పచ్చదనం పడకేసింది..

ABN , First Publish Date - 2022-07-06T05:34:55+05:30 IST

జగనన్న పచ్చతోరణంలో భాగంగా పర్యావరణ పరిరక్షణ కోసం జాతీయ ఉపాధి హామీ పథకంలో ఈ మొక్కల పెంపకం కొనసాగుతోంది.

పచ్చదనం పడకేసింది..

మొక్కుబడిగా జగనన్న పచ్చతోరణం

తగ్గిన మొక్కల పెంపకం

నిర్వహణ ఖర్చులు పెండింగ్‌

ఫారెస్టు నర్సరీల ద్వారానే మొక్కలు 

కొత్తగా మునగ సాగుకు ప్రోత్సాహం


జగనన్న పచ్చతోరణంలో మొక్కల పెంపకం మొక్కుబడిగా కొనసాగుతోంది. ఉపాధి హామీ పథకం ద్వారా గతంలో ఉద్యమంలా సాగిన ఈ ప్రక్రియ పడకేసింది. గతంలో పండ్ల తోటలకు ప్రైవేటు నర్సరీల నుంచి కూడా మొక్కలు ఇచ్చేవారు. ఇప్పుడదీ లేదు. గతేడాది 1,337 కిలోమీటర్ల మేర ప్లాంటేషన్‌ జరగ్గా ఈ ఏడాది 200 కిలోమీటర్ల మేర మాత్రమే ప్లాంటేషన్‌కు లక్ష్యంగా నిర్ణయించారు.

ఏలూరు సిటీ, జూలై 5 :  జగనన్న పచ్చతోరణంలో భాగంగా పర్యావరణ పరిరక్షణ కోసం జాతీయ ఉపాధి హామీ పథకంలో ఈ మొక్కల పెంపకం కొనసాగుతోంది. ముఖ్యంగా పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు, దేవాలయాలు, ప్రార్థనా మందిరాలు, పురపాలక, గ్రామీణ ప్రాంత రోడ్లకు ఇరువైపులా, అంగన్‌ వాడీలు, హౌసింగ్‌ కాలనీలు, పార్కులు, ప్రభుత్వాస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఇరిగేషన్‌ కాలువలు, చెరువు గట్ల వెంబడి, ఆర్‌అండ్‌బీ రహదారికి ఇరువైపులా మొక్కలు నాటి పచ్చ దనంతో నింపడమే ఈ కార్యక్రమ ఉద్ధేశం. మొక్కలను నాటడమే కాకుండా వాటిని సంరక్షించాల్సిన బాధ్యత కూడా తీసుకోవాల్సి ఉంది. ఈ మొక్కల పెంపకానికి సంబంఽధించి వాటి నిర్వహణకు మొక్కల సంరక్షకులను ఏర్పాటు చేసి వారు చేసిన రోజువారీ పనికి ఉపాధి వేతనాలు కూడా చెల్లించేవారు. ప్రభుత్వ సామాజిక వన విభాగంలోని నర్సరీలతో పాటు ప్రైవేటు నర్సరీల నుంచి మొక్కలు కొనుగోలు చేసేవారు. అయితే గతేడాది తెచ్చిన మొక్కలకు సంబంధించి నర్సరీలకు ఇవ్వాల్సిన బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. దాదాపు రూ. 4 కోట్లు వరకు బకాయిలు ఉన్నాయని తెలుస్తోంది. దీంతో ఈ ఏడాది కేవలం అటవీ శాఖకు చెందిన  మొక్కలను మాత్రమే వినియోగించాలని నిర్ణయించారు.  

  

ఈ ఏడాది ప్లాంటేషన్‌ లక్ష్యం 200 కిలోమీటర్లు

ఈ ఏడాది జగనన్న పచ్చతోరణం కార్యక్రమంలో భాగంగా 200 కిలో మీటర్లు మేర మొక్కలను పెంచాలని నిర్ణయించారు. ఈసారి అటవీ శాఖకు చెందిన నర్సరీలలో ఉండే మొక్కలను తీసుకుని పెంచుతున్నారు. ఈసారి 3 లక్షలు మొక్కలు తీసుకున్నా ఇందులో గతంలో వేసిన మొక్కలు చనిపోయిన చోట నాటేందుకు లక్షా 50 వేలు మొక్కలు వినియోగించినా మిగిలిన లక్షా 50 వేలు మొక్కలు రహదారుల వెంబడి, ప్రభుత్వ సంస్థలలో పెంచాలని నిర్ణయించారు.ఈ ఏడాది పండ్ల తోటల అభివృద్ధిలో భాగంగా ఈ ఏడాది 500 ఎకరాల్లో పొలాల వెంబడి పెంచాలని నిర్ణయించారు. ఈసారి డ్రాగన్‌ప్రూట్‌, అంజీరా, బత్తాయి, అల్లనేరేడు, మామిడి, నిమ్మ, జామ, సపోటా వంటి అనేక పండ్ల రకాల మొక్కలు పెంచటానికి కార్యాచరణ రూపొందించారు.


గతేడాది 1337.9 కిలోమీటర్లు మేర ప్లాంటేషన్‌

గతేడాది (2021–22) సంవత్సరంలో ఎవెన్యూ ప్లాంటేషన్‌ 1,337.9 కిలోమీటర్లు మేర చేపట్టారు. దాదాపు 3 లక్షల 63 వేల 869 మొక్కలను పెంచారు. గతంలో మూడు సంవత్సరాల పాటు నిర్వహణ ఖర్చులు ఇవ్వగా గతేడాది నుంచి ఈ మొక్కల నిర్వహణ రెండేళ్లేకే పరిమితం చేశారు. దీంతో నిధుల కేటాయింపు కూడా తగ్గింది.


మునగ నర్సరీలకు ప్రాధాన్యం

ఈ సారి పండ్ల తోటల అభివృద్దిలో భాగంగా మునగ నర్సరీలను పెంచాలని నిర్ణయించారు. ఒక్కొక్క రైతుకు 5 ఎకరాలకు మించకుండా ప్రతి 25 సెంట్లకు మునగ మొక్కలు వేయటానికి కూడా అవకాశం కల్పించారు.  5 వేల మొక్కలు పెంచటానికి ఒక్కొక్క నర్సరీకి సంబంధించి రూ.29 వేలు నిర్వహణ ఖర్చులు ఇవ్వాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి ఏలూరు జిల్లాలో నూజివీడు, ఆగిరి పల్లిలలో మూడుచోట్ల మునగ నర్సరీలు ఏర్పాటుకు రైతులు ముందుకు వచ్చారు. ఇక రైతుల పంట పొలాల్లో మునగ మొక్కలు పెంచటానికి 25 మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. 25 సెంట్ల భూమిలో మునగ మొక్కలు పెంచటానికి నిర్వహణ ఖర్చులుగా రూ.25,536 నిధులు అందజేస్తారు. 


Updated Date - 2022-07-06T05:34:55+05:30 IST