విమానాలు, విమానాశ్రయాల్లో మన సంగీతమే వినిపించండి : కేంద్రం

ABN , First Publish Date - 2021-12-29T01:32:59+05:30 IST

విమానాలు, విమానాశ్రయాల్లో భారతీయ సంగీతాన్ని

విమానాలు, విమానాశ్రయాల్లో మన సంగీతమే వినిపించండి : కేంద్రం

న్యూఢిల్లీ : విమానాలు, విమానాశ్రయాల్లో భారతీయ సంగీతాన్ని వినిపించే అంశాన్ని పరిశీలించాలని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కోరింది. ప్రపంచవ్యాప్తంగా విమానయాన సంస్థలు తమ దేశానికి చెందిన సంగీతాన్నే వినిపిస్తున్న విషయాన్ని గుర్తు చేసింది. మన విమానయాన సంస్థలు చాలా అరుదుగా మాత్రమే మన సంగీతాన్ని వినిపిస్తున్నాయని పేర్కొంది. భారతీయ సాంస్కృతిక సంబంధాల మండలి (ఐసీసీఆర్) డిసెంబరు 23న విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియాకు చేసిన విజ్ఞప్తి మేరకు ఈ ఆదేశాలను జారీ చేసింది. 


భారతీయ విమానయాన సంస్థలు నడుపుతున్న విమానాల్లో భారతీయ సంగీతాన్ని వినిపించేలా చర్యలు తీసుకోవాలని ఐసీసీఆర్ జ్యోతిరాదిత్య సింథియాకు విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలో విమానయాన సంస్థలకు, విమానాశ్రయాలకు ఈ మంత్రిత్వ శాఖ పంపిన నోట్‌లో అన్ని విమానాలు, విమానాశ్రయాల్లో భారతీయ సంగీతాన్ని వినిపించే అంశాన్ని పరిశీలించాలని కోరింది. అమెరికన్ ఎయిర్‌లైన్స్‌ విమానాల్లో జాజ్, ఆస్ట్రియన్ ఎయిర్‌లైన్స్ విమానాల్లో మొజార్ట్, మిడిల్ ఈస్ట్ విమానాల్లో అరబిక్ సంగీతాన్ని వినిపిస్తున్న విషయాన్ని గుర్తు చేసింది. భారతీయ సంగీతానికి ఘనమైన వారసత్వం ఉందని, అయినప్పటికీ ఈ సంగీతాన్ని విమానాల్లో వినిపించడం చాలా అరుదుగా జరుగుతోందని పేర్కొంది. 


Updated Date - 2021-12-29T01:32:59+05:30 IST