Abn logo
Sep 25 2021 @ 00:58AM

ప్లానిటోరియంపై నీలినీడలు

వ్యయం రూ.30 కోట్ల నుంచి రూ.90 కోట్లకు పెంపు

సీఎం శంకుస్థాపన చేసినా... టెండర్లకు వెళ్లని వైనం

గుణపాఠం నేర్వనివీఎంఆర్‌డీఏ

కైలాసగిరిపై తగదని నిపుణుల అభిప్రాయం


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

‘అంతన్నాడు....ఇంతన్నాడోయ్‌...గంగరాజు!!’ అన్నట్టుగా మారింది కైలాసగిరిపై ప్లానిటోరియం నిర్మాణం. రెండేళ్ల క్రితం సీఎం జగన్‌ చేతుల మీదుగా అట్టహాసంగా శంకుస్థాపన చేయించి, ఇప్పటివరకు కనీసం టెండర్లు కూడా పిలవలేదు. అంచనా వ్యయాన్ని మాత్రం రెండింతలు పెంచేశారు. ఇదిలావుండగా కైలాసగిరిపై ఈ ప్లానిటోరియం నిర్మిస్తే... మరొక తెలుగు మ్యూజియంగా మిగిలిపోతుందే తప్ప.. ఆదరణ వుండదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  

స్థలం ఉందనే అక్కడ ప్రతిపాదన

విశాఖపట్నంలో ఒక ప్లానిటోరియం వుంటే బాగుంటుందని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించగా, తమ దగ్గర స్థలం అందుబాటులో ఉందని, నిర్మిస్తామంటూ నాటి వీఎంఆర్‌డీఏ కమిషనర్‌ కోటేశ్వరరావు ముందుకువచ్చారు. ప్రభుత్వ పెద్దలు కూడా స్థలం రెడీగా వుందనే ఆలో చించారే తప్ప..అక్కడ నిర్మిస్తే దాని భవిష్యత్తు ఎలా ఉంటుందోనని యోచించలేదు. కైలాసగిరిపై ఏడు ఎకరాల విస్తీర్ణంలో రూ.30 కోట్లతో ప్లానిటోరియంతో పాటు సైన్స్‌ విజ్ఞాన కేంద్రం ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. ఇందుకోసం వీఎంఆర్‌డీఏ అధికారులు పలు రాష్ట్రాల్లో ప్లానిటోరియాలను పరిశీలించారు. ఎక్కడా లేని విధంగా నూతన సాంకేతిక పరిజ్ఞానంతో అధునాతన నక్షత్రశాల నిర్మించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో శంకుస్థాపన చేసినప్పుడు అనుకున్న రూ.30 కోట్ల బడ్జెట్‌ను దాటి  దాదాపు రూ.90 కోట్ల వరకు అవసరమని  తేల్చారు. సంస్థ ఆర్థిక వ్యవహారాలన్నీ గుట్టుగా నడిపిన నాటి కమిషనర్‌ కోటేశ్వరరావు టెండర్లు పిలవకుండానే కొందరు కన్సల్టెంట్లను కూడా తెప్పించారు. అయితే వారి పరిజ్ఞానం కూడా అంతంతమాత్రమే అని ఆరోపణలు రావడంతో ఫైల్‌ను పరిశీలన కోసం అమరావతి పంపించారు. రూ.30 కోట్ల వ్యయం ఒక్కసారిగా రూ.90 కోట్లకు ఎందుకు పెరిగిందనే దానిపై అక్కడ అధికారులు ఆలోచిస్తున్నారు. అందులో మతలబు ఏమిటో తేల్చాలని పక్కనపెట్టారు. దాంతో టెండర్లు కూడా పిలవలేని పరిస్థితి ఏర్పడింది.  


కొండపై సరికాదు

కైలాసగిరి సందర్శనకు రోజూ వందల సంఖ్యలో పర్యాటకులు వస్తారు కాబట్టి వారంతా అక్కడ ఏమి పెట్టినా సందర్శిస్తారనే అభిప్రాయంతో ప్లానిటోరియం నిర్మాణానికి నడుం కట్టారు. కానీ ఇక్కడ తెలుగు మ్యూజియం పరిస్థితిని విస్మరించారు. దాదాపు రూ.25 కోట్ల వ్యయంతో అదే కైలాసగిరిపై తెలుగు మ్యూజియం ఏర్పాటుచేశారు. సందర్శనకు రూ.40 టిక్కెట్‌ పెడితే రోజుకు 40 మంది కూడా వెళ్లడం లేదు. దాని నిర్వహణకు కూడా డబ్బులు రాకపోవడంతో మూడేళ్ల నుంచి దానిని మూసేశారు. ఈ విషయం వీఎంఆర్‌డీఏలో చాలా కాలం నుంచి పనిచేస్తున్న అధికారులకు తెలుసు.  


ఎలాంటి ఇబ్బందులు వస్తాయంటే..?

 అధికారులు పేర్కొన్న డిజైన్‌లో ప్లానిటేరియం నిర్మాణం చేయడం అనుకున్న సమయంలో జరగదు. టెండర్లు పిలవకుండానే 2023 నాటికి పూర్తిచేస్తామని చెబుతున్నారు. కనీసం ఐదు నుంచి ఆరేళ్ల కాలం పడుతుంది. అంటే వ్యయం ఇప్పుడు అనుకున్న రూ.90 కోట్లను దాటి రూ.150 కోట్లకు వెళ్లినా ఆశ్చర్యపోవలసిన పనిలేదు. అలాగే కైలాసగిరిపై కాకుండా ప్లానిటోరియాన్ని అందరికీ అందుబాటు ప్రాంతంలో ఏర్పాటుచేయాలి. ఒక్క ప్లానిటోరియం నిర్మిస్తే దాని ద్వారా వచ్చే ఆదాయం నిర్వహణకు సరిపోదు. పక్కన కేఫ్‌టేరియా, వినోద సంబంధమైనవి ఏర్పాటు చేస్తే..వాటి ద్వారా వచ్చే ఆదాయం కూడా ఉపయోగించుకోవచ్చు.  


సైన్స్‌ ఫిక్షన్‌ను తలపిస్తోంది

సోహన్‌ హట్టంగడి, పర్యావరణ వ్యాఖ్యాత

వీఎంఆర్‌డీఏ రూపొందించిన డిజైన్‌ చూస్తే సైన్స్‌ ఫిక్షన్‌లా అనిపిస్తోంది. అటువంటి నిర్మాణం చాలా క్లిష్టం. అనేక ఏళ్లు పడుతుంది. గొప్పలకు పోకుండా బిర్లా, నెహ్రూ ప్లానిటేరియం మాదిరిగా నిర్మిస్తే సరిపోతుంది. వాటిని ఎంతో అధ్యయనం చేసి నిర్మించారు. వాటిని అనుసరించడంలో తప్పులేదు. నిర్వహణ వ్యయం కూడా ఆలోచించాలి. కైలాసగిరిపై దీని నిర్మాణం తగదు. నగరంలో అందరికీ అందుబాటులో వుండే ప్రాంతంలో నిర్మించడమే మంచిది.