క్రీడా మైదానాలకు కళ

ABN , First Publish Date - 2021-10-11T05:34:12+05:30 IST

క్రీడాకారులను ప్రోత్సహించేందుకు స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ నడుం బిగించింది.

క్రీడా మైదానాలకు కళ
ఖోఖో సాధన చేస్తున్న క్రీడాకారులు

జిల్లాలో క్రీడల నిర్వహణకు కార్యాచరణ

డీఎ్‌సఏకు శాప్‌ ఆదేశాలు

ప్రతిభకు పదునుపెట్టేలా శిక్షణ


నెల్లూరు (క్రీడలు) అక్టోబరు 10 :  క్రీడాకారులను ప్రోత్సహించేందుకు స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ నడుం బిగించింది. కొవిడ్‌తో బోసిపోయిన క్రీడా మైదానాలకు తిరిగి పూర్వవైభవం తీసుకువచ్చేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలు రూపొందించింది. ఇకపై తరచూ క్రీడాపోటీలు నిర్వహించి ప్రతిభ కలిగిన క్రీడాకారులను గుర్తించాలని శాప్‌ ఆదేశాలు జారీ చేసింది. దీన్ని అమలు చేసేందుకు జిల్లా క్రీడాపాధికార సంస్ధ అధికారులు చర్యలు ప్రారంభించారు. క్రీడావికాసం పెంపొందేలా ఆటల పోటీల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు.ఇందులో భాగంగా క్రీడాకారులకు ప్రత్యేక శిక్షణ అందిస్తున్నారు.


క్రీడా రంగానికి పూర్వవైభవం

కొవిడ్‌ ప్రభావం అన్ని రంగాలతో పాటు క్రీడారంగం పైన పడింది. క్రీడాకారులు మైదానాలకు దూరమయ్యారు. కరోనా అదుపులోకి రావడంతో క్రీడాధికారులు మళ్లీ క్రీడా రంగానికి పూర్వవైభవం తీసుకువచ్చే దిశగా అడుగులు వేయడం క్రీడాకారుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. వివిధ క్రీడాంశాల్లో వారాంత, మాసాంతం పోటీలు నిర్వహించాలని రంగం సిద్ధం చేస్తున్నారు. జిల్లా క్రీడాపాధికార సంస్ధలో ఇప్పటికే ఫుట్‌బాల్‌, బాస్కెట్‌బాల్‌, కబడ్డీ, ఖోఖో, హాకీ, అథ్లెటిక్స్‌, షటిల్‌, వెయిట్‌లిఫ్టింగ్‌, బాక్సింగ్‌, స్విమ్మింగ్‌ తదితర క్రీడాంశాల్లో శిక్షకులు అందుబాటులో ఉన్నారు. క్రీడాకారులు ఆయా క్రీడల్లో రాణించేలా ప్రత్యేక  శిక్షణ ఇస్తున్నారు. ఈ పోటీల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. నెలలో రెండు జిల్లాస్థాయి పోటీలను దాతల సహకారంతో డీఎ్‌సఏ ఆధ్వర్యంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 


శాప్‌ ఆదేశాలు పాటిస్తాం..

కరోనా ప్రభావంతో మందగించిన క్రీడాప్రగతిని ప్రోత్సహించాలని శాప్‌ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి వారం, నెల చివరిలో వివిధ క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించాలని వారు సూచించారు. వారి సూచనల మేరకు పోటీలను నిర్వహిస్తాం.

-ఆర్‌కె.యతిరాజ్‌, చీఫ్‌ కోచ్‌

Updated Date - 2021-10-11T05:34:12+05:30 IST