ప్లాస్టిక్‌ వద్దు.. జూట్‌ ముద్దు!

ABN , First Publish Date - 2022-07-03T05:15:04+05:30 IST

నేల కాలుష్యంతో కీలక భూమిక పోషిస్తున్న ప్లాస్టిక్‌ సంచులు మానవాళికి పెను సవాల్‌ విసురుతున్నాయి. అటు మూగజీవాల ప్రాణాలను సైతం హరిస్తున్నాయి.

ప్లాస్టిక్‌ వద్దు..  జూట్‌ ముద్దు!

పర్యావరణానికి ‘గోనె’ ప్రత్యామ్నాయం

భవిష్యత తరాల కోసం తప్పదు మార్పు 

నేడు అంతర్జాతీయ ప్లాస్టిక్‌ సంచుల వ్యతిరేక దినం


నేల కాలుష్యంతో కీలక భూమిక పోషిస్తున్న ప్లాస్టిక్‌ సంచులు మానవాళికి పెను సవాల్‌ విసురుతున్నాయి. అటు మూగజీవాల ప్రాణాలను సైతం హరిస్తున్నాయి. వీటి మితిమీరిన వాడకంతో పర్యావరణం ప్రశ్నార్థకంగా మారింది. ఇదే కొనసాగితే రానున్న భవిష్యత తరాలు అనారోగ్య సమాజంలో జీవించాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. ప్లాస్టిక్‌ సంచులకు ప్రత్యామ్నాయంగా గోనె (జూట్‌) సంచుల వాడకం ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలి. ఇందులో ప్రభుత్వాల పాత్ర కన్నా ప్రజల భాగస్వామ్యం ముఖ్యం. ఇంటి నుంచి బయలుదేరే ముందే  గోనె సంచి పట్టుకోవడం రానున్న ఆరోగ్యకర సమాజానికి నాంది. నేడు అంతర్జాతీయ ప్లాస్టిక్‌ సంచుల వ్యతిరేక దినం సందర్భంగా బాధ్యత కలిగిన పౌరుడిగా ప్రతిజ్ఞకు పూనుదాం! 


నెల్లూరు(సిటీ), జూలై 2 : నేటి సమాజంలో ప్లాస్టిక్‌ వాడకం సర్వసాధారణమైంది. దీని వల్ల కలిగే అనార్థాలు కళ్ల ముందు కనిపిస్తున్నా పట్టించుకోని బాధ్యతారాహిత్యం అందిరిలోనూ వ్యాపిస్తుంది. ఇంటికి వెళ్లేటప్పుడు వస్తువులను సగటు వ్యక్తి ప్లాస్టిక్‌ సంచుల్లోనే తీసుకెళ్తున్నారు. ఇవి పర్యావరణానికి పెను ముప్పని తెలిసినా తప్పని పరిస్థితి. భూమిలో వందేళ్లయినా ప్లాస్టిక్‌ కవరు అలాగే ఉండిపోతుంది. అంటే దీనివల్ల ఏర్పడే నేల కాలుష్యం ఎంత ప్రమాదకరమో అర్థమవుతుంది. మనం తీసుకునే అనేక రకాల ఆహారపదార్థాల ద్వారా ప్రమాదకర రసాయనాలు కడుపులోకి వెళ్లి అనర్థాలకు దారి తీస్తున్నాయి. దేశీయంగా సగటు వ్యక్తి నిత్య జీవితంలో ప్లాస్టిక్‌ సంచుల వాడకం ఓ భాగమైంది. వీటివల్ల ఎన్ని అనార్థాలున్నాయో నిపుణులు, విశ్లేషకులు, పలు అధ్యయన సంస్థలు ఎప్పటికప్పుడు వెల్లడిస్తున్నా ప్రజల్లో అవగాహన పెరగకపోగా, కనీస చైతన్యం రాకపోవడం భవిష్యత తరాలకు ఆందోళనకర సంకేతాలు చూపుతున్నాయి. ఇదే తీరు కొనసాగితే రానున్న అతి కొద్ది సంవత్సరాల్లో నేల, నీరు, నింగి కాలుష్యంగా మారి అనారోగ్య సమాజంలో జీవించాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. 


జూట్‌ బ్యాగు ఉత్తమం


పర్యావరణాన్ని కాపాడుకోవడంలో బాధ్యత కలిగిన  ప్రతి పౌరుడు తన కర్తవ్యంగా భావించాలి. ప్రస్తుతం మనముందున్న కోరలు చాస్తున్న నేల కాలుష్యాన్ని కాపాడుకునేందుకు ప్లాస్టిక్‌ సంచుల వాడకాన్ని మనకి మనమే నిషేధించుకుని ప్రత్యామ్నాయ సంచుల వాడకం అలవర్చుకోవాలి. అందులో జూట్‌, గుడ్డ సంచులను వినియోగించుకోవడం ఉత్తమం. ఇప్పటి నుంచి ప్లాస్టిక్‌ సంచులకు స్వస్తిపలికి ప్రత్యామ్నాయ సంచుల వాడకాన్ని మొదలపెట్టకపోతే రానున్న కాలానికి మరిన్ని రోగాలను ఆస్తిగా ఇవ్వాల్సి ఉంటుంది. నేటి సమాజంలో మనమందరం ఆరోగ్యకర పర్యావరణంలో హాయిగా జీవించాలంటే ప్లాస్టిక్‌ సంచులను దూరం చేసుకోవాల్సిందే. 


తయారీ సంస్థలకు ప్రోత్సహకాలేవి? 


ప్లాస్టిక్‌ సంచులకు ప్రత్యామ్నాయంగా గోనె సంచులతో అనేక పరిశ్రమలు ఏర్పడుతున్నాయి. వాటికి సరైన ప్రోత్సహకాలు లేకపోవడంతో అవి అంతంతమాత్రంగానే పని చేస్తున్నాయి. నెల్లూరులో అనేక మంది జూట్‌ బ్యాగులను తయారు చేస్తున్నారు. అయితే ఆశించినస్థాయిలో ఆదరణ కరువై బహిరంగ మార్కెట్లోకి రాలేకపోతున్నారు. తయారైన సంచులను రైతుబజార్లు, మున్సిపల్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌లు, ఇతర వాణిజ్య సముదాయాల్లో అవకాశాలు కల్పిస్తే అందుబాటులో ఉంటాయి. కానీ ఇందుకు భిన్నంగా పరిస్థితులు ఉండటంతో తయారీదారులు తమ ఇళ్ల వద్దే వాటిని అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది.  


ఇంటి నుంచే గోనె సంచి తీసుకెళ్లడం ఉత్తమం 


ప్రతి వ్యక్తి ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు గోనె సంచిని తీసుకెళ్లడం నేర్పుకోవాలి. దీనివల్ల ప్లాస్టిక్‌ వినియోగం ముప్పాతిక శాతం పైగా నిషేధించవచ్చు. మనం వినియోగంచే ప్లాస్టిక్‌ సంచులు రోడ్లపై వేయడం వల్ల మూగజీవాలకు ప్రాణాంతకంగా మారుతుంది. అవి వాటిని తిని జీర్ణవ్యవస్థ పని చేయక మరణిస్తున్నాయి. 

- డాక్టర్‌ చైతన్యకిషోర్‌, ఏడీడీఎల్‌, ఏడీ 


ప్రతి వ్యక్తి చైతన్యం పెంచుకోవాలి 


ప్లాస్టిక్‌ సంచులను వాడితే కలిగే అనర్థాలపై ప్రతి  వ్యక్తి చైతన్యం పెంచుకోవాలి. అప్పుడే వాటి నిషేధం పూర్తిగా జరుగుతుంది. ఇప్పటి నుంచే ప్లాస్టిక్‌ సంచులకు ప్రత్యామ్నాయం వాడకపోతే రానున్న భవిష్యత్తు తరాలకు పెనుముప్పు తప్పదు. మన పిల్లలకు ఆరోగ్యకర పర్యావరణం అందించాలంటే మార్పు ఈ రోజు మొదలవ్వాలి. 

- రామాల పద్మజ, జీవశాస్త్ర అధ్యపకురాలు 

Updated Date - 2022-07-03T05:15:04+05:30 IST