్లు అర్జున్‌.. జో రూట్‌.. 

రషీద్‌ క్రికెట్‌లో ఇంగ్లండ్‌ టెస్ట్‌ జట్టు కెప్టెన్‌ జో రూట్‌ని ఆరాధిస్తాడు. వాడి బ్యాటింగ్‌ శైలి కొంత రూట్‌ బ్యాటింగ్‌లానే ఉంటుంది. అతడిలానే టెస్ట్‌, వన్డే క్రికెట్‌కు ప్రాధాన్యమిస్తాడు. భారత జట్టులో విరాట్‌ కొహ్లీ చాలా ఇష్టం. ఇక కాస్త ఖాళీ దొరికితే రషీద్‌ సినిమాలు చూస్తుంటాడు. అల్లు అర్జున్‌ వాడి అభిమాన హీరో. 

 బొడ్డుపల్లి మధుసూదనరావు

ఫొటోలు: దాసరి రమణ

Updated Date - 2022-02-16T05:30:00+05:30 IST