నియంత్రిత పంటల సాగుపై ప్రణాళిక సిద్ధం చేయాలి

ABN , First Publish Date - 2020-05-20T09:46:02+05:30 IST

ప్రభుత్వం ప్రకటించిన నియంత్రిత పంటల విధానాన్ని అమలు చేసేందుకుగాను రంగారెడ్డి జిల్లాలో పూర్తిస్థాయి ప్రణాళికను సిద్ధం

నియంత్రిత పంటల సాగుపై ప్రణాళిక సిద్ధం చేయాలి

వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ అమయ్‌కుమార్‌


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌) : ప్రభుత్వం ప్రకటించిన నియంత్రిత పంటల విధానాన్ని అమలు చేసేందుకుగాను రంగారెడ్డి జిల్లాలో పూర్తిస్థాయి ప్రణాళికను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌ నుంచి అదనపు కలెక్టర్‌ హరీష్‌, జిల్లా రైతు బంధు కోఆర్డినేటర్‌ వంగేటి లక్ష్మారెడ్డి, జిల్లావ్యవసాయాధికారి గీతారెడ్డి, డీఆర్‌డీఏ పీడీ ప్రశాంత్‌కుమార్‌ జిల్లాలోని రెవెన్యూ అధికారులు, వ్యవసాయాధికారులు, రైతు బంధు ప్రతినిధులతో కలిసి జిల్లా కలెక్టర్‌ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.


ఈ సందర్భంగా కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ మాట్లాడుతూ.. రైతులకు గిట్టుబాటు ధర లభించేలా సాగుబడిలో గణనీయమైన మార్పు లకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, అందుకనుగుణంగా పంటల సాగు చేయాలన్నారు. సరైన ధర, దిగుబడి లేకపోవం వల్ల ప్రస్తుతం మొక్కజొన్న పంటను వేయొద్దన్నారు. జిల్లాలో ప్రధాన పంటలైన పత్తి, వరి, కందులు, కూరగాయల సాగు విస్తీర్ణంలో పెద్దగా మార్పులు ఉండవన్నారు. వరి సాగుచేసే రైతులు మాత్రం ప్రభుత్వం అందించే సన్నరకాల విత్తనాలను వేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రైతుబంధు జిల్లా కోఆర్డినేటర్‌ వంగేటి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. మండలాల్లోని స్టాక్‌ పాయింట్లు, ప్రాథమిక సహకార సంఘాల్లో ఎరువులు అందుబాటులో ఉన్నాయని, రైతులు ఇప్పటి నుంచే కొనుగోలు చేయాలని పేర్కొన్నారు.


రైతు వేదికల నిర్మాణం

జిల్లాలో 87 రైతుబంధు క్లస్టర్లు ఉన్నారని, ఈ వ్యవసాయ క్లస్టర్లలో రైతు వేదికల నిర్మాణం చేపట్టనున్నట్లు కలెక్టర్‌ అమయ్‌ కుమార్‌ తెలిపారు. తమ ప్రాంతంలో ఏవిధమైన పంటలు వేయాలి, వ్యవసాయ రంగంలో వస్తున్న ఆధునిక మార్పులు, ఉత్పత్తులకు మార్కెటింగ్‌ సదుపాయాలు, ఇతర అంశాలను చర్చించుకునేందుకు ఈ వేదికలు ఉపయోగపడుతాయని తెలిపారు. ఐదారు నెలల్లో వీటి నిర్మాణం పూర్తి చేయాలన్నారు. భూమిని అందించేందుకు దాతలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని తెలిపారు. 


2,81,766 మందికి రైతుబంధు వర్తింపు

జిల్లాలో 2,81,766 మంది రైతులకు రైతుబంధు పథకం వర్తింప చేస్తున్నామని, ప్రభుత్వం నిర్ణయించిన పంటలు వేసిన వారికి మాత్రమే రైతుబంధు వర్తిస్తుందని తెలిపారు. ప్రభుత్వం నిర్ధేశిం చిన కేంద్రాల వద్దనే రైతులు విత్తనాలు కొనుగోలు చేయాలన్నారు. వ్యవసాయ భూముల్లో ఉపయోగించేందుకు చెరువు మట్టిని తీసుకెళ్లేందుకు అనుమతిస్తున్నామని చెప్పారు. కంది సాగు అధికంగా చేయాలని సూచించారు. 


గిడ్డంగుల నిర్మాణాలకు ప్రాధాన్యం

జిల్లాలో రైతులు పండించిన ఉత్పత్తులను నిలువ చేసేందుకు గిడ్డంగుల నిర్మాణాలకు స్థలాలను సేకరించాలని రెవెన్యూ అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. 78,100 టన్నుల సామర్థ్య ఉన్న 29 గోదాములు ఉన్నాయని తెలిపారు. 

Updated Date - 2020-05-20T09:46:02+05:30 IST