గుట్టలుగా ప్లాస్టిక్‌ సంచులు

ABN , First Publish Date - 2020-07-17T10:18:46+05:30 IST

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జిల్లాలో రేషన్‌ బియ్యాన్ని ప్లాస్టిక్‌ సంచుల్లో నేరుగా కార్డుదారుల ఇంటికే అందిస్తున్న విషయం ..

గుట్టలుగా ప్లాస్టిక్‌ సంచులు

రేషన్‌ బియ్యం కవర్లను తిరిగి తీసుకోని వలంటీర్లు

ఇళ్లల్లో పేరుకుపోతున్న వైనం 

బయటపారబోత.. దెబ్బతింటున్న పర్యావరణం


గుజరాతీపేట, జూలై 16: వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జిల్లాలో రేషన్‌ బియ్యాన్ని ప్లాస్టిక్‌ సంచుల్లో నేరుగా కార్డుదారుల ఇంటికే అందిస్తున్న విషయం తెలిసిందే. దీనికోసం ఫైలట్‌ ప్రాజెక్టుగా జిల్లాను ఎంపిక చేసింది. 5, 10, 15, 20 కిలోల వంతున బియ్యం బ్యాగులను వలంటీర్లు నేరుగా కార్డుదారుల ఇంటికి వెళ్లి పంపిణీ చేస్తున్నారు. అయితే, ఈ ప్లాస్టిక్‌ సంచులను వినియోగదారుల నుంచి తిరిగి వాపస్‌ తీసుకోవాలన్న నిబంధన ఉన్నా అమలు కావడం లేదు. దీంతో ప్లాస్టిక్‌ సంచులు కార్డుదారుల వద్ద పేరుకుపోతున్నాయి. కొన్ని రోజులకు అవి చినిగిపోతుండడంతో వాటిని బయట పడేస్తున్నారు. దీనివల్ల పర్యావరణానికి హాని కలుగుతుందని ప్రకృతి ప్రేమికులు ఆవేదన చెందుతున్నారు. జిల్లాలో సుమారు 7,75,695 తెలుపు రేషన్‌ కార్డులు ఉన్నాయి.  ఈ కార్డుదారులకు గత సెప్టెంబరు నుంచి ప్లాస్టిక్‌ సంచుల్లో బియ్యం అందజేస్తున్నారు.


ఇప్పటికి 11 సార్లు అందజేశారు. అదే విధంగా కరోనా విపత్తు కారణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మూడున్నర నెలల వ్యవధిలో ఏడు దఫాలు ఉచితంగా రేషన్‌ బియ్యాన్ని   పంపిణీ చేశారు. ఈ లెక్కన ప్రతి కార్డుదారుడి వద్ద 18 బ్యాగులు ఉన్నాయి. దీని ప్రకారం 1,39,62,510 ప్లాస్టిక్‌ సంచులు కార్డుదారుల వద్ద పేరుకుపోయాయి. ఈ ఖాళీ సంచులను వారి నుంచి తిరిగి తీసుకొని ఆయా డీలర్లకు వలంటీర్లు చేర్చాల్సి ఉంది. కానీ, ఇది ఎక్కడా అమలు కావడం లేదు. దీంతో ఆ సంచులు చినిగిపోవడంతో కార్డుదారులు బయట పారబోస్తున్నారు. దీనివల్ల పర్యావరణం దెబ్బతింటోంది.  ఇప్పటికైనా కార్డుదారుల నుంచి ఖాళీ సంచులను తీసుకొని పర్యావరణాన్ని కాపాడాలని ప్రకృతి ప్రేమికులు కోరుతున్నారు.

Updated Date - 2020-07-17T10:18:46+05:30 IST