ప్లాస్టిక్‌ ఫ్లెక్సీ పెడితే జరిమానా

ABN , First Publish Date - 2022-09-23T08:38:48+05:30 IST

ప్లాస్టిక్‌ ఫ్లెక్సీ పెడితే జరిమానా

ప్లాస్టిక్‌ ఫ్లెక్సీ పెడితే జరిమానా

నవంబరు నుంచి నిషేధం అమలు

కాలుష్య నియంత్రణ మండలికి పర్యవేక్షణ బాధ్యతలు


అమరావతి, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్లాస్టిక్‌ ఫ్లెక్సీ బ్యానర్లపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ నిషేధం నవంబరు ఒకటో తేదీ నుంచి అమలులోకి రానున్నది. ఈ మేరకు గురువారం గెజిట్‌ విడుదలైంది. దానిలో... ‘‘ప్లాస్టిక్‌ ఫ్లెక్సీ బ్యానర్లను ఏ వ్యక్తి తయారు చేయరాదు. దాని మెటీరియల్‌ను దిగుమతి చేసుకోకూడదు. ఏ వ్యక్తి ఎలాంటి ఫ్లెక్సీలను ముద్రించకూడదు, ఉపయోగించకూడదు. రవాణా చేయకూడదు, ప్రదర్శించకూడదు’’ అని స్పష్టం చేసింది. ఈ నిబంధనలను రాష్ట్రంలో అమలు చేసే బాధ్యతను కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి, జోనల్‌, రీజనల్‌ అధికారులు, జిల్లా స్థాయిలో కలెక్టర్‌ పర్యవేక్షణలో జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌, గ్రామ పంచాయతీ అధికారులకు, మున్సిపల్‌ పట్టణాల్లో కమిషనర్లు, హెల్త్‌, శానిటరీ, వార్డు సచివాలయ అధికారులతో పాటు రెవిన్యూ, పోలీస్‌, రవాణా, జీఎస్టీ అధికారులకు అప్పగించారు. నిషేధిత ప్లాస్టిక్‌ ఫెక్సీ బ్యానర్ల విషయంలో నిబంధనలు అతిక్రమిస్తే చదరపు అడుగుకు రూ.100 జరిమానా విధించే అధికారం సంబంధిత అధికారులకు అప్పగించింది. నిషేధించిన ప్లాస్టిక్‌ ఫెక్సీ బ్యానర్ల మెటీరియల్‌ను స్వాధీనం చేసుకుని, నిషేధాన్ని ఉల్లంఘించిన వారిని పర్యావరణ చట్టం ప్రకారం ప్రాసిక్యూషన్‌ చేసే అధికారాన్ని కాలుష్య నియంత్రణ మండలికి దఖలు పరుస్తూ అటవీ, పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ ఉత్తర్వులు జారీ చేశారు.


పట్టు పరిశ్రమ పథకాల పర్యవేక్షణకు రెండు కమిటీలు 

రాష్ట్రంలో పట్టు పరిశ్రమశాఖ అమలుచేసే పథకాల పర్యవేక్షణకు సెరికల్చర్‌ కో ఆర్డినేషన్‌ కమిటీ, ప్రాజెక్ట్‌ మానిటరింగ్‌ కమిటీలను ప్రభుత్వం నియమించింది. ఆర్డినేషన్‌ కమిటీకి పట్టుపరిశ్రమ స్పెషల్‌ సీఎస్‌, ప్రాజెక్ట్‌ మానిటరింగ్‌ కమిటీ చైర్మన్‌గా పట్టు పరిశ్రమ కమిషనర్‌ వ్యవహరించనున్నారు. 

Updated Date - 2022-09-23T08:38:48+05:30 IST