నిషేధమా.. అదెక్కడ?

ABN , First Publish Date - 2022-07-24T05:28:22+05:30 IST

పర్యావరణానికి విఘాతం కలిగిస్తూ ప్రాణకోటికి సంకటకంగా మారిన ప్లాస్టిక్‌ భూతాన్ని తరిమికొట్టేందుకు ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి.

నిషేధమా.. అదెక్కడ?
ప్లాస్టిక్‌ కవర్లలో కూరల ప్యాకింగ్‌

జిల్లాలో ఎక్కడా అమలు కాని ప్లాస్టిక్‌ నిషేధం

చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం

ప్రజల్లో చైతన్యమూ అవసరం


నరసరావుపేట, జూలై 23: పర్యావరణానికి విఘాతం కలిగిస్తూ ప్రాణకోటికి సంకటకంగా మారిన ప్లాస్టిక్‌ భూతాన్ని తరిమికొట్టేందుకు ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. ఇందులో భాగంగా తిరిగి వాడుకునేందుకు పనికిరాని, ఒకసారి వాడిపడేసే ప్లాస్టిక్‌తో తయరు చేసిన పాలిథిన్‌ కవర్లు, ప్లాస్టిక్‌ సీసాలు, గ్లాసులు ఇలా 18 రకాలపై ఈ నెల ఒకటి నుంచి కేంద్ర ప్రభుత్వం నిషేదం విఽధించింది. ఈ నిర్ణయాన్ని క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం అమలు చేయాల్సి ఉంది. జిల్లావ్యాప్తంగా నిషేధిత ప్లాస్టిక్‌ ఉత్పత్తులను అరికట్టే చర్యలు ప్రస్తుతం ప్రకటనలకే పరిమితమయ్యాయి. 20 రోజులు దాటినా నిషేధిత ప్లాస్టిక్‌ వినియోగం, విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. చర్యలు తీసుకోవాల్సిన యంత్రాంగం చోద్యం చూస్తోంది. 


నిషేధిత ప్లాస్టిక్‌ జాబితాలో 75 మైక్రాన్ల లోపు మందం ఉన్న క్వారీ బ్యాగులతో పాటు 50 మైక్రాన్ల లోపు మందం ఉన్న ప్లాస్టిక్‌ షీట్లు, పాన్‌ మసాలా ప్యాకెట్లు ఉండగా, మరో 18 రకాల ప్లాస్టిక్‌ ఉత్పత్తులను చేర్చారు. ఒక్కసారి మాత్రమే వినియోగించే ప్లాస్టిక్‌ గ్లాసులు, కప్పులు, స్పూన్లు, స్ట్రాలు తదితరాలన్నీ కొత్త జాబితాలో ఉన్నాయి. 



జిల్లాలోని పట్టణాలు ప్లాస్టిక్‌ మయమయ్యాయి. ఇదే పరిస్థితి పల్లెల్లోనూ నెలకొంది. విచ్చలవిడిగా ప్లాస్టిక్‌ వినియోగం జరుగుతోంది. పట్టణాలలో రోజూ ఉత్పత్తి అయ్యే వ్యర్ధాలలో నాలుగో వంతు ప్లాస్టిక్‌ ఉంటోంది. ప్లాస్టిక్‌ వినియోగంపై మునిసిపాల్టీలు, పంచాయతీలు, సచివాలయాల పర్యవేక్షణ పూర్తిగా కొరవడింది. దీంతో వ్యాపారులు యథేచ్ఛగా నిషేధిత ప్లాస్టిక్‌ కవర్లను వినియోగిస్తూనే విక్రయాలు జరుపుతున్నారు. పట్టణాల్లో మురుగు కాలువలు ప్లాస్టిక్‌ మయమవుతున్నాయి. ఏ కాలువ చూసినా ప్లాస్టిక్‌ కవర్లు, గ్లాసులు కనిపిస్తున్నాయి. మురుగు కాలువలు పూడిపోవటానికి ప్లాస్టిక్‌ ఒక కారణంగా ఉంది. కాలువల్లో పూడిక తీసే సమయంలో పెద్ద ఎత్తున ప్లాస్టిక్‌ కవర్లు, సీసాలు, గ్లాసులు ఉంటున్నాయి. 


పర్యావరణంపై ప్లాస్టిక్‌ వ్యర్థాల తీవ్ర ప్రభావం చూపుతోంది. కూరగాయలు, సరుకులు, పండ్లు ఇలా ఏమి కొనుగోలు చేసినా ప్రజలు ప్లాస్టిక్‌ సంచులనే వినియోగిస్తున్నారు. ఈ కవర్ల వినియోగంపై నియంత్రణ  కన్పించటం లేదు. విందు, వినోదాల్లో కూడా ప్లాస్టిక్‌ గ్లాసులు, పేపర్‌  సామాగ్రిని వినియోగిస్తున్నారు. చివరకు కూరలు, ఆహారం ప్యాకింగ్‌లో కూడా ప్లాస్టిక్‌ పేపర్‌, కవర్లను వాడుతున్నారు. వేడి ఆహార పదార్ధాలను ప్లాస్టిక్‌ కవర్లలో ప్యాకింగ్‌ చేయడం వలన అవి కరిగి ఆహారంలో కలసిపోతూ ప్రాణ సంకటంగా మరుతున్నది. కఠినమైన చట్టాలు ఉన్నా వీటిని అమలు చేసి నిషేదిత ప్లాస్టిక్‌ను అరికట్టాల్సిన అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. ఒక వైపు చట్టాలను అమలు చేస్తూ మరో వైపు ప్రజలను చైతన్య పరిస్తే ప్లాస్టిక్‌ వాడకాన్ని తగ్గించే అవకాశం ఉంటుంది.

Updated Date - 2022-07-24T05:28:22+05:30 IST