మొక్కలు నాటారు.... సంరక్షణ మరిచారు

ABN , First Publish Date - 2022-04-17T05:14:02+05:30 IST

నారు పోసినోడు నీరు పోయక పోతాడా అనేది సామెత.. ఆ సామెతకు పాతర వేశారు. పచ్చదనం పెంపు కోసం ఉపాధి పథకం కింద ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మొక్కల పెంపకం చేపట్టింది.

మొక్కలు నాటారు.... సంరక్షణ మరిచారు
సంరక్షణ లేకపోవడంతో ఎండిపోయిన మొక్కలు

ఎండిపోయిన మొక్కలు 

పట్టించుకోని అధికారులు


గాలివీడు, ఏప్రిల్‌ 16: నారు పోసినోడు నీరు పోయక పోతాడా అనేది సామెత.. ఆ సామెతకు పాతర వేశారు. పచ్చదనం పెంపు కోసం ఉపాధి పథకం కింద   ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మొక్కల పెంపకం చేపట్టింది. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లా, మండలస్థాయి అధికారులకు, సిబ్బందికి లక్ష్యాన్ని నిర్దే శించి.. సాధించే వరకు పని చేయించారు. అయితే కొందరు సిబ్బం ది నిర్లక్ష్యంతో మొక్కలకు నీళ్లు పోయడం మరిచారు. దీంతో మొక్కలన్నీ ఎండిపోయి ప్రభుత్వ లక్ష్యం నీరుగారి పోతోంది.  వివరాల్లోకి వెళితే... మండలంలోని 17 గ్రామ పంచాయతీలకు 11 గ్రామ పంచాయతీల్లో రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటారు. మొత్తం 11 పంచాయతీల్లో 27 కిలోమీటర్ల పరిధిలో 10774 మొక్క లను నాటారు. అందులో చీమలచెరువుపల్లె పంచాయతీలో 3.07 కిలోమీటర్లకు గానూ 1226 మొక్కలు, గాలివీడు ఎస్‌కేయంకు   2వేలు మొక్కలు, గరుగుపల్లె పంచాయతీలో 1.29 కిలోమీటర్లకు 515 మొక్కలు, గుండ్లచెరువులో 1.6 కిలోమీటర్లకు 660 మొక్కలు, కొర్లకుంటలో 3.08 కిలోమీటర్లకు  1230 మొక్కలు, నూలివీడులో 2.06 కిలోమీటర్లకు  823 మొక్కలు, పందికుంటలో 2 కిలోమీటర్లకు  800 మొక్కలు, పూలుకుంటలో 3.15 కిలోమీటర్లకు 1260 మొక్కలు, తలముడిపిలో ఒక కిలోమీటరుకు 400 మొక్కలు, తూముకుంట 3.15 కిలోమీటర్లకు 1260, వెలిగల్లు పంచాయతీలో 1.5 కిలోమీటర్లకు  600 మొక్కలు నాటినట్లు ఏపీవో తెలిపారు. వీటిలో కొన్ని పంచా యతీల్లో నాటిన మొక్కలు 80 శాతం ఎండిపోగా మరికొన్ని గ్రామ పంచాయతీలో సగం వరకు ఎండిపోయాయి. ఒక గ్రామ పంచా యతీలో మాత్రం 90 శాతం మొక్కలు బతికి ఉన్నాయి. సాధార ణంగా ఒక మొక్క నాటడానికి గుంతకు రూ.50 నుంచి 70 వరకు చెల్లించారు. మొక్కలు నాటిన తరువాత వారానికి 4 రోజులు మొక్కలకు నీటిని అందించాలి. అందుకు ఒక్కో మొక్కకు రోజుకు రూ.4.15పైసలు ప్రభుత్వం ఇవ్వనుంది. మొక్కకు రక్షణగా చుట్టూ (కల్ల) కంచె వేసినందుకు రూ.140 కేటాయించగా, ప్రస్తుతానికి మొదటి విడతలో రూ.70చెల్లించినట్లు అధికారులు పేర్కొన్నారు. నాలుగు వందల మొక్కలను కాపా డడానికి ఒక వ్యక్తిని కూడా నియమించి నెలకు దాదాపు రూ.1500 వరకు చెల్లిస్తున్న ట్లు సమాచారం. లక్షలు ఖర్చు పెట్టి మొక్కలకు నీరు కానీ, వాటిని సరంక్షించే బాధ్యతను గాలికి  వదిలేశారు. ఎండిపోయిన మొక్కలకు ఇప్పటికీ కూడా బిల్లులు పెట్టుకుంటున్నట్లు ఉపాధి సిబ్బందిపై ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి బతికి ఉన్న మొక్కలను కాపాడడంతో పాటు నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. 

మొక్కలను కాపాడేందుకు చర్యలు తీసుకుంటాం

మండలంలోని 11 గ్రామ పంచాయతీల్లో మొక్కలు నాటామని, కొన్ని గ్రామ పంచాయతీల్లో ఎండిపోయిన మొక్కలు గురించి తమ దృష్టికి రాలేదు. వీటికి బిల్లులు ఇక నుంచి చెల్లించం. ఉన్న మొక్కలను కాపాడడానికి చర్యలు తీసుకుం టాం. గతంలో ప్లాంటేషన్‌ అధికారి చూసుకునేవారు. ప్రస్తుతం ప్లాంటేషన్‌ అధికారి లేడని ఇక నుంచి మొక్కలను కాపాడే బాధ్యతను తీసుకుంటా. 

- సంపత్‌కుమార్‌, ఏపీవో 

Updated Date - 2022-04-17T05:14:02+05:30 IST